Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మాజీ మంత్రి సంచలనం..! రప్పా.. రప్పా.. అనేది కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి అంతే..!
పుష్ప సినిమాలోని ‘రప్పా.. రప్పా..’ డైలాగ్‌ కాస్తా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఈ డైలాగ్‌ వాడడం.. ఆ డైలాగ్‌ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నోటి వెంట.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇలా.. రప్పా.. రప్పా.. రాజకీయాల్లో తిరిగేసింది.. అయితే, ఆ డైలాగ్‌ను గుర్తు చేస్తూనే.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.. కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు. రప్పా రప్పా అనేది మెయిన్ కాదని.. అది చీకట్లో జరిగిపోవాలన్నారు.

చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన ఇంఛార్జ్‌ సహా ఐదుగురి అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన యువకుడు.. తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యారు.. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. కాళహస్తి గోడౌన్‌లో రాయుడు అనే యువకుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, అరెస్ట్‌ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్‌ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు ఉన్నారు.. అయితే, రాయుడును చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసిన నిందితులు.. ఈనెల 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డులోని నివాస ప్రాంతం వెనుక అతడి మృతదేహాన్ని పడవేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగించి హత్యలో పాల్గొన్న కాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్, చంద్రబాబుతో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. అసలు, రాయుడును ఎందుకు చిత్రహింసలు పెట్టారు.. అంత దారుణంగా హత్యకు చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. నిందితులను కాళహస్తి తీసుకెళ్లి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు….

మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చిన సీఎం.. ఆనందానికి అవదులు లేవు అంతే..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓ మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చాడు.. ఆ కుటుంబంలో ఆనందం నింపారు.. ఇక, ఆ చిన్నారి ఆనందానికి అవదులు లేవనే చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌ నిర్వహించిన విషయం విదితమే కాగా.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ మరుసటి రోజే.. ఆ చిన్నారి కోరిక తీర్చారు సీఎం.. ఇక, ఆనందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు చిన్నారులు. ఒక్క చిన్నారి కోరిక మేరకు ఆ కుటుంబంలోని నలుగురికి సూకిళ్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. ఆ వెంటనే నాలుగు సైకిళ్లను ఆ కుటుంబంలోని చిన్నారులకు అందజేశారు జిల్లా అధికారులు. జులై 10వ తేదీన కొత్త చెరువులో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో తల్లికి వందనం పథకం కింద ఆ కుటుంబంలోని నలుగురుతో ముచ్చటించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇల్లు లేదని.. అద్దె ఇంట్లో ఉన్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది ఆ చిన్నారుల తల్లి మాధవి.. అంతేకాదు.. చిన్నారి కూడా సైకిల్ కావాలని తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, వెంటనే సైకిళ్లు అందించాలని సీఎం ఆదేశించడం.. ఆ మరుసటి రోజే ఆ చిన్నారుల కోరిక తీరుస్తూ.. నలుగురికి విద్యార్థులు సైకిళ్లు అందించడంతో.. ఆనందంతో ఆ చిన్నారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు..

టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమత ఉద్యోగులు..! బండి సంజయ్‌కి మాజీ చైర్మన్‌ కౌంటర్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమతస్థ ఉద్యోగుల అంశం చిచ్చు కొనసాగుతూనే ఉంది.. నిన్నటి రోజున శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీలో వున్న వెయ్యి మందికి పైగా అన్యమతస్థులను సాగనంపాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు దుమారం రేపగా.. దీనిపై కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అసలు, టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థ ఉద్యోగులు వున్నారని ఏ ప్రాతిపదికన.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వాఖ్యలు చేశారని ప్రశ్నించారు కరుణాకర్ రెడ్డి. టీటీడీలో 22 మంది అన్యమతస్థ ఉద్యోగులు వున్నారని ప్రస్తుత పాలకమండలి ఇటీవలే ప్రకటించిందని గుర్తు చేసిన కరుణాకర్‌ రెడ్డి.. మరి బండి సంజయ్ వెయ్యి మంది వున్నారని ఏ నివేదిక ఆధారంగా ఆరోపించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. బండి సంజయ్ వ్యాఖ్యలో కుట్రకోణం దాగి వుందన్న అనుమానాలు కలుగుతున్నాయన్న ఆయన.. 20 శాతం టీటీడీ ఉద్యోగులు అన్యమతస్థులంటూ బండి సంజయ్ వాఖ్యలు చేయడం.. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ వాఖ్యలపై ఇప్పటి వరకు టీటీడీ కానీ, ప్రభుత్వం గానీ.. స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీటీడీలో 20 శాతం మంది అన్యమతస్థులు వుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు కరుణాకర్ రెడ్డి. దీనిపై టీటీడీ ఉద్యోగులు కూడా స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి..

