వైసీపీకి మరో భారీ షాక్.. పార్టీకి మాజీ మంత్రి గుడ్‌బై..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఘన విజయాన్ని సాధించి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఇక, అప్పటి నుంచి వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు.. పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు.. పార్టీ నేతలు.. పార్టీకి గుడ్‌బై చెబుతూ.. కూటమి పార్టీలో చేరుతూనే ఉన్నారు.. ఇప్పుడు వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగిలింది.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశారు అవంతి శ్రీనివాస్.. కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు అవంతి శ్రీనివాస్.. 2019 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్.. వైసీపీ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.. అయితే, అవంతి పార్టీ వీడుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.. చివరకు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై.. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు.. అయితే, “నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నీ రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను” అంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు..
వైసీపీకి రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అవంతి
వైసీపీకి షాక్ ఇస్తూ.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. “నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నీ రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను” అంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవంతి.. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్నారు అవంతి.. సమయం ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రొడ్డెక్కడం సరైనది కాదని హితవు చెప్పారు.. బ్రిటీష్ ప్రభుత్వం తరహాలో తాడేపల్లిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేయమని చెప్పడం కరెక్ట్ కాదన్న ఆయన.. ఎన్నికలు అయిన ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ కేడర్ రొడ్డెక్క మనడం కరెక్ట్ కాదన్నారు.. 2024 ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఒక కేస్ స్టడీగా అభివర్ణించారు.. అభ్యర్థులు కంటే అధినాయకుడిని చూసే జనం ఓట్లు వేశారు.. ఓటమికి ఎవరినో నిందించడం నా ఉద్దేశం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. భీమిలి నియోజకవర్గం కోసం విస్తృతమైన సేవ చేశాను.. జిల్లాలో ఏకైక మంత్రిగా శక్తివంచన లేకుండా పనిచేశాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఐదేళ్ల కోసం ఎంచుకున్న ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకంగా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు పరిమితంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. మరోవైపు.. వైసీపీ రాజీనామా చేయగానే.. తెలుగుదేశం పార్టీ నేతలు అవంతి శ్రీనివాస్‌తో టచ్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.. గతంలో టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేసిన అవంతి.. ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయిన విషయం విదితమే..
అనర్హులకు పెన్షన్లు.. ప్రతీ 10 వేల మందిలో 500 మంది అనర్హులే..!
ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.. అయితే, గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారు.. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇక, వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు, గ్రామీణ ఉపాధి హామీ పథకం డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాల్సిన కార్యక్రమం అన్నారు.. వందరోజులు పనిదినాలను సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందన్న ముఖ్యమంత్రి.. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.. పల్లె పండుగలో 14.8 పర్సెంట్ మాత్రమే పనులు చేశారని ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉందన్న సీఎం.. అల్లూరి జిల్లాలో 54శాతం పూర్తైతే మరో జిల్లాలో 1.6 శాతం మాత్రమే పనులు జరగటంపై ప్రశ్నించారు. పని పూర్తైన వెంటనే బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని నిలదీశారు.. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.. జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం మొత్తం దెబ్బ తీసిందన్న సీఎం.. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామన్నారు.. గ్రామాల్లో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.. మరోవైపు.. తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని సూచించారు.. ఇక, దివ్యాంగులు చాలా మంది 15 వేల పెన్షన్ అడుగుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్లు.. సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు..
సంచలనం సృష్టించిన హత్య.. కువైట్ నుంచి వచ్చి చంపేసి వెళ్లాడు.. తర్వాత వీడియో వదిలాడు..!
కన్న కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని కువైట్ నుంచి వచ్చి.. అనుకున్న పని కానిచ్చి.. తిరిగి వెళ్లిపోయాడు.. ఆ తర్వాత వీడియో విడుదల చేసి.. తప్పంతా పోలీసులదే అంటూ మండిపడుతున్నాడు ఓ నిందితుడు . అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో నిద్రిస్తున్న వికలాంగుడిని అత్యంత దారుణంగా తగల పగలగొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే, ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కన్నకూతిరిపట్ల ఆ వికలాంగుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ కోపంతో కువైట్ నుంచి వచ్చి.. చంపి అక్కడి నుంచి తిరిగి కువైట్ కి వెళ్లినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే సంఘటన ఇది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. సరిగా స్పందించక పోవడంతో ఒక వ్యక్తి ఏకంగా కువైట్ నుంచి వచ్చి అతడిని హత్య చేశాడు. ఎవ్వరికి తెలియకుండా తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం అతడు ఒక వీడియో విడుదల చేశాడు. దీంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు (59) హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది.
నేరుగా రాజమండ్రి టు ఢిల్లీ.. విమాన సర్వీస్ ప్రారంభం..
