NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సొంత డబ్బుతో స్కూల్‌కు ప్లే గ్రౌండ్‌..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చొరవతో ఉమ్మడి కడప జిల్లాలోని మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది.. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు.. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు పవన్‌ కల్యాణ్‌.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు నెలల క్రితం మొట్టమొదటిసారిగా రైల్వే కోడూరు మండలం మైసూరవారి పల్లెలో పర్యటించారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, అన్నమయ్య జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు.. మరోవైపు.. రైల్వే కోడూరు మండలం మైసూరావారి పల్లెలో హెల్త్ సెంటర్ కు 10 సెంట్లు దానం ఇచ్చాడు రైతు.. దీంతో.. హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అధికారులు… ఇక, తాను ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు అన్నమయ్య జిల్లా అధికారులతో సమీక్షిస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్‌.. హామీల అమలకు కృషిచేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందించారు..

గుడ్‌న్యూస్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను మినహాయింపు పొడిగింపు
పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు గుడ్‌బై చెప్పి.. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సంఖ్య పెరుగుతోంది. ఇక, ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రభుత్వాలుచర్యలు తీసుకుంటున్నాయి.. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను మినహాయింపు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పన్ను మినహాయింపు గడువును మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2024 డిసెంబర్ 7 తేదీ వరకూ రాష్ట్రంలో ఈవీలపై పన్ను మినహాయిస్తూ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. 2018-23తో ముగిసిన ఈవీ విధానం స్థానంలో.. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ పన్ను మినహాయింపు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. ఏపీ మోటారు వాహనాల చట్టం 1963 కింద ఈవీలకు పన్ను మినహాయింపు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, గతంలో పోలిస్తే.. ఇప్పుడు ఈవీలకు మారేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఈవీ బైక్‌లతో పాటు.. కార్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది.. ఖర్చు కూడా భారీగా కలిసివస్తుండడంతో.. వినియోగదారులు ఈవీలవైపు మొగ్గుచూపుతోన్న విషయం విదితమే.

శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్‌.. తక్కువ ధరకే వంట నూనె..
పండుగ సమయంలో ఒక్కసారిగా పెరిగిపోయాయి వంట నూనెల ధరలు.. ఇదే సమయంలో కూరగాయల ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. రాష్ట్రంలో వంటనూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు వంట నూనె సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లను మంత్రి నాదెండ్ల మనోహర్‌ కోరారు.. దీనికి సుముఖత వ్యక్తం చేశారు డీలర్లు, సప్లయర్లు. కాగా, పండుగల వేళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చిన విషయం విదితమే.. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేయడంతో.. సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌, రిఫైన్డ్‌ పామాయిల్‌పై ఇంపోర్ట్‌ టాక్స్‌ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి చేరింది. అయితే, దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకొనేందకు ఈ నిర్ణ యం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. కానీ, ఇంపోర్ట్‌ టాక్స్‌ పెంపుతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.. అన్ని రకాల వంట నూనెల ధరలు లీటర్‌పై ఒకసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో.. తగ్గింపు ధరలకు వంట నూనెలు అందించేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం..

పిఠాపురంలో సమస్యల పరిష్కారంపై పవన్‌ స్పెషల్‌ ఫోకస్‌.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.. పిఠాపురంలో సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.. ఇక, నియోజకవర్గంలో 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆ ప్రత్యేక బృందాలకు ఆదేశాలు జారీ చేశారు.. సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు..

మద్యం షాపుల దరఖాస్తులకు నేడు లాస్ట్.. ఎక్సైజ్‌ శాఖ కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపులను మూసివేస్తూ.. కొత్త పాలసీ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 3396 ప్రైవేట్‌ మద్యం షాపులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.. అందులో భాగంగా మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. వరుస సెలవుల నేపథ్యంలో.. మధ్యలో ఓసారి గడువు పొడిగించారు.. అయితే, ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది.. ఇక, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చాయి.. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపుల కోసం 48,39 దరఖాస్తుల దాఖలు కాగా.. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 40 మద్యం దుకాణాలకు కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.. ఇవాళ రాత్రి వరకు గడువు ఉండడం వల్ల మరిన్ని దరఖాస్తులు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. ఈ నేపథ్యంలో.. కీలక సూచలను చేశారు ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్‌ నిషాంత్ కుమార్.. మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుది గడువు అని స్పష్టం చేసిన ఆయన.. సాయంత్రం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందన్నారు.. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపు చేసుకోవచ్చు అన్నారు.. ఇక, బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్ లో ఉంటేనే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.. సంబంధిత పత్రాలతో సాయంత్రం 7 గంటల్లోపు SHOల్లో అందుబాటులో ఉన్నవారికి టోకెన్లు అందించి క్రమ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేస్తాం న్నారు.. దరఖాస్తు దారులు నిబంధనలు పాటించి సజావుగా కార్యక్రమం ముగిసేలా సహకరించాలని కోరారు ఏపీ ఎక్సైజ్‌ వాఖ కమిషనర్‌ నిషాంత్ కుమార్..

మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..
మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దతో పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వపాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శపథకంతో రూ. 657 కోట్లు తో ప్రభుత్వం వచ్చిన ముడునెల్లోనే చేపట్టి సౌకర్యాలు కల్పించిందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందిఏమిలేదన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10వేల 6 పోస్తులు డీఎస్సి ద్వారా ఇచ్చిందన్నారు. ఉపాద్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కలిపించిందన్నారు. గత ప్రభుత్వం అనేకస్కూల్ పెట్టిందే తప్ప పక్క వసతి కలిపించడంలో విఫలమైందన్నారు. అంతర్జాతీయ స్టాఅండ్ తో ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన స్కూల్ ఈ ప్రభుత్వం నిర్మాణం చేయబోతోందన్నారు. గత ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందన్నారు. ప్రభుత్వం వచ్చాక 300 కోట్ల తో అనేక కంపెనీలతో స్కిల్ డవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కలిపించిందని తెలిపారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందన్నారు. ప్రవేటుకు దీటుగా పేద విద్యలకు కార్పొరేట్ విద్యానందించేందుకు ప్రభుత్వం కృషి చేసుందన్నారు.

ఇది యుద్ధాల యుగం కాదు.. దౌత్యానికి ప్రాధాన్యమివ్వాలి..!
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. లావోస్‌లోని 19వ ఈస్ట్‌ ఆసియా సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. నేను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చాను అని పేర్కొన్నారు. ఇది యుద్ధాల యుగం కాదు.. యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు లభించవు అని మోడీ వెల్లడించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక, ప్రపంచ శాంతి భద్రతకు ఉగ్రవాదం సైతం తీవ్రమైన పెను సవాలుగా మారింది అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. దీన్ని ఎదుర్కొనేందుకు మానవత్వంపై విశ్వాసమున్న శక్తులన్నీ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా సైబర్‌, సముద్ర, అంతరిక్ష రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి అని ఆయన వెల్లడించారు. కాగా, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి.. సమస్యల పరిష్కారానికి చర్చలకు, దౌత్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. యురేషియా, పశ్చిమాసియాల్లో శాంతి స్థిరత్వం పునరుద్ధరించాలని ప్రధాని మోడీ తెలిపారు.

పాకిస్థాన్లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన టెర్రరిస్టులు..
పాకిస్థాన్‌ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు. ప్రావిన్సులోని దికీ జిల్లాలో ఉన్న జునైద్ కోల్ కంపెనీకి చెందిన బొగ్గు గని వసతి గృహాల్లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు కార్మికులను చుట్టుముట్టి కాల్పులు చేశారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతుల్లో ఎక్కువ మంది బలూచిస్థాన్ ప్రావిన్సులోని పష్తున్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. అలాగే, మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వారు ఉన్నారు. వచ్చే వారం ఇస్లామాబాద్‌లోని షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. ఇక, బలూచిస్థాన్‌లో ఎక్కువగా తెహ్రీక్ -ఇ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉంటుంది. ఈ ఘటన కూడా దీని పనేనని అనుమానిస్తున్నారు.

భారత్‌ అత్యధికంగా ట్యాక్స్ విధిస్తోంది.. చైనా, బ్రెజిల్‌లో కూడా..!
అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యగార్ధి కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మరోసారి భారత్‌ ‘సుంకాల’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను భారత్‌ విధిస్తోందని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువులపై పన్నులు విధిస్తానని ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200 శాతం సుంకం విధిస్తుంది.. బ్రెజిల్‌లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. అయితే, బుధవారం నాటి సభలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్ గురువారం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోడీని అత్యంత మంచి మనిషి, భారతదేశానికి గొప్ప నాయకుడు, నా ప్రియమైన స్నేహితుడు అని ఆయన అభివర్ణించారు. కానీ, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది.

