NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సూపర్‌ సిక్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. అన్నింటికీ ఒకే సమాధానం 11 సీట్లు..!
కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలపై సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై మన ప్రశ్న – వారి సమాధానం.. తల్లికి వందనం ఎప్పుడు? జవాబు.. మీకు 11 సీట్లు.. ప్రతి మహిళకు నెలకు 1500/- ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. ప్రతి రైతుకు రూ.20 వేలు ఎప్పుడు? జవాబు మీకు 11 సీట్లు.. అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా కూటమి ప్రభుత్వంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఇక, రేపు ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ యువత పోరు కార్యక్రమనికి అందరూ ఏకం కావాలని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.. యువత పోరు పోస్టర్ ను యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆవిష్కరించారు.. ప్రకాశం జిల్లా ఒంగోలులో 12వ తేదీన తలపెట్టే యువత పోరు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు.. కూటమి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చి అధికారం చేపట్టి ఇప్పటికే సుమారుగా 10 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేక ఉద్యోగాల కల్పన లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అలానే ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనల బకాయిలు చెల్లించకుండా, వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బకాయిలు చెల్లించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 12వ తేదీన “యువత పోరు” కార్యక్రమం చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో 12వ తేదీన భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఈరోజు “యువత పోరు” పోస్టర్ విడుదల చేయడం జరిగిందని అన్నారు.. యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు.

అసెంబ్లీ వైపు చూడని ఎమ్మెల్యేలు..! భారీగా తగ్గిన హాజరు..
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు సభకు హాజరైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు.. గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. ఆందోళనకు దిగారు.. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగానే.. అసెంబ్లీ సమావేశాలను వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. సభలో 164 మంది సభ్యులు ఉండాలి.. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా.. అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా.. ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది.. ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది.. వైసీపీకి చెందిన 11 మందిని మినహాయిస్తే మొత్తంగా 164 మంది సభ్యులు ఉండగా.. ఎలాంటి పరిస్థితి అయినా కూడా 100 మంది తగ్గకుండా హాజరు కావాల్సిన పరిస్థితి.. కానీ, ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలు మరింత ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష సభ్యులు సభకు వస్తే.. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు.. అది కాకుండా.. ఆయా నియోజకవర్గాల సభ్యులు వచ్చినా.. తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను లేవనెత్తవచ్చు.. కానీ, క్రమంగా సభ్యుల హాజరు శాతం తగ్గడం ఇప్పుడు చర్చగా మారిపోయింది..

రాజ‌ధాని నిర్మాణానికి రూ.64,721.48 కోట్లు ఖర్చు.. మూడేళ్లలో పూర్తి..
అమరావతి రాజధాని నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, రాజ‌ధాని నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని.. మూడేళ్లలో రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. క్వశ్చన్ అవ‌ర్ లో ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి అడిగిన ప్రశ్నల‌కు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. అమ‌రావ‌తి గ‌వ‌ర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భ‌వ‌న నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక స‌దుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖ‌ర్చవుతుందన్నారు.. ఈ నిధుల‌ను వివిధ రూపాల్లో సేక‌రించి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డుతున్నాం అన్నారు.. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్‌లు, కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటుల‌ను పొందడం ద్వారా నిధుల సేక‌ర‌ణ‌ జరుగుతోందదన్నారు మంత్రి నారాయణ. రైతుల‌కు అభివృద్ది చేసిన ప్లాట్లను ద‌శ‌ల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందన్నారు మంత్రి నారాయణ.. అయితే, 2019-24 మ‌ధ్య విధాన‌ప‌ర‌మైన అనిశ్చితుల కార‌ణంగా ఈ ప్రక్రియ‌లో జాప్యం జ‌రిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద‌ న‌మ్మకంతో 58 రోజుల్లోనే 34 వేల ఎక‌రాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు మంత్రి నారాయణ. అమ‌రావ‌తి నిర్మాణానికి 30 వేల ఎక‌రాలు కావాల‌ని జ‌గ‌న్ ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రభుత్వం మార‌గానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడి ఎక్కడా రాజ‌ధాని లేకుండా చేశారు.. గ‌త ఐదేళ్లలో రాజ‌ధానికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. ప్రపంచ‌లో టాప్ 5లో ఒక‌టిగా ఉండాల‌ని సీఎం చంద్రబాబు రాజ‌ధానిని డిజైన్ చేశారని.. కానీ, శాడిజంతో క‌క్ష సాధింపుతో ఆర్ – 5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారని దుయ్యబట్టారు.. అయితే, వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం.. న్యాయం చేస్తాం అన్నారు..

