వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసుల నోటీసులు..
తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు.. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వరుస అగ్నిప్రమాదాలు కలకలం సృష్టించిన విషయం విదితమే కాగా.. అయితే, అగ్నిప్రమాద ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనదారుల పేర్లు, వారి వాహనం నంబర్ల వివరాలు ఇవ్వాలని సూచించారు.. దీంతో, పాటు సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ను ఇవ్వాలని కోరారు.. కాగా, వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాయి కార్యాలయ వర్గాలు.. ఇదే ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ అందజేయాలని 7వ తేదీన ఓ నోటీసు ఇచ్చారు పోలీసులు.. ఈ క్రమంలో ఆ రోజున సీసీ కెమెరాలు పనిచేయక పోవటంతో సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులకు లేఖ ఇచ్చాయి వైసీపీ కార్యాలయ వర్గాలు.. ఈ క్రమంలోనే వైసీపీ కార్యాలయానికి మరో నోటీసు ఇచ్చారు పోలీసులు.. ఇప్పటికే వైసీపీ కార్యాలయ దగ్గర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ స్పందించే అవకాశం ఉంది.. అయితే, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది.. గార్డెన్‌లో పాడైన గ్రీనరికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పి వేశారు.. మళ్లీ అదే రోజు మరోసారి మంటలు చెలరేగడం చర్చగా మారింది.
1/70 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యటక కేంద్రాలు మూతపడ్డాయి. బద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు.. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌తో ఈ బంద్ కొనసాగుతోంది.. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి అన్నారు అయ్యన్న. అదే జరిగితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది. అయితే, 1/70 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. గిరిజనులు ఆందోళన చెoదవద్దు అని విజ్ఞప్తి చేశారు.. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విషప్రచారo చేస్తూ అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఎస్ జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నాడు.. అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని ఫైర్ అయ్యారు.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి..
మాదక ద్రవ్యాలపై యుద్ధం.. విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు..
మాదక ద్రవ్యాల కట్టడిపై సీరియస్‌గా ఉన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాలుగా వాటిపై యుద్ధం ప్రకటించింది.. ఇక, ఏపీ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్ (ఈగల్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా మొత్తం 10 మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది.. ఒక్కో క్లబ్ పదవీకాలం ఏడాది పాటు ఉంటుందని జీఓలో వెల్లడించింది.. విద్యా సంస్థల్లో మత్తుపదార్థాల వినియోగ నిషేధం, వాటి వల్ల ఉత్పన్నమయ్యే అనర్థాలను వివరించడమే లక్ష్యంగా ఈ క్లబ్ లు పనిచేస్తాయని పేర్కొంది కూటమి ప్రభుత్వం.. మొత్తంగా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయనున్నారు.. విద్యా సంస్థల్లో మత్తుపదార్థాల వినియోగం పెరిగి.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలకు దారితీస్తోందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో.. విద్యా సంస్థల్లోనే దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయానికి వచ్చింద సర్కార్.. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఇబ్బందులపై సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..
అమల్లోకి కొత్త మద్యం ధరలు.. వాటికి మాత్రమే మినహాయింపు..
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి.. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 99 మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్లు మీద సైజుతో సంబంధం లేకుండా రూ. 10 చొప్పున ధరలు పెరిగాయి.. రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి ఉన్న పళంగా రూ.10 పెంచడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరి కొందరు ధరలు పెరిగిన విషయం తెలియక నిర్వాహకులతో గొడవ పెట్టుకుంటున్నారు.. ఇంకా కొన్ని చోట్ల పాత ధరలు పట్టిక మార్చకపోవడంతో కన్ఫ్యూస్ అవుతున్నారు.. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మద్యం ధరలు 15 నుండి 20 రూపాయలు పెంచినట్లు ప్రచారం జరుగుతుంది.. అవన్నీ అవాస్తావమని పెరిగింది కేవలం రూ.10 ఏ అని చెప్తున్నారు నిర్వాహకులు.. కాగా, గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సర్కార్ లిక్కర్ షాపులకు స్వస్తి చెప్పిన కూటమి ప్రభుత్వం.. మళ్లీ పాత పద్దతిలోనే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చ.. టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కట్టబెట్టిన విషయం విదితమే.. ఇక, ఇటీవల మద్యం అమ్మకాలపై దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన చేయడంతో కమిషన్ 14.5 నుంచి 20 శాతం పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 2019-24 కాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీయే కూటమి సర్కార్ సమీక్షించింది. అనంతరం, లిక్కర్ విధానాలకు సంబంధించి వే ఫార్వర్డ్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో, రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్-కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక, ఈ కేబినెట్ సబ్- కమిటీ తన సిఫార్సులను కేబినెట్ కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో తాజాగా, మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం.. ఇవాళ్టి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రావడం జరిగిపోయాయి..