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్.. తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమాన ప్రయాణం విషయంలో డబ్బు కంటే సమయం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో విమానాశ్రయాలు 74.. కానీ, ఇప్పుడు దేశంలో విమానాశ్రయాలు సంఖ్య 158కి పెరిగిందని తెలిపారు.. త్వరలో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నూతన టెర్మినల్ భవనం కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఢిల్లీ ప్లైట్ లో నేరుగా.. రాజమండ్రి వాసులతో సంతోషం పంచుకునేందుకు వచ్చాను అన్నారు రామ్మోహన్ నాయుడు.. ఇవాళ పార్లమెంట్ సెషన్స్ , కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. తిరిగి అదే ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు..
రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు.. ఏసీబీ కస్టడీకి ఏఈఈ నిఖేష్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ ను కోర్టు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. దీంతో చంచల్ గూడ జైల్ నుండి ఏఈఈ నిఖేష్ ను నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ తీసుకున్నారు. హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్న నిఖేష్ ఆదాయానికి మించి రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీకి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1న నిఖేష్ ఇంటితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం నిఖేష్‌కు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం నిఖేష్‌కు 14 రోజుల పాటు జ్యేడీషిల్ రిమాండ్ విధించింది. బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఏకీభవించిన కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ నిఖేష్ ను ఏసీబీ కస్టడీకి తీసుకునింది.
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది..
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. “బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు” అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013 లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని కవిత గుర్తు చేశారు. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే అన్నారు. 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదని తెలిపారు. కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తోందన్నారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని తెలిపారు.
నేటి నుంచి సెక్రటేరియట్‌లో అటెండెన్స్.. లేటుగా వస్తే లాసేనా..
తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటలకే ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుండి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వర్తిస్తుందని తెలిపారు. సమయం సందర్భం లేకుండా.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులకు వస్తున్నారని, వారి సమయానికి వెళ్లిపోతున్నారని ఆరోపణల వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని సీఎస్ ప్రవేశపెట్టారు. సెక్రటేరియట్ లోకి ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద ఈ పరికరాలను అమర్చారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అధికారులు, ఉద్యోగులు, రెగ్యులర్ సిబ్బందితో పాటు సచివాలయ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా వేతనాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి ఒక్కరు ఇన్ టైం.. ఔట్ టైం అటెండెన్స్ తప్పనిసరి అంటూ సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ అటెండెన్స్ సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుంచి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పురుషుల రక్షణకు కూడా చట్టాలు కావాలి.. లేదంటే కోర్టులపై నమ్మకం పోతుంది!
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ సూసైడ్ కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భరణం ఇవ్వకపోతే చచ్చిపోవచ్చని కోర్టులో న్యాయమూర్తి ముందే భార్య అతడిని అనడం.. దానికి జడ్జ్ నవ్వడం అతుల్ సుభాష్‌ను తీవ్రంగా బాధించిందని అతడి బంధువులు తెలిపారు. ఈ సందర్భంగా నా సోదరుడికి న్యాయం జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను.. పురుషులకు కూడా ఈ దేశంలో చట్టబద్దమైన న్యాయం అందించాలని కోరారు. ఇక, న్యాయమూర్తిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ సోదరుడు వేడుకున్నాడు. ఇలాంటి అవినీతి కొనసాగితే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించాడు. కోర్టులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పుకొచ్చాడు. ఇక, తాము ఏటీఎం యంత్రాల వలే మారిపోతామని అనుమానంతో పెళ్లిళ్లు అంటేనే పురుషులు భయపడే పరిస్థితికి దారి తీసిందని బెంగళూరు టెకీ సోదరుడు పేర్కొన్నాడు. తన సోదరుడు విడాకుల కేసుకు సంబంధించి అతుల్ సుభాష్ 40 సార్లు బెంగళూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌కు తిరిగాడని ఆయన వెల్లడించారు. మరోవైపు, అతుల్ సుభాష్ భార్య నిఖిత సింఘానియా కూడా ప్రత్యారోపణలు చేసింది. సుభాష్ తల్లి అదనపు కట్నం కోసం వేధించింది.. అలాగే, నా భర్త రోజు మద్యం తాగి వచ్చి నన్ను కొట్టేవాడని ఆరోపించింది. అసలు నన్ను ఒక మనిషిలా చూసేవాడు కాదు.. నన్ను బెదిరించి నా జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకొనేవాడని నిఖిత చెప్పుకొచ్చింది.
కేబినెట్ కూర్పుపై షిండే మళ్లీ అలక.. ఢిల్లీ టూర్‌కు దూరం!