వల్లభనేని వంశీకి మళ్లీ షాక్‌.. రిమాండ్‌ అప్పటి వరకు పొడిగింపు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్‌ తగినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా విచారించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..

బుడమేరు బాధితులకు వరద సాయంపై మండలిలో రచ్చ.. మంత్రి అనిత వర్సెస్ బొత్స..
శాసన సభ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. శాసన మండలిలో మాత్రం వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో.. వైసీపీ వర్సెస్‌ కూటమి సర్కార్‌గా శాసన మండలి మారుతోంది.. ఈ రోజు శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స.. ఇక, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. బుడమేరు వరద దురదృష్టకరం అన్నారు.. ఆక్రమణల కారణంగా బుడమేరు వరదలు వచ్చాయన్న ఆమె.. 2005 లో భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి.. 20 శాతం నేటికీ పూర్తవ్వలేదు.. గత ప్రభుత్వం వదిలేయడం వల్లే మొన్నటి వరదల్లో విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు.. సీఎం 11 రోజులు బస్సులోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారు.. అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులు అందించాలనే ఆలోచన రావడం సంతోషం. విజయవాడ వరద బాధితులను అన్నిరకాలుగా ఆదుకున్నాం. ఇంట్లో వస్తువులకు డబ్బులిచ్చాం. వాహనాలకు డబ్బులిచ్చాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు విడుదల చేశాం. వరద బాధితుల్లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు..

తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు.. ప్రాచీన పత్రాలు రప్పిస్తాం..!
ఆర్కియాలజీ లైబ్రరీల గురించి అసెంబ్లీలో ప్రశ్నోత్నరాల సమాయంలో చర్చ సాగింది.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఆస్తి, అప్పుల విభజనలో ఏపీకి ఆర్కియాలజీ లైబ్రరీకి సంబంధించి సాంస్కృతిక సంపద పూర్తిగా రాలేదని లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. ప్రభుత్వం వెంటనే ఆర్కియాలజీ శాఖ లైబ్రరీపై దృష్టి పెట్టాలని కోరారు.. ఇక, మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత 50 శాతం ప్రాచీన పత్రాలు రాష్ట్రానికి బదిలీచేశారని, మిగిలినవాటిని రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాచీనపత్ర భాండాగారం నుంచి అధికారిక పత్రాలు, శాసనాలు, రికార్డులు రాష్ట్రానికి రప్పించే అంశంపై శాసనసభలో మంత్రి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు.. తెలుగుజాతి చరిత్ర పరిరక్షణకు ఆర్కీవ్స్, ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి, డిస్ట్రిక్ట్ గెజిట్స్ అనే మూడు సంస్థలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు వంటి మహనీయులు రాసిన లేఖలు ఆర్కీవ్స్ ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ అంశాన్ని షెడ్యూలు 10లో చేర్చారు. జాతి సంపదను కాపాడాకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. లైబ్రరీస్ పై మూడు సార్లు రివ్యూ చేశాం అన్నారు.., ఆర్కివ్స్ పై వెనుకబడి ఉన్నామని.. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అన్నారు.. 10వ షెడ్యూలులో ఈ సంస్థ ఉందన్నారు.. మొత్తం 15 కేటగిరిల రికార్డులకుగాను 7 కేటగిరిలు ఇచ్చారు. రెండు కాపీలు ఉన్నవి. ఒకటి మనకు ఇచ్చా, ఒకే ఒక కాపీ ఉన్నవాటిపై చర్చించాల్సి ఉంది. డిజిటలైజ్ చేసి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తాం. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరాం, అవసరమైతే సీఎస్ఆర్ నిధులు తెచ్చి పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తాం. పెద్దఎత్తున డిజిటలైజేషన్ చేపట్టాల్సి ఉంది. 24,347 చదరవు అడుగుల అద్దె భవనంలో ప్రస్తుతం ఆర్కివ్స్ విభాగం పనిచేస్తోంది, అక్కడే రికార్డులన్నీ నిర్వహిస్తున్నాం. రాష్ట్రవిభజన తర్వాత మనకు సెంట్రల్ లైబ్రరీ లేనందున అమరావతిలో భూమి కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరాం. అక్కడే ఆర్కివ్స్ పరిరరక్షణపై దృష్టి పెడతాం. ఆర్కీవ్స్ పై శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తాం. టెక్నాలజీ జోడించి, ఆర్కివ్స్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం అన్నారు..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు రోబోలు..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్‌లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్‌లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేశారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల తవ్వకాలు మొదలు పెట్టారు. కాగా.. సాయంత్రానికి రెండు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉంది. కేరళకు చెందిన క్యాడవర్ శునకాలు మృతదేహాల ఆనవాళ్లు పసిగట్టాయి. దాంతో ఆ ప్రాంతంలో తవ్వితే ఒకరి మృతదేహం బయటకు తీశారు. అతి కష్టం మీద మరో ఐదడుగులు తవ్వారు. ఇంజనీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటుగా మరో ముగ్గురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉంది. మిగిలిన వారు సొరంగం చిట్ట చివరి భాగం దగ్గర టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో టీబీఎం మిషన్ కట్టింగ్, డీ వాటరింగ్ కొనసాగుతుంది. శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) టన్నెల్ నిర్మాణ సమయంలో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు. ఆదివారం నాడు డీ2 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికితీశాయి. రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కట్టింగ్, నీటి తొలగింపు (డీ వాటరింగ్) పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు..
హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్ని ఇద్దరిని చంపి లెక్చరర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. ఇరు కుటుంబాలకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నట్లు దంపతులు తెలిపారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. మేము చనిపోతే పిల్లలు అందరికీ భారం అవుతారని చంపేస్తున్నట్లు దంపతులు తెలిపారు. కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశాను.. 2019లో ఉద్యోగం నుండి బయటకు వచ్చేశాను.. రెండేళ్ల పాటు ఊర్లో వ్యవసాయం చేశానని చంద్రశేఖర్ తెలిపారు. కానీ వ్యవసాయంలో ఆశించినంత ఆర్థికంగా స్థిరపడలేకపోయాము.. కుటుంబ పోషణ కోసం అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు ప్రయత్నం చేశాము.. కానీ సాధ్యం కాలేదన్నారు. దీంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను.. ఆత్మ అభిమానం, ఆత్మగౌరవంతో ఇతరులను సహాయం అడగలేదని తెలిపారు. వేరే పని చేయలేకపోయాను.. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.. అమ్మా, నాన్న, అన్న మమ్మల్ని క్షమించండి అంటూ లేఖలో రాశాడు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రన్యారావు స్నేహితుడు
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తున్నారు. రన్యారావు.. మొబైల్ డేటాను పరిశీలించగా తరుణ్ రాజుతో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రన్యారావుకు ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరితో వివాహమైంది. కానీ ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ రాజుతో రన్యారావుకు సంబంధాలు బలపడినట్లుగా సమాచారం. కాల్ డేటా ప్రకారం తరుణ్ రాజుతోనే రన్యారావు సంబంధం కొనసాగించినట్లుగా అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ రవాణాలో తరుణ్ రాజు పాత్ర ప్రముఖంగా తేలింది. ప్రస్తుతం తరుణ్ రాజును లోతుగా విచారిస్తున్నారు. ఐదు రోజుల కస్టడీలో కీలక విషయాలను అధికారులు రాబట్టనున్నారు.

పాక్‌కు అమెరికా షాక్.. రాయబారి బహిష్కరణ
పాకిస్థాన్ రాయబారి అహ్సాన్ వాగన్‌ను అమెరికా బహిష్కరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చెల్లుబాటు అయ్యే వీసా, అలాగే చట్టపరమైన ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ లాస్ ఏంజిల్స్‌ నుంచి బహిష్కరణకు గురైనట్లు సమాచారం. అహ్సాన్ వాగన్‌.. తుర్క్‌మెనిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలస విధానంపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీసాపై వివాదాస్పద సూచనలు ఉండడంతో అహ్సాన్ వాగన్‌కు చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది. తుర్క్‌మెనిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్న అహ్సాన్ వాగన్.. సెలవుపై లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్నారు. అక్రమ వలసలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. వీసాపై అభ్యంతరం ఉండడంతో ప్రవేశాన్ని అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సరైన కారణాలను మాత్రం అమెరికా ఇప్పటి వరకు వెల్లడించలేదు.