మార్కెట్లోకి టెస్లా రోబోవ్యాన్‌.. ఆవిష్కరించిన ఎలాన్‌ మస్క్‌
టెస్లా సీఈవీ ఎలాన్‌ మస్క్‌ తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్య పర్చేశారు. కాగా, ఆ సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను ‘వీరోబో’ ప్రోగ్రాంలో ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్‌ బ్రదర్స్‌ ప్రాంగణంలో దీనిని నిర్వహించారు. కాగా, రోబోవ్యాన్‌ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అది రైలు ఇంజిన్‌ లాంటి డిజైన్‌లో తయారు చేశారు. అయితే, దీని చక్రాలు బయటకు కనిపించకడం లేదు. దీన్ని 20 మంది ప్రయాణికులను లేదా సరకులను తరలించేందుకు ఉపయోగించొచ్చని టెస్లా సంస్థ చెప్పుకొచ్చింది. కాగా, ఈ వ్యాను మైలు దూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల వరకు ఖర్చవుతుందని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ వెల్లడించింది. దీనిని అటానమస్ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం నిర్మించినట్లు సమాచారం. దీంతో టెస్లా మాస్‌ ట్రావెల్‌ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటి వరకు ఆ సంస్థ వాహనాల లైనప్‌ కేవలం చిన్నవాటి పరిమితమైంది. అయితే, రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్‌ వీల్‌, పెడల్స్‌ లేవు.. దానిని ఎలాన్ మస్క్‌ సైబర్‌ క్యాబ్‌ అని వీక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిని కస్టమర్లు 30,000 డాలర్ల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చన్నారు. ప్రతీ మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. అటానమస్‌ కార్లను సాధారణ వాహనాల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా ఉపయోగించవచ్చని ఎలాన్ మస్క్ వెల్లడించారు.

‘నాటు నాటు’కి మించి.. స్క్రీన్స్ పరిస్థితి ఏంటో?
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ క్రేజీ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. అందుకోసం ఏకంగా వంద కోట్ల పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారంలో ఉంది. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ ఊహకందని రీతిలో ఉంటాయని అంటున్నారు. అలాగే ఈ ఇద్దరిపై ఉండే సాంగ్.. నాటు నాటుకి మించి ఉంటుందని, వీళ్ల స్టెప్పులకు స్క్రీన్స్ తగలబడిపోతాయని చెబుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు దేవర హిట్ జోష్‌లో ఉన్న టైగర్.. నెక్స్ట్ వార్ 2 షెడ్యూల్‌కి రెడీ అవుతున్నారు. ఈ నెలలోనే షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు.

అయ్యో రామ.. ఒకరినొకరు టార్గెట్ చేసుకున్న ‘మెగా’ హీరోస్!
ఈ ఏడాది చివరి నుంచే ‘మెగా’ హీరోల సందడి ఉంటుందని అందుకున్నా.. అది కుదరలేదు. 2025 ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి వచ్చేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా సంక్రాంతికి షిప్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి జనవరి 10న ‘విశ్వంభర’తో వస్తానని డేట్ లాక్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. అదే డేట్‌కి గేమ్ ఛేంజర్‌ను తీసుకొచ్చేలా బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మరి చిరు ప్లేస్‌లోకి చరణ్ వస్తే.. విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మెగాస్టార్‌ను చరణ్ టార్గెట్ చేస్తే.. ఇప్పుడు పవర్ స్టార్ డేట్‌ను మెగాస్టార్ టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

మనీ లాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు భారీ ఊరట లభించింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. 2017లో రాజ్‌ కుంద్రా సంస్థ బిట్‌కాయిన్‌ల రూపంలో దాదాపు రూ. 6,600 కోట్లు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. నెలకు 10 శాతం రిటర్న్‌లు ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేశారని కేసు నమోదైంది. ఈ పథకం సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా దాదాపు 285 బిట్ కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ బిట్‌కాయిన్‌లతో ఉక్రెయిన్‌లోని మైనింగ్‌ ఫామ్‌ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు చెందిన రూ.98 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరిట ఉన్న బంగ్లా, పూణేలోని ఫ్లాట్, కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లు. ఈ నేపథ్యంలోనే గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా శిల్పాశెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది.

Show comments