కోళ్లకు వైరస్.. కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
కోళ్లలో వేగంగా వ్యాప్తిస్తోన్న వైరస్ పట్ల రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. వైరస్ పట్ల అప్రమత్తంగాఉండాలంటూ రాష్ట్రాలకు సూచించింది.. దీంతో.. అలర్ట్ అయిన తెలంగాణ పశు సంవర్ధక శాఖ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. టీజీ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్.. జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, అనారోగ్యంతో.. వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టలని స్పష్టం చేశారు… వైరస్ సోకిన కోళ్ల తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.. మరోవైపు.. ఏపీతో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోంది.. ఇక, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో మిగిలిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఫ్లూ వ్యాపించిన పౌల్ట్రీ ఫార్మ్ కు వచ్చాయి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీలో మిగిలిన కోళ్లకు మత్తు ఇచ్చి చనిపోయేలా చేస్తున్నారు.. ఆ కోళ్లను గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టనున్నారు. పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్తీషియా ఇస్తున్నారు.. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ మార్కెట్‌లో అమ్మకాలు పడిపోయాయి. రాజమండ్రిలో చికెన్ మార్కెట్ అమ్మకాలు లేక వెలవెలబోతుంది. చికెన్ రేటు కూడా కేజీకి 30 రూపాయలు తగ్గిపోయింది. పౌల్ట్రీ నుంచి వచ్చే కోళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూ నేపద్యంలో జిల్లా లో అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా నిలిపివేశారు. దీనితో చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు భారీగా పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు.. కాగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఈ బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోన్న విషయం విదితమే..
తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం!
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారని, కొంత మంది ఇది సర్వేనే కాదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ సర్వేలో కొంతమంది పెద్దలు పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గుత్తా ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారు. కొంత మంది ఇది సర్వేనే కాదని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదు. ఓటర్ల నమోదులో డూప్లికేషన్ కొనసాగుతుంది. దాని వల్ల లెక్క తేడా వస్తుంది. 2014లో నాటి ప్రభుత్వం చేపట్టిన సర్వే అధికారికంగా ప్రవేశ పెట్టలేదు. ప్రతీ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సరైంది కాదు’ అని అన్నారు.
ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్!
సెక్రటేరియట్‌లో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.సుబ్రమణ్యం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్ప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్డీ డైరెక్టర్ సృజనలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలతో క్రిస్ప్ కలిసి పనిచేస్తోంది. ఆయా రాష్ట్రాలకు క్రిస్ప్ ఉచితంగా సేవలందిస్తోంది. గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క కోరారు. స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలకమండలి ఏర్పడే నాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని సూచించారు.
మరో ఘోరం.. బస్సు-ట్రక్కు ఢీ.. ఏడుగురు భక్తులు మృతి
మహా కుంభమేళాలో మరో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి మినీ బస్సులో బయల్దేరిన భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు వెంటాడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు వదిలారు. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న జబల్పూర్ కలెక్టర్, ఎస్సీ సహా అధికారులంతా సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మొహ్లా-బార్గి సమీపంలో మంగవారం ఉదయం 9:15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ బస్సు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులతో రహదారులన్నీ నిండిపోయాయి. తాజాగా జరిగిన ప్రమాదంతో ఎన్‌హెచ్-30పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అప్రమత్తమైన పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని చిత్రహత్ ప్రాంతంలో కూడా మరో ప్రమాదం జరిగింది. సహాయ్‌పూర్ గ్రామం సమీపంలో కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న కారు… ట్రక్కును ఢీకొట్టడంతో దంపతులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. మృతులు మహేంద్ర ప్రతాప్ (50), అతని భార్య భూరి దేవి (48) గా గుర్తించారు. ఇక సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వెళ్తున్న కారు బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 34 ఏళ్ల శక్తిమ్ పూజారి మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
జోర్డాన్, ఈజిప్ట్‌లకు ట్రంప్ హెచ్చరిక.. పాలస్తీనియన్లను చేర్చుకోకపోతే..!