ఎక్స్ అంతరాయానికి ఉక్రెయినే కారణం.. మస్క్ సంచలన ఆరోపణ
ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. దీంతో వందలాది మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది. తాజాగా అంతరాయంపై ‘ఎక్స్‌’ యాజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఎక్స్‌పై సైబర్ దాడి జరిగిందని.. దీనికి ఉక్రెయినే కారణమని తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు కనుగొన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతం నుంచే ఈ సైబర్ దాడి జరిగినట్లుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే ఈ సైబర్ దాడికి పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల సంస్థ డార్క్ స్టార్మ్ టీం బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల గ్రూప్ బాధ్యత వహించినప్పటికీ.. దీనికి మూలం మాత్రం ఉక్రెయినే కారణంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయని మస్క్ పేర్కొన్నారు.‘‘ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు గానీ.. ఉక్రెయిన్‌ ప్రాంతానికి సంబంధించిన ఐపీ చిరునామాలతో ఎక్స్ వ్యవస్థను కూల్చేసేందుకు భారీ సైబర్ దాడి జరిగింది.’’ అని మస్క్ ఆరోపించారు.

90 రోజులకు కేవలం రూ.100కే జియో హాట్‌స్టార్ ప్లాన్..
జియో వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికామ్ సంస్థ జియో, తన వినియోగదారుల కోసం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.100 మాత్రమే. దీనితో వినియోగదారులు ఇప్పుడు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను తక్కువ ఖర్చుతో వీక్షించే అవకాశం పొందుతారు. ఇది క్రికెట్, వినోద ప్రేమికులకు గొప్ప ఆఫర్‌ అని చెప్పుకోవచ్చు. గతంలో, జియో రూ.195కే జియో హాట్‌స్టార్ ప్లాన్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు కంపెనీ ఇంకా చౌకైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.100కు జియో కొత్త డేటా ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా 5GB డేటా, 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక రూ.100 జియో ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో 5GB హైస్పీడ్ డేటా, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లనిస్తుంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీల్లో 1080p రిజల్యూషన్ వరకు స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది డేటా మాత్రమే ప్యాక్ కావడంతో, ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి వినియోగదారులకు బేస్ ప్లాన్ ఉండాలి. 5GB డేటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గిపోతుంది.

పుష్పగాడి స్టైల్లో జడ్డూ ఎంట్రీ.. వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. ‘జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్’ అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను చెన్నై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025కి సిద్ధం కండి.. ఇక తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈనెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా చెన్నై జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ధోనీ కూడా ఇటీవల జట్టులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమండియా విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆచితూచి.. జాగ్రత్తగా ఆడాడు. టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌ల్లో 4.35 ఎకానమీ రేటుతో ఈ ఆల్ రౌండర్ 5 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించాడు. కాగా.. ఈ ట్రోఫీతో భారత్ మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2025 సీజన్‌లో చెన్నై 6వ ఐపీఎల్ టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే హోమ్ మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత చెపాక్‌లో ఆర్సీబీతో మరో మ్యాచ్ జరుగనుంది.

