Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్‌… కేసు నమోదు చేసిన పోలీసులు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధారం రోజు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ర్యాలీ కి అనుమతి లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు రాంబాబు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టి వేసి తన అనుచరులను తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో పోలీసులు, అంబటి రాంబాబు మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది.. దీంతో, పోలీస్ విధులను అడ్డుకోవడంపై పట్టాభి పురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. బీఎన్ఎస్ 132, 126(2), 351(3), 189(2) సెక్షన్ల కింద కేసు నమోదు పట్టాభిపురం పోలీసులు..

ఏపీలో మరో భారీ పెట్టుబడి.. రూ.82 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న రెన్యూ పవర్‌..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్‌ లాంటి సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టడం.. దీనికి సంబంధించి ఎంవోయూ కూడా జరిగిపోయిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు రెన్యూ పవర్‌ అనే సంస్థ.. ఏపీలో భారీ పెట్టుబడి పెట్టుందుకు ముందుకు వచ్చింది.. రెన్యూ పవర్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది అని వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌.. ఈ మేరకు ట్వీ్‌ట్‌ చేశారు (ఎక్స్‌లో పోస్టు) పెట్టారు మంత్రి నారా లోకేష్‌.. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్‌ సంస్థ అడుగుపెట్టనుంది.. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుంది.. అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ నుండి వైదొలిగిన ఐదేళ్ల తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పునరుత్పాదక ఇంధన విలువ చైన్‌పై రెన్యూ పవర్‌ సంస్థ పెట్టుబడి పెడుతోందని ప్రకటించడం నాకు గర్వకారణం అని పేర్కొన్నారు నారా లోకేష్‌… రూ. 82,000 కోట్ల పెట్టుబడితో, రెన్యూ పవర్‌ సంస్థ.. సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మరియు అణువుల వరకు హై టెక్నాలజీ రంగాలలో పెట్టుబడి పెడుతుందని వెల్లడించారు.. ఇక, వైజాగ్‌లో జరిగే CII భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి.. రెన్యూ పవర్‌ సంస్థ ఫౌండర్‌, చైర్మన్ అండ్‌ సీఈవో సుమంత్ సిన్హా.. మరియు రెన్యూ పవర్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌.. కాగా, ఏపీకి మరో భారీ పెట్టుబడి వస్తుంది.. రేపు ఉదయం 9 గంటలకు వెల్లడిస్తానంటూ బుధవారం రోజు ట్వీట్‌ చేసిన మంత్రి నారా లోకేష్‌.. ఈ రోజు.. ఆ పెట్టుబడికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. మరో ట్వీట్ చేశారు..

బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిమాణం.. నిందితుడిగా వైసీపీ విద్యార్థి సంఘం నేత
విజయవాడలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిని నిందితుడిగా చేర్చారు పోలీసులు.. ఈ కేసులో ఏ5గా కొండారెడ్డి పేరును చేర్చారు మాచవరం పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో ఏ6 మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బయటపడ్డ వివరాల ఆధారంగా కొండారెడ్డి పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది. కొండారెడ్డికి డ్రగ్స్ కొనుగోలులో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు.. కొండారెడ్డికి ఏ4 నిందితుడు లోహిత్ యాదవ్, అలాగే ఏ6 మధుసూదన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.. లోహిత్ యాదవ్ ద్వారా మధుసూదన్ రెడ్డి నుంచి MDMA డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, డ్రగ్స్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు. నిందితుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా రికార్డులు తదితర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

“క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది..! చంద్రబాబుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌ మా హయాంలోనే అభివృద్ధి చెందింది అంటే.. లేదు.. మేమే డెవలప్‌ చేశాం అంటూ కూటమి సర్కార్‌.. వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ వ్యవహారంలోనూ దీనిపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మధ్య.. ఆయా సంస్థల క్రెడిట్‌పై విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రభుత్వ పథకాల అమలు.. ఇళ్ల కేటాయింపు.. ఇలా అన్నింటి విషయంలో ఇదే జరుగుతూనే ఉంది.. అయితే, చంద్రబాబు విజయవంతంగా క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని.. మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ మేరకు ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఓ పోస్టు పెట్టారు జగన్‌.. వైఎస్‌ జగన్‌ చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే.. “చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా… దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా… ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా… గత ప్రభుత్వం అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయస్సార్‌సీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను,మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్‌ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు.”అంటూ మండిపడ్డారు..

శేషాచలం అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం..! వీడియో విడుదల చేసిన పవన్‌ కల్యాణ్‌..
శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం.. జనసేన పార్టీ బిగ్ ఎక్స్‌పోజ్‌ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తాను స్వయంగా బహిర్గతం చేశారు.. మంగళంపేట అటవీ భూముల్లో అక్రమ ఆక్రమణలపై పవన్ కల్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్స్‌తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్‌ ఘాట్స్‌ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూకబ్జా బయటపడింది అన్నారు. ఈ భూములు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కల్యాణ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరగిందని అని తెలిపారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్వయంగా తాజా తిరుపతి పర్యటన లో సైట్‌ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. ఇక, ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని పవన్ కల్యాణ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్‌ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీమ్‌లతో విచారణ జరపాలని సూచించారు. అన్ని భూసమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి.. వాటిని కబ్జా చేసేవారిని విడిచిపెట్టం.. అని పవన్ కల్యాణ్‌ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ, వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసినవారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

ఆర్టీసీలో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి..
మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. తాజాగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీ కి ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు ,బస్ స్టేషన్ లలో & టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు.

