Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పులివెందులలో పోలింగ్‌ బూత్‌ల మార్పు.. హైకోర్టులో వైసీపీ పిటిషన్‌..
కడప జిల్లాలోని రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతోన్న ఉప ఎన్నికలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. మరీ ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది వైసీపీ.. ఈ రోజు వైసీపీ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ పై విచారణ జరగనుంది.. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూతుల మార్పుపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసింది వైసీపీ.. మరి, హైకోర్టులో ఎలాంటి విచారణ జరగనుంది.. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది..

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి.. బైక్‌పై ఓవర్‌ టేక్‌ చేసి మరీ..!
తాను బస్సు ఆపేందుకు ప్రయత్నిస్తే.. ఆపకుండా వెళ్లిపోయాడంటూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు ఓ మహిళ.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సును నడిమివంక వద్ద ఆపాలని కోరింది ఓ మహిళా.. అయితే, డ్రైవర్‌ గమనించలేదా? లేదా కావాలనే చేశాడో తెలియదు.. కానీ, బస్సును మాత్రం ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న సుచరిత అనే మహిళ.. బైక్‌పై బస్సు ను ఓవర్ టేక్ చేసింది.. బస్సు ను ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది.. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుంది.. తోటి ప్రయాణికులు ఎంత వారించినా వెనక్కి తగ్గకుండా దాడికి పాల్పడింది మహళ.. ఓ మహిళ తనపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నటేష్ బాబు.. కాగా, డ్యూటీలో ఉన్న డ్రైవర్‌, కండక్టర్లపై దాడి చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ఏపీఎస్ఆర్టీసీ.. గతంలోనూ ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే.. ఇక, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తెలంగా ఆర్టీసీలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. అంతేకాదు, మహిళకు వాగ్వాదాలకు, దాడులకు దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి..

మాజీ మంత్రి రోజా అరెస్టు ఖాయమా..?
గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఆటలు నిర్వహించారు.. అయితే, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. రేపో.. మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన నివేదిక అందనుంది.. దీంతో, వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్ట్‌ తప్పదా? అనే చర్చ సాగుతోంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీలపై విజిలెన్స్‌ విచారణ పూర్తి అయ్యింది.. క్రీడల నిర్వహణలో జరిగిన అవినీతిపై విజలెన్స్‌ ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది.. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది కూటమి ప్రభుత్వం.. ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందదని.. ఆగస్టు 10వ తేదీ తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజు ఏ క్షణంలోనే చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.. ఆడుదాం ఆంధ్రాలో సుమారు రూ.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్లు ప్రచారం సాగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారట.. 2023 డిసెంబర్‌లో ఆడుదాం ఆంధ్రా క్రీడలను ప్రారంభించిన అప్పటి జగన్‌ సర్కార్.. ఆ పథకానికి రూ.119 కోట్ల నిధులను కేటాయించింది.. అయితే, దీంట్లో అవకతవకలు జరిగాయని, విచారణ జరపాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం..

హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం!
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా)లోని మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులను బహిష్కరించారు. విధుల బహిష్కరణతో మాన్సూన్‌ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. హైడ్రా కంట్రోల్‌ రూమ్‌ సేవలకు అంతరాయం కలిగింది. ట్రైనింగ్‌ కార్యక్రమం, ప్రజావాణి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 23న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా మార్షల్స్‌కి రూ.22,500 జీతం అధికారులు ఫిక్స్ చేశారు. అంతకుముందు ఎక్కువ జీతాలు ఇస్తూ.. ఇప్పుడు తగ్గించడంతో హైడ్రా మార్షల్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు తగ్గించడంతో హైడ్రాలోని మార్షల్స్ నేడు విధులను బహిష్కరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. 51 హైడ్రా భారీ వాహనాల సేవలు నిలిచిపోయాయి. హైడ్రాలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మాజీ సైనిక ఉద్యోగులు మార్షల్స్‌గా పనిచేస్తున్నారు.

మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక!
హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ మంత్రి ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవన సాగిస్తున్న వారికి నష్టం చేసే తీరును విరమించుకోకపోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ కార్యకర్తలు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇండియా కూటమి మార్చ్‌లో ఉద్రిక్తత.. రాహుల్‌గాంధీ అరెస్ట్
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేపట్టారు. విపక్ష ఎంపీలంతా ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో నేతలు-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు బారీకేడ్లు దూకుకుంటూ వెళ్లిపోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో రాహుల్‌గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. పార్లమెంట్ భవనం నుంచి ఈసీ ఆఫీసు కిలోమీటర్ దూరంలో ఉంది. సోమవారం ఉదయం ఈసీ ఆఫీసుకు ఇండియా కూటమి ర్యాలీగా బయల్దేరింది. దేశంలో ఓట్లు చోరీ జరుగుతుందంటూ కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు బయల్దేరింది. అయితే పార్లమెంట్ చుట్టూ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీగా వెళ్లకుండా అష్టదిగ్బంధం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

శశిథరూర్ యూటర్న్.. ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షం
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే అనుమతి లేదంటూ బారీకేడ్లు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలో మహిళా ఎంపీలు, అఖిలేష్ యాదవ్ బారీకేడ్లు దూకే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఆశ్చర్యంలో కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉండే శశిథరూర్ అనూహ్యంగా రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొ్న్నారు. ఈసీ ఆఫీస్‌కు చేపట్టిన మార్చ్‌లో శశిథరూర్ కూడా ప్రత్యక్షమయ్యారు.

ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం.. వీడియో విడుదల
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది ఇండియన్‌ ఆర్మీ.. ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది.. భారత్‌ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్తాన్‌ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. మరోవైపు, భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది విజయం మనదే అంటూ.. ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విడుదల చేసింది.. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేయబడిన 5 నిమిషాల వీడియోలో మొదట ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదారికి సంబంధించిన వార్తాపత్రికల క్లిప్పింగ్‌లను చూపించింది, దీనిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మరియు త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చూపించింది. ఇక, ఆ తర్వాత ” ఆపరేషన్ సిందూర్ ” అనే టెక్స్ట్ తో నల్లని బ్యాక్ గ్రౌండ్ కనిపించింది.. తర్వాత ”భాతర వైమానిక దళం ఖచ్చితత్వంతో, వేగంతో, సంకల్పంతో స్పందించింది” అని రాసుకచ్చింది..

బలపడిన రూపాయి..! అమెరికా డాలర్‌తో పోలిస్తే పెరిగిన మారకం విలువ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాలు విధించిన తర్వాత ఈ రోజు రూపాయి బలపడింది… అమెరికా – రష్యా చర్చల మధ్య సోమవారం ప్రారంభంలో భారత రూపాయి బలపడిందని అంచనా వేస్తున్నారు.. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్థానిక కరెన్సీ 13 పైసలు బలపడి 87.53 వద్ద ప్రారంభమైంది.. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే ఇది 87.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ పరిధి 87.25 మరియు 87.80 మధ్య ఉందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పీ ట్రెజరీ అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ అన్నారు. భారత రూపాయి ఈరోజు స్వల్ప లాభాలతో 87.51 వద్ద ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది.. అయితే మార్కెట్లు అమెరికా మరియు భారతదేశం ద్రవ్యోల్బణం.. ఆగస్టు 15న జరిగే అమెరికా-రష్యా చర్చల కోసం వేచి చూసే రీతిలో ఉన్నాయి.. ఈ చర్చలు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగితే భారతదేశం యొక్క అదనపు 25 బేసిస్ పాయింట్ల సుంకాల సమస్యను పరిష్కరించగలవని భన్సాలీ పేర్కొన్నారు.. ఆర్‌బీఐ డాలర్లను అమ్మడం ద్వారా రూపాయి బలహీనతను కాపాడుతుంది.. కాబట్టి, ఎగుమతిదారులు తమ స్వల్పకాలిక రాబడులను విక్రయించవచ్చు అని సూచించారు.. ఇక, సోమవారం ఉదయం ఆసియా వాణిజ్య మార్కెట్‌లో బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్‌కు 66.25 డాలర్లకు పడిపోయాయి, గత వారం నుండి బాగా తగ్గుదల కొనసాగింది, వ్యాపారులు.. రష్యా మరియు యుఎస్ మధ్య ఉక్రెయిన్ వివాదంలో శాంతిని తెలియజేస్తూ రాబోయే చర్చల కోసం ఎదురు చూస్తున్నారు.