ఏపీలో తాజా పరిణామాలపై జగన్‌ సంచలన ట్వీట్..
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా సంచలన ట్వీట్‌ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ ఫైర్‌ అయిన ఆయన.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది.. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది. పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు.. పోలీసు రాజ్యంమా? నియంతృత్వ రాజ్యమా? అన్నట్టుగా మారింది అంటూ ఆరోపణలు గుప్పించారు. చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అణచివేతలు, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్షం, ప్రజలు, నిరసనకారుల గొంతును రాష్ట్రంలో నులుమేస్తున్నారన్న ఆయన.. గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారు. పల్నాడులో పోలీసు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్తే ఐదు కేసులు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు.. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారు అంటూ ధ్వజమెత్తారు..

సిట్‌ విచారణకు విజయసాయిరెడ్డి హాజరుపై సస్పెన్స్‌..! అధికారులకు మాజీ ఎంపీ సమాచారం
ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్‌ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌) ముందు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుపై సస్పెన్స్‌ కొనసాగుతోనే ఉంది.. తాజా నోటీసుల ప్రకారం.. సిట్‌ ముందు నేడు విజయసాయిరెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం కారణంగా ఇవాళ విచారణకు రాలేనని విజయసాయి రెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. తాను ఎపుడు విచారణకు వచ్చే తేదీని తెలియచేస్తానని విజయ సాయిరెడ్డి సిట్ కు చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు సిట్ ముందు విచారణకు విజయ సాయి రెడ్డి హాజర య్యారు. చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉన్నందున విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. దీంతో, విజయ సాయి రెడ్డి సిట్ విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు, లిక్కర్‌ కేసులో విజయసాయిరెడ్డి.. సిట్‌ ముందు హాజరైన తర్వాతే.. సిట్‌ మరింత దూకుడు పెంచింది.. కేసులు నమోదు చేసింది.. పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్‌ చేసింది.. ఈ నేపథ్యంలో మరోసారి సాయిరెడ్డి సిట్‌ ముందుకు వస్తే.. ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు.. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోనుంది అనేది ఉత్కంఠగా మారింది..

ఐదో సంతానంలో ఆడ పిల్ల.. 2 లక్షలకు బేరం పెట్టిన తల్లి
నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఓ ఆడ శిశువు విక్రయించే ఘటన కలకలం రేపుతోంది. ఐదో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, తాము పోషించలేమని తల్లిదండ్రులే అమ్మేశారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తోంది. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులు ఇప్పటికే నలుగురు పిల్లల తల్లిదండ్రులు. ఐదవ సంతానంగా పుట్టిన ఆడపిల్లను స్థానికుల అనుమానంతో చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

నీతీశ్‌ సర్కార్ శుభవార్త.. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారపక్షమైన ఎన్డీయే ఇప్పటికే మహిళా రిజర్వేషన్, పెన్షన్ పెంపుపై హామీ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో పథకం ఇచ్చేందుకు నీతీశ్‌కుమార్ ప్రభుత్వం సిద్దమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించింది కానీ.. కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడానికి ఇంధన శాఖ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనను మొదట ఆర్థిక శాఖకు పంపగా.. అక్కడ ఆమోదించబడింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. వినియోగదారులు 100 యూనిట్ల వరకు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. 100 యూనిట్లు దాటితే.. యూనిట్‌కు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి మొదటి 50 యూనిట్లకు.. ఒక్కో యూనిట్‌కు రూ.7.57 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత రూ.7.96 ఛార్జీ చేస్తున్నారు.