అమల్లోకి మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. కండీషన్‌ ఏంటంటే..?
మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.. చేసే పని ఏదైనా సరిగా చేయలేకపోతారు.. ఈ సమయంలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. ఆ సమయంలో కడుపునొప్పి వాళ్లను తీవ్రంగా వేధిస్తుంది.. అయితే, మహిళలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కర్ణాటక ప్రభుత్వం నెలసరి సమయంలో సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది.. ఇది పరిశ్రమలలో 18–52 సంవత్సరాల వయస్సు గల మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రోజును మంజూరు చేస్తుంది.. వైద్య ధృవీకరణ పత్రాలు అవసరం లేకుండా ఈ సెలవు పొందవచ్చు.. కార్యాలయాన్ని ఆరోగ్యవంతంగా మార్చే విప్లవాత్మక చర్యలో భాగంగా, కర్ణాటక ప్రభుత్వం బుధవారం అన్ని ఉద్యోగ మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన రుతుక్రమ సెలవును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 18 నుంచి 52 సంవత్సరాల మధ్య వయస్సు గల, శాశ్వత, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్స్ ఉద్యోగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. గత నెలలో కర్ణాటక మంత్రివర్గం రుతుక్రమ సెలవు విధానాన్ని ఆమోదించింది. దీనితో, అటువంటి నియమాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది..

17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన దర్యాప్తు సంస్థలు.. తవ్వేకొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. ప్రధానంగా అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. దేశ వ్యాప్తంగా నాలుగు నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా తేలింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమ్మిల్ డైరీల్లో ఈ ఉగ్ర ప్రణాళికను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్ర కుట్రకు యూనివర్సిటీలోని 17వ నెంబర్ భవనాన్ని ఉపయోగించుకున్నట్లుగా కనిపెట్టారు. ఈ భవనంలో ముజమ్మిల్‌కు 13వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లుగా తేలింది. గదిలో కొన్ని కెమికల్స్‌, డిజిటల్‌ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేపే బీహార్‌ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఇక మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. దీంతో అధికార కూటమిలో ఫుల్ జోష్ నెలకొంది. మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లుగా తెలియడంతో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధపడుతున్నారు. ఇంకోవైపు స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేస్తున్నారు.

28 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌, 4 వేల బ్యాంక్ ఆఫర్.. 60 వేల Samsung Galaxy S24 FE ఫోన్ 3 వేలే!
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి అవకాశం. ఫ్లాష్ మెమరీ కొరత.. ధరల పెరుగుదలకు దారితీసిందని ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మీరు సగం కంటే తక్కువ ధరకే శక్తివంతమైన శామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ (Samsung Galaxy S24 FE) మోడల్‌ను మీరు 28 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం రూ.59,999 ( 8జీబీ+128జీబీ) ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు రూ.28,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,999కి అందుబాటులో ఉంది. అంటే మీకు 46 శాతం తగ్గింపు లభిస్తోంది. మీకు బ్యాంక్ ఆఫర్‌ కూడా అనుదుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ.4,000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ ఫోన్ ధర రూ.27,999కి తగ్గుతుంది. రూ.24,600 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ వర్తిస్తే.. గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ రూ.3,399కి మీ సొంతం అవుతుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ ఉండకూడదు.

ఊహించని షాక్.. బంగారంపై రూ.2290, వెండిపై రూ.10000!
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. అనంతరం వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మరలా షాక్ ఇస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నిన్న స్వల్పంగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము పసిడి ధర రూ.229 పెరిగి.. రూ.12,780 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.210 పెరిగి.. 11,715గా కొనసాగుతోంది. గురువారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,27,800గా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,150గా నమోదయింది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.2,290.. 22 క్యారెట్లపై రూ.2,100 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల రేటు రూ.1,17,150గా పలుకుతోంది. విశాఖ, విజయవాడలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.

గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌‌ కోసం వచ్చే అభిమానులకు.. రాజమౌళి సూచనలు
ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఆధ్వర్యంలో జరగబోతున్న “గ్లోబ్ ట్రోటర్” (Globetrotter) ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నవంబర్‌ 15న జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన అధికారిక X ఖాతా ద్వారా పాల్గొనేవారికి కొన్ని కీలక సూచనలు చేశారు. అయన ట్వీట్‌లో పేర్కొంటూ.. “నవంబర్‌ 15న జరిగే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, సురక్షితమైన మరియు సంతోషకరమైన అనుభవాన్ని అందించడానికి పోలీసులు మరియు భద్రతా సిబ్బందితో సహకరించండి, ఈవెంట్‌‌కు 18 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదు. ఇక  ఈవెంట్ రోజున RFC ప్రధాన ద్వారం మూసివేయబడుతుంది.  ఈ ఈవెంట్‌‌ అనేది ఓపెన్ ఈవెంట్ కాదు.. కేవలం ఫిజికల్ పాసులు ఉంటేనే రండి . అలాగే   విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వాళ్ల కోసం పాస్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుంది. ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారు – రాజమౌళి” అని తెలిపారు.

21న తెలుగులో ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’
వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ (The Face of the Faceless) మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ మూవీ నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమా ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్ కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా. నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు. రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది, ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసింది. ఈ చిత్రం సీనియర్ రాణి మరియా వట్టలిల్ ఎదుర్కొన్న కష్టాల గురించి. ఆమె అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసింది. ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్‌లో విన్సీ అలోషియస్ సీనియర్ రానియా మరియా పాత్రను పోషించారు.

Exit mobile version