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన గోల్డ్ రేట్స్
పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం ట్రంప్ సుంకాల కారణంగా బంగారం ధరలు కొండెక్కాయి. రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. శ్రావణమాసంలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు. ఈ వారం కూడా ధరలు మరింత పెరగొచ్చన్న నిపుణుల హెచ్చరికలతో బెంబేలెత్తిపోయారు. కానీ ఈ వారం మాత్రం కాస్తా ధరలు ఉపశమనం కలిగించాయి. తులం బంగారం ధర రూ. 760 తగ్గింది. ఇక వెండి ధరలు కూడా ఉపశమనం కలిగిస్తున్నాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 760 రూపాయలు తగ్గి.. రూ.1,02, 280 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర 700 రూపాయిలు తగ్గి.. తులం బంగారం ధర రూ. 93,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర 570 రూపాయిలు తగ్గి 10 గ్రాముల ధర రూ.76,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కేజీ వెండి రూ.1,17, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 27, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.

‘సూరీడు’ ఫిట్‌నెస్‌తో లేడా?.. శుభ్‌మాన్ గిల్ రీఎంట్రీ!
ఆసియా కప్ 2025 త్వరలో ఆరంభం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు టోర్నీ జరగనుంది. ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో ఒప్పందం కారణంగా యూఏఈలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆసియా కప్ కోసం ఆగస్టు మూడో వారంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటనకు మరో వారమే ఉండడంతో.. బీసీసీఐ సన్నాహాలను మొదలు పెట్టింది. దాదాపు 25 మంది ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీలో ఉన్నారు. దాంతో ఇప్పుడు భారత జట్టుపై ఆసక్తి నెలకొంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి స్పష్టత లేదు. రెండు నెలల కింద సూరీడు హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సూర్యను ఎన్‌సీఏ వైద్య బృందం పరీక్షించింది. సూరీడు ప్రస్తుతం ఫుల్ ఫిట్‌గా లేడని సమాచారం. అతడు మరో వారం రోజుల పాటు ఎన్‌సీఏలోనే ఉండనున్నాడట. ఫిజియోలు, వైద్య బృందం పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడట. ఫిట్‌నెస్‌ సాధిస్తే సూర్యనే ఆసియా కప్‌ 2025లో కెప్టెన్‌గా ఉంటాడు. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్యూటీగా అక్షర్ పటేల్ ఉన్నాడు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా ఉంచాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం సూర్య స్థానంలో గిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కనుమరుగు అయిందనుకున్న భామకు క్రేజి ఆఫర్స్
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. 2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రితికా నాయక్.. ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీలో నాని- మృణాల్ యంగర్ డాటర్‌గా కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్లల్లో పడింది రితిక. వరుస ఆఫర్లు వచ్చిననప్పటికీ.. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంది. సైలెంట్‌గా సినిమాలను పట్టాలెక్కిస్తోంది. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తేజా సజ్జాతో పాన్ ఇండియా మూవీ మిరాయ్‌లో నటిస్తోంది. సెప్టెంబర్5న థియేటర్లలోకి రాబోతుంది ఈ బొమ్మ. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ చిత్రంలో ఆడిపాడబోతోంది. ఏడాదిన్నర క్రితమే స్టార్టైన డ్యూయెట్ కూడా ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఇలా సైలెంట్‌గా క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తున్న ఈ ఢిల్లీ గర్ల్స్.. నెక్ట్స్ ఎవరికీ లక్కీ లేడీగా మారుతుందో.

వార్ 2 ఇన్ సైడ్ టాక్.. మా రాత.. ఎన్టీఆర్ నోట..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో  కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. వార్ 2 ఇన్ సైడ్ టాక్ ను చాలా రోజుల కిందట ఎక్స్ క్లూసివ్ గా మేము అందించాము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పకుండా కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుందని కూడా తెలిపాం. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తారక్ ఇదే మాట చెప్పాడు. అయితే ఈ సారి ఏకాంగా ఒకటి కాదు రెండు కాలర్స్ ఎగరేసేలా ఉంటుంది అని చెప