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితుల మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది. చివరికి బీజేపీనే.. ఆ పీఠాన్ని దక్కించుకుంది. దేవేంద్ర ఫడ్నవిస్… సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అయిష్టంగానే ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫడ్నవిస్ కేబినెట్ కూర్పు చేస్తున్నారు. ఇందుకు హైకమాండ్ పెద్దలను కలిసేందుకు బుధవారం హస్తినకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ను కలిశారు. అమిత్ షాతో మంత్రివర్గంపై చర్చించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. శివసేన నేత షిండే మాత్రం హస్తినకు వెళ్లలేదు. ముంబైలోనే ఉన్నారు. అయితే శివసేన హోంమంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా సమాచారం. కానీ హోంశాఖను ఇచ్చేందుకు ఫడ్నవిస్ సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. హోంశాఖను తన దగ్గరే పెట్టుకోవాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మూడు రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. వరుసగా మూడు రోజులు పెరిగాయి. రూ.160, రూ.820, రూ.870 పెరగడంతో.. గోల్డ్ రేట్ మరలా 80 వేలకు చేరువైంది. పెరుగుదలలో హ్యాట్రిక్ కొట్టిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం భారీగా పెరుగుతోంది. మంగళవారం కిలో వెండిపై రూ.4,500 పెరగగా.. నిన్న రూ.1,000 తగ్గింది. నేడు మరలా రూ.1,000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,04,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.96,500గా ఉంది.
ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు: ఐపీఎల్ యజమాని
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న మహీకి ఏమాత్రం ఫ్యాన్‌బేస్ తగ్గలేదు. భారత ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ధోనీని అభిమానిస్తారు. ఫాన్స్ మాత్రమే కాదు.. ఐపీఎల్ యజమానులు కూడా మిస్టర్ కూల్‌ను గౌరవిస్తారు. మహీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అభిమానిస్తారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోయెంకా.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఎంఎస్ ధోనీతో మాట్లాడిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. ధోనీ ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరు.. తన వయసులో ఉన్న వ్యక్తి తనను తాను ఎలా ఆవిష్కరించుకుంటాడో తెలియజేస్తుంది. శ్రీలంక యువ బౌలర్ మతిశా పతిరనను డేంజరస్ మ్యాచ్ విన్నర్‌గా తీర్చిదిద్దాడు. మహీ ఎందరో ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాడు. మైదానంలో కీలక సూచనలు చేస్తాడు. ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో దిట్ట. నేను అతడితో మాట్లాడినప్పుడల్లా ఏదోఒక కొత్త విషయం నేర్చుకుంటా’ అని గోయెంకా చెప్పారు.
గొడవలకు బ్రేక్.. షూటింగ్‌కి మనోజ్
ఫ్యామిలీ గొడవలతో గత రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్న మంచు మనోజ్ వాటికి ఎట్టకేలకు బ్రేక్ ఇచ్చాడు. ఈరోజు షూటింగ్ సెట్‌కి వెళ్ళాడు మంచు మనోజ్ మనోజ్.. ప్రస్తుతం భైరవం సినిమాలో నటిస్తున్నాడు మంచు మనోజ్.. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను నిన్న సాయంత్రమే ఇంటికి పంపేశాడు మనోజ్. ఇక ఈరోజు మంచు మోహన్ బాబు ప్రెస్ ముందుకు రానున్నారు. ఆయన మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక భైరవం సినిమా విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్యా?.. సిద్ధార్థ్ సమాధానం ఇదే!
సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘మిస్ యూ’. ఆషికా రంగనాథ్ హీరోయిన్. తమిళ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా.. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డిసెంబర్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మిస్ యూ నవంబర్ 29న రిలీజ్ కావాలి కానీ.. ‘పుష్ప 2’ కారణంగా వాయిదా పడింది. మిస్ యూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సిద్ధార్థ్.. ఇటీవల పుష్ప 2 ఈవెంట్‌కు వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాజాగా దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్.. పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్‌కు లక్షల్లో జనాలు రావడంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘సినిమాకు, ప్రమోషన్స్ ఈవెంట్‌లకు జనాలు రావడానికి సంబంధం లేదు. ఈరోజుల్లో ఏ పనులు జరుగుతున్నా.. చూడడానికి జనాలు భారీగా వస్తున్నారు’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. కొందరు ఆయన్ని విమర్శించారు కూడా. మిస్ యూ ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ‘మీకు అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?’ అనే ప్రశ్న సిద్ధార్థ్‌కు ఎదురైంది. తనకు ఎవరితోనూ సమస్యలు లేవని, పుష్ప 2 భారీ హిట్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ‘నాకు ఎవరితో సమస్యలు లేవు. పుష్ప 2 భారీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. పుష్ప సూపర్ సక్సెస్ అయింది. అందుకే సీక్వెల్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా థియేటర్‌లకు వెళ్తున్నారు. ప్రమోషన్స్ ఈవెంట్‌లకు ఎంతమంది వస్తే అంత మంచిది. థియేటర్‌లకు కూడా అంతకంటే ఎక్కువగా జనాలు రావాలని కోరుకుందాం. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నటీనటులం అంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. 100 సినిమాలు రిలీజ్ అయితే.. ఒకటి హిట్ అవుతుంది. ప్రతి ఒక్కరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. మిస్ యూ మీకు నచ్చుతుంది. సినిమా బాగా వచ్చింది’ అని సిద్ధార్థ్ అన్నారు.