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలోనే హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. ఇరు పక్షాలు బందీలు విడుదల చేయడం.. ఖైదీలను అప్పగించుకోవడం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాదు.. శనివారంలోగా ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే.. హమాస్ నరకం చూస్తుందని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్.. జోర్డాన్, ఈజిప్ట్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. గాజా నుంచి వచ్చే పాలస్తీనియన్లను చేర్చుకోవాలన్నారు. లేదంటే సాయం నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. గాజాను తిరిగి అభివృద్ధి చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అక్కడ ప్రజలను మిత్రదేశాలైన జోర్డాన్, ఈజిప్ట్‌లు చేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజుపై ట్రంప్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గాజా నుంచి వచ్చే పాలస్తీనియన్లను శాశ్వతంగా తీసుకోవాలని జోర్డాన్, ఈజిప్టులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే మాత్రం.. సహాయాన్ని నిలిపివేయనున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
మరికాస్త స్టైలిష్‌గా మార్కెట్లోకి వచ్చేసిన KTM కొత్త అడ్వెంచర్ బైక్‌లు..
ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంస్థగా ఎదిగిన కేటీఎమ్ (KTM).. తాజాగా మూడు కొత్త అడ్వెంచర్ బైక్‌లను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్ ను గమనిస్తే.. 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X పేర్లతో భారతీయ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించేందుకు సిద్ధం అయ్యింది. KTM, బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో భారతదేశంలో చాలా సమయం నుండీ ప్రముఖమైన స్పోర్ట్స్ బైక్‌లు అందిస్తోంది. అయితే, ఈ అడ్వెంచర్ మోడల్స్ యూత్‌ను ఆకట్టుకునేలా అద్భుతమైన డిజైన్‌తో వస్తున్నాయి. కేటీఎం 250 అడ్వెంచర్ రోడ్డెక్కి ప్రయాణించేందుకు అనువైన బైక్‌గా రూపొందింది. సస్పెన్షన్ సిస్టం ద్వారా కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. 250 అడ్వెంచర్‌ను 227mm గ్రౌండ్ క్లియరెన్స్, 825mm సీట్ ఎత్తుతో అందించారు. తద్వారా కొండలు, ఎత్తు ప్రాంతాలలో కూడా రయ్ మంటూ దూసుకుపోవచ్చు. దీని ధర రూ.2,59,850 (ఎక్స్ షోరూమ్ ధర). ఇందులో ABS, బైక్ రైడ్-బై-వైర్, క్విక్‌షిఫ్టర్ ప్లస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
క్రికెట్ విత్ కుస్తీ.. టైటిల్ వేటలో యూనిట్
బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘ఆర్ సి 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతోంది. పవర్ క్రికెట్ నేపథ్యంలో రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే కెమెరామెన్ రత్నవేలు లీక్ చేశారు. ఇక ద్వితియార్ధంలో కుస్తీ ఆటతో కథ నడుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్-కుస్తీ రెండూ కలిసి వచ్చేలా టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు మేకర్స్. గతంలో పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉండగా వర్కింగ్ టైటిల్ ఐతే – పవర్ క్రికెట్ గా ఉండబోతోంది అని అంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి 16’ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు చరణ్.
నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ..!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రజంట్ బ్యాక్ టై బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సినిమా తెరకెక్కిస్తున్న నాని,‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని అనౌన్స్ చేశాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి షైన్స్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతుంది. ఏంటీ అంటే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను నాని రెడీ చేశాడట కానీ.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ చేస్తే ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు శ్రీకాంత్ ఓదెల రెడీగా ఉన్నాడట. అంతేకాదు అని అనుకున్నసమయానికి అనుకున్నట్లుగా జరిగితే ఈ గ్లింప్స్‌ను ఫిబ్రవరి 20న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌ని పరిచయం చేసింది నానినే. ఇక అలాగే శ్రీకాంత్ ఓదెలని డైరెక్టర్‌గా పెట్టి చిరంజీవితో కూడా ఓ సినిమా నిర్మించబోతున్నాడు నాని. మరో పక్క ప్రియదర్శిని హీరోగా పెట్టి ‘కోర్ట్’ అనే మూవీ చేశాడు. మొత్తంగా నాని అని రంగాల్లో తన సక్సెస్ తో ముందుకు సాగుతున్నారు.
షేకింగ్ కలెక్షన్స్.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తాజా మూవీ తండేల్. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తుంది. శుక్రవారంతో పాటు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గట్టిగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 73 కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈరోజు కూడా వసూళ్లు స్టడీగా కొనసాగి రేపు కూడా కొంత గట్టిగా వసూళ్లు లభిస్తే 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ధియేటర్లకు కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాయి పల్లవి నాగ చైతన్య నటనతో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి మంచి అసెట్ గా నిలుస్తోంది.