ఒకే ఒక హిట్టుతో ఆ హీరోయిన్ లైఫ్ టర్న్
స్టార్ హీరోయిన్ కావాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ లక్ కొంత మందిని మాత్రమే వరిస్తుంది. ఒకరికి ఒక్క సినిమాతోనే వస్తే మరికొంత మందికి ఆరేడు సినిమాల తర్వాత ఐడెంటిటీ వస్తుంది. అస్సామీ బ్యూటీ సెకండ్ టైప్. నాలుగేళ్లలో ఐదు ఇండస్ట్రీలు తిరిగితే ఆరో మూవీతో కానీ ఫోకస్ కాలేదు. అదే ప్రదీప్- అశ్వత్ మారిముత్తు డ్రాగన్. డ్రాగన్‌తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిపోవడమే కాదు ఈ ఏడాది హండ్రెడ్ క్రోర్ వసూలు చేసిన హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. డ్రాగన్‌లో అమ్మడి ఫెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన దర్శక, నిర్మాతలు తమ నెక్ట్స్ సినిమాల్లో ఆమెకు ఛాన్సిస్తున్నారు. ఒక్క మూవీతో సరిపెట్టేసిన ఇండస్ట్రీ సైతం ఇప్పుడు పిలిచి ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజెంట్ తమిళంలో అధర్వతో ఇదయం మురళిలో నటిస్తోంది ఈ నయా సెన్సేషన్. ఈ సినిమాతో పాటు కయాద్ చేతిలో అరడజను వరకు సినిమాలున్నాయి. మలయాళ హీరో జయరామ్ సన్ కాళిదాస్ హీరోగా తెరకెక్కుతోన్న నిలవరుమ్ వేలయ్ మూవీకి కమిటయ్యింది. శ్రీవిష్ణు అల్లూరి తర్వాత తెలుగులో కనిపించని ఈ అమ్మడికి  బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. విశ్వక్ సేన్ ఫంకీతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న పిక్చర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అలాగే నివిన్ పౌలీ తారంలో కూడా వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్. ఇవే కాకుండా తమిళంలో ఓ బడా హీరో సినిమాలో హీరోయిన్ కోసం ఈమెనే సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇది కూడా ఓకే అయిపోతే.. ఈ ఏడాది డైరీ ఫుల్ అయినట్లే. మరీ మేడమ్ ఏ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ దక్కించుకుంటుందో ఫ్యూచర్ విల్ బి డిసైడ్.

‘రెట్రో’ స్పెషల్ సాంగ్‌లో ఒకప్పటి హీరోయిన్
దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్‌నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తోంది శ్రియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండున్నర దశాబ్దాలు కావొస్తున్నా అదే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. అయితే కెరీర్ విషయానికి వస్తే మునుపటిలా మెరుపులు చూపించలేకపోతుంది బ్యూటీ. శ్రియా చేతిలో ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ మాత్రమే ఉంది. అదీ కూడా స్పెషల్ సాంగ్. రెట్రోలో సూర్యతో కలిసి స్టెప్పులేయబోతుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గోవాలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ఫస్ట్ టైం సూర్యతో జోడీ కడుతోంది శ్రియా శరణ్. ఈ పాట డిసెంబర్ లో రిలీజ్ అవుతుందనుకుంటే దాచారు మేకర్స్. మే ఒకటిన సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో భాగంగా ఈ పాటను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. హీరోయిన్‌గా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో స్పెషల్ సాంగ్ చేసి మళ్లీ ట్రాక్ ఎక్కింది శ్రియా. మున్నాలో ఆడిపాడాక శివాజీ లాంటి భారీ ఆఫర్ పొందింది. తులసిలో నర్తించాక బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్లను అందుకుంది. ఒక్కసారే కాదు ఇలా పలుసార్లు ఆమెను గట్టెక్కించాయి ఐటం సాంగ్స్. ఇప్పుడు హీరోయిన్ గా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ లేక సతమతమౌతున్న శ్రియాకు రెట్రో స్పెషల్ సాంగ్ మళ్లీ ఆఫర్లను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

‘ఛావా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ ?
తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చి సంచలన విజయం అందుకున్న చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా  రిలీజైన నాటి నుంచి  థియేటర్లన్నీ జై జగదంబే, జై శివాజీ, జై శంభాజీ అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రేక్షకుల భావోద్వేగాలు, సినిమా చూసి విలపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం . అలా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు, మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన 9వ బాలీవుడ్ సినిమాగా ‘ఛావా’ నిలిచింది. అయితే ఈ మూవీ హిందీలో మాత్రమే విడుదల కావడంతో, తెలుగు ప్రేక్షకుల కోరిక మేరకు తాజాగా ఇక్కడ కూడా విడుదల చేశారు. అనుకున్నట్లుగానే తెలుగులో కూడా ఈ ‘ఛావా’ ధూసుకుపోతుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.