చాట్‌జీపీటీ మెడికల్ మిరాకిల్..! 10 ఏళ్లుగా పరిష్కారం లేని ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపిన ఏఐ..!
ఈరోజుల్లో టెక్నాలజీ మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగమైపోయింది. కుటుంబం, స్నేహితులు కంటే ఎక్కువగా మనం మొబైల్‌, చాట్‌బాట్‌లతో కనెక్ట్ అవుతుంటాం. అలాంటి టెక్నాలజీలో ఒకటి .. చాట్‌జీపీటీ (ChatGPT). ఏ చిన్న సందేహం వచ్చినా, ఏదైనా సలహా కావాలన్నా, మొదట గుర్తుకు వచ్చేది ఇదే. అయితే ఇటీవల, ఈ చాట్‌బాట్ ఓ అసాధారణమైన పని చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్ ప్రకారం, గత 10 ఏళ్లుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి చాట్‌జీపీటీ కేవలం కొన్ని సెకన్లలోనే వ్యాధిని గుర్తించిందట! ‘‘ChatGPT, 10+ ఏళ్ల సమస్యకు కొన్ని నిమిషాల్లో పరిష్కారం చూపింది. డాక్టర్లు కూడా కనుగొనలేకపోయారు’’ అంటూ shwetak.ai అనే అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేయబడింది. అయితే ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. అతను ఎన్నో రక్తపరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌లు చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా అనేక ప్రఖ్యాత ఆసుపత్రులలో చికిత్స పొందాడు. న్యూరాలజిస్టులు సహా అనేక మంది నిపుణులను సంప్రదించాడు. అయినా తన సమస్యకు అసలు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఫంక్షనల్ హెల్త్ టెస్టింగ్‌ ద్వారా అతనికి హోమోజైగస్ A1298C MTHFR జన్యుపరమైన మార్పు ఉందని తేలింది. ఇది జనాభాలో 7-12% మందిలో మాత్రమే కనిపించే అరుదైన మార్పు అని వైద్యులు చెప్పారు.

భారీ షాకిస్తున్న బంగారం.. మళ్లీ లక్షకు చేరువలో పసిడి! వెండిపై ఏకంగా 4 వేలు
కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 91,400గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.91,550గా.. 24 క్యారెట్ల ధర రూ.99,860గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!
హరియాణాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్‌ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 25 ఏళ్ల రాధికాను ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ (49) గన్‌తో కాల్చిచంపాడు. గురువారం (జులై 10) రాధికా ఇంట్లో వంట చేస్తుండగా.. దీపక్‌ వెనక నుంచి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో టెన్నిస్ ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరాన్ని అంగీకరించిన దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య ఘటనకు కొన్ని రోజుల ముందే దీపక్‌ యాదవ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. దీపక్ గత 15 రోజులుగా సరిగా నిద్రపోలేదని, ఇంట్లో విశ్రాంతి లేకుండా తిరిగేవాడని, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని పోలీసులు తెలిపారని కొన్ని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. కొంతకాలంగా దీపక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, రాధిక తన తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చేదని పేర్కొన్నాయి. దీపక్‌ కొన్ని రోజుల క్రితం వజీరాబాద్‌లోని తన గ్రామానికి వెళ్లగా.. అక్కడ కొంతమంది గ్రామస్థులు ఆయనపై విమర్శలు చేశారు. దీపక్‌ కుమార్తె ఆదాయంతో జీవిస్తున్నాడని ఎగతాళి చేశారు. కూతురు రాధికను కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నాడని విమర్శించారు.

‘యానిమల్’ లో రణబీర్ లాంటి వ్యక్తితో డేటింగ్ చేస్తా..
వరుస సినిమాలతో అలరిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక కెరీర్‌కు, ‘యానిమల్’ మూవీ ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే.. అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా రష్మికను.. ఓ ఇంటర్వ్యూలో నిజ జీవితంలో యానిమల్ ల్లో హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకురాగలరా? అని ప్రశ్న ఎదురవ్వగా .. ఆసక్తికర సమాధానమిచ్చింది రష్మిక. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇదే ఇంటర్వ్యూలో ఆమె ప్రేమపై తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. “మనం ఎవరినైనా ప్రేమిస్తే.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మార్పు కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుంది. ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారతారు. మీ ప్రాణ స్నేహితుడితో కాని, మీ భాగస్వామితోనే కాని కొంతకాలం కలిసి ప్రయాణించాక అకస్మాత్తుగా పాత రోజులను గుర్తుచేసుకుంటే వారి కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుంది. ఆ మార్పునకు ఒక్కోసారి మీరే ఆశ్చర్యపోతారు” అని చెప్పారు. తాను అర్ధంచేసుకునే భాగస్వామి గురించి మాత్రమే మాట్లాడినట్లు తెలిపారు.

‘పెద్ది’ నుండి శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. వెంకట సతీష్ కిలారు నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజువల్ పరంగా సినిమాకి ప్రత్యేకంగా నిలిచేలా ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంగీతానికి ఎ.ఆర్. రెహమాన్  అందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు కూడా భాగా పెరిగిపోయ్యాయి. అయితే తాజాగా చిత్రబృదం నేడు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను ‘పెద్ది’ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా విడుదలైన శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్‌ సినిమాలోని అతని పాత్ర ఎంత బలమైనదో చూపించింది. మందపాటి హ్యాండిల్ బార్ మీసం, గంభీరమైన చూపుతో.. శివరాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version