NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వరద సాయం ప్యాకేజీ.. నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్
వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి.. ఇక, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతినడంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు.. మరోవైపు.. విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు సహా.. మంత్రులు.. అధికారులు.. ఉద్యోగులు.. నిర్విరామంగా కృషి చేశారు.. మరోవైపు.. వరద సాయం ప్యాకేజీకి అవసరమైన నిధుల సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. వరద సాయంపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది ఏపీ సర్కార్. వరద నష్టంపై అంచనా పనులు చేపడుతూనే.. జరిగిన నష్టాన్ని కేంద్ర పెద్దలకు వివరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఇక, వరద నష్టం అంచనా కోసం వారం రోజుల వ్యవధిలోనే రెండో సారి రాష్ట్రానికి వచ్చాయి కేంద్ర బృందాలు. వరద నష్టాన్ని.. ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్.. ఎన్యూమరేషన్ పూర్తి కాగానే.. కేంద్ర సాయం పైనా క్లారిటీ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఈ నెల 17వ తేదీన వరద సాయంపై ప్రకటన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. నష్టపోయిన ప్రతి ఇంటికీ నగదు సాయం కింద ఓ ప్యాకేజీని ప్రకటించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాయం అందించాలని భావిస్తున్నారు ఏపీ సీఎం.. అందులో భాగంగానే ఇప్పుడు నిధుల సమీకరణపై దృష్టి సారించారు..

ఏలేరు వరద ఉధృతి.. కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫోన్..
ఏలేరు వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం.. అన్ని రకాలుగా సన్నద్ధమైన విషయం విదితమే.. కాగా, ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌ తో పాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.. నివాస సముదాయాలను వరద చుట్టుముట్టిన చోట్ల అక్కడి ప్రజలకు తగిన ఆహారం, నీరు, పాలు అందించాలని ఆదేశించారు.. ఏలేరు వరదతో పంటలు కోల్పోయిన రైతులతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాట్లాడుతూ ధైర్యం చెప్పాలని సూచించారు..

వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో ఊరట..
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఊరట లభించింది.. తన పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ జగన్‌.. అయితే, ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్‌ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్‌పోర్ట్‌ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. కాగా, పాస్ పోర్ట్‌ రెన్యూవల్‌పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో సవాల్‌ చేశారు వైఎస్‌ జగన్‌.. మరోవైపు.. సీబీఐ కోర్టు పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు ఐదేళ్లు అనుమతిస్తే, విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలిపింది.. ఇక, ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇప్పటికే ఇరువైపు వాదనలు ముగియగా.. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్ పోర్ట్ కు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది.. అయితే, విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టు ఆదేశాలు ప్రకారం 20 వేల పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.. మొత్తంగా ప్రజా ప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్ పోర్ట్ రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో.. వైఎస్‌ జగన్‌కు ఊరట లభించింది.

ఏపీలో వరద నష్టంపై ముగిసిన కేంద్ర బృందం భేటీ.. శాఖలవారీగా వివరాల సేకరణ..
ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి చేరుకున్నాయి సెంట్రల్‌ టీమ్స్.. రాగానే మొదట.. రాష్ట్ర అధికారులతో సమావేశమై.. వరదల తీవ్రత.. నష్టంపై చర్చించారు.. దాదాపు రెండు గంటల పాటు ఏపీ అధికారులతో సమావేశమైంది కేంద్ర బృందం. ఇక, కాసేపట్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నాయి కేంద్ర బృందాలు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన కొనసాగనుంది.. ఇవాళ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో సెంట్రల్ టీమ్స్ పర్యటించనుండగా.. రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తూ.. వరద నష్టంపై ఆరా తీయనున్నారు.. ఇక, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం వచ్చిందని తెలిపారు.. ఏపీలో వరద నష్టంపై శాఖలావారీగా వివరాలు అందించామన్న ఆయన.. వరద సహాయక చర్యలు ఏం తీసుకున్నామో చెప్పాం. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం ఎంత వచ్చిందో కూడా వివరించామని వెల్లడించారు.. క్షేత్ర స్థాయిలో రెండు సెంట్రల్‌ టీమ్స్ పర్యటిస్తాయి. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో సెంట్రల్ టీమ్స్ పర్యటన కొనసాగుతుందని తెలిపారు ఆర్పీ సిసోడియా.

ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే..!
తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా 547 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పరేడ్ పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు వ్యసాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. గంజాయి, డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఇది ఉద్యోగం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం.. ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే అన్నారు. మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మనదే అని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, వరంగల్ లో పోలీసుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.. ఒక్కో స్కూల్ 50 ఎకరాల్లో నిర్మిస్తాం.. పోలీసుల పిల్లలకు 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు..
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకేట్స్, ఈ సిగరేట్, మద్యం స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ దగ్గర దొరికిన వారిని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఈ సందర్భంగా సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ.. టీఎన్జీఓ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో పుట్టినరోజు పార్టీలో ఎస్ఓటీ పోలీసులు గంజాయి పట్టుకున్నారు అని తెలిపారు. మొత్తం 18 మంది ఉన్నారు.. అందులో 12 మంది యువకులు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. ఇందులో స్టూడెంట్స్ ఎవరూ లేరు.. అంతా మ్యుచువల్ ఫ్రెండ్స్.. మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ బర్త్ డే వేడుకలు చేసుకుందాం అనుకున్నారు.. ఇక్కడ 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. ఇక, 18 మందిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మాకు అప్పగించారు అని సీఐ ఆంజనేయులు తెలిపారు. డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేయగా.. ప్రదీప్, చరణ్, వరుణ్ అనే ముగ్గురు యువకులకు పాజిటివ్ వచ్చింది.. వరుణ్ అనే యువకుడు గంజాయి కొనుగోలు చేశాడు.. సాయి ఆదిత్య అనే యువకుడిది బర్త్ డే.. అమ్మాయిల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులం అని చెప్తున్నారు.. యువకుల్లో ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు.. మిగతా వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు అని గచ్చిబౌలి సీఐ ఆంజనేయులు వెల్లడించారు.

త్వరపడండి.. మారుతీ బాలెనో కార్లపై భారీ తగ్గింపు
మారుతి ప్రీమియం కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లలో మారుతి సుజుకి బాలెనో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ కారు చాలా సంవత్సరాలుగా ఈ విభాగంలో నంబర్-1 స్థానంలో ఉంది. భారతీయ మార్కెట్లో బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ నెలలో (సెప్టెంబర్ 2024) బాలెనోను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లైతే కంపెనీ దానిపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ఈ కారు ధరను కూడా 50,000 రూపాయల వరకు తగ్గించింది. దీని మీద లభించే డిస్కౌంట్ల గురించి తెలుసుకుందాం. బాలెనో కంపెనీ ఫ్లాట్ ధర రూ. 50,000లకు పైగా తగ్గించింది. ఇది కాకుండా, దాని మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌పై రూ. 47,100, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 52,100, సిఎన్‌జి మోడల్‌పై రూ. 37,100 వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. కస్టమర్లకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల ప్రయోజనం ఇవ్వబడుతుంది. ఈ తగ్గింపు ఈ నెల 30 సెప్టెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.66 లక్షలు.

పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి
యునైటెడ్ స్టేట్స్‌లో బ్లైండ్ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్ కృతజ్ఞతలు తెలిపారు. పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలని విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. థండర్ బోల్ట్స్ అధినేత ఫణి చిట్నేని మాట్లాడుతూ.. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదని, భారతీయులకు భావోద్వేగమని వ్యాఖ్యానించారు.

పాపం సర్ఫరాజ్‌.. ఎప్పటివరకు ఆగాలో?! అసలే లేటు ఎంట్రీ
భారత పురుషుల జట్టులో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. జట్టులో సీనియర్ ప్లేయర్స్ ఉండడంతో.. యువ క్రికెటర్లు అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సిరీస్ కోసం ఎంపికైనా.. తుది జట్టులో చోటు దాదాపుగా కష్టమే. ప్రస్తుతం దేశవాళీ సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గత జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన సర్ఫరాజ్‌కు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు లేవు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్ భారీగా పరుగులు చేశాడు. అయినా కూడా భారత జట్టులో చాలా ఆలస్యంగా అవకాశం వచ్చింది. ఇందుకు కారణం సీనియర్ ప్లేయర్స్ ఉండడమే. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు జట్టులో చోటు కోల్పోవడం.. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం.. కేఎల్ రాహుల్ గాయం బారిన పడడం లాంటి కారణాలతో సర్ఫరాజ్‌కు ఏకంగా తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు చేసి సత్తాచాటాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్‌పై మాజీలు ప్రశంసలు కురిపించారు.

నటి మలైకా అరోరా ఇంట్లో విషాదం.. ఏడో ఫ్లోర్ నుంచి దూకి..!
బాలీవుడ్‌ సీనియర్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలైకా తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఏడో ఫ్లోర్ ఉన్న తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. అనిల్‌ అరోరా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని బాంద్రా పోలీసులు చెప్పారు. అయితే అనిల్‌ అరోరా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఆయన.. నేడు ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్‌కు చెందిన అనిల్ అరోరా గతంలో మర్చంట్ నావీలో పనిచేశారు. మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. మలైకా, ఆమె సోదరి అమృత తన తల్లి జాయిస్ పాలీకార్ప్ వద్ద పెరిగారు.

కొత్త ఆట, కొత్త అధ్యాయం.. కొత్త హోస్ట్‌ కూడానా..?
కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ 11కి సంబంధించి బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేసిన కలర్స్ కన్నడ.. ఇప్పుడు ఫస్ట్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్ ఈసారి షోని హోస్ట్ చేస్తాడా..? లేదా అనే ప్రశ్నల మధ్య ఆసక్తిని పెంచింది. కలర్స్ కన్నడ తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో బిగ్ బాస్ లోగోను ఇప్పటికే పోస్ట్ చేసింది. నీరు, నిప్పుల కలయికలో బిగ్ బాస్ కన్ను అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, అలా షేర్ చేసిన పోస్ట్‌లో కిచ్చా సుదీప్(kichcha sudeep) అనే హ్యాష్‌ట్యాగ్ కనిపించలేదు. ఇది గమనించిన కొందరు సుదీప్ ఈసారి షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా..? లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా విడుదలైన కొత్త ప్రోమోలో వారు మరింత శ్రద్ధ వహించారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లలో, మొబైల్‌లలో, ప్రతిచోటా బిగ్ బాస్ చూసే సన్నివేశం చిత్రీకరించబడింది. “ఇది బిగ్ బాస్.. హలో కర్ణాటక. ఎలా ఉన్నావు? 10 సంవత్సరాలుగా చూస్తున్నావు. ఇది పెద్దదవుతోంది. ఈసారి ఇంకా పెద్దగా ఎదురుచూస్తోంది. ఇలా, ఇది కొత్త దశాబ్దం, కొత్త ఆట, కొత్త అధ్యాయం, బిగ్ బాస్ అంకెరూ హోసాబ్రా ” అంటూ కొనసాగింది. దింతో ఇప్పుడు ఈ మొదటి ప్రోమో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సమాచారం మేరకు ఈ బిగ్ బాస్ సీజన్ 11 సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం బిగ్ బాస్ కిచ్చా సుదీప్ నేతృత్వంలో కలర్స్ కన్నడలో ప్రారంభమవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్నగా మారింది. ఈ సారి సీజన్ లో కూడా పోటీదారుల జాబితాలో టీవీ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే రెండో ప్రోమో షూటింగ్ చివరి దశకు చేరుకోగా మరో వారం రోజుల్లో ప్రోమో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి అందులో ఎన్ని ట్విస్ట్ లు ఇవ్వనున్నారో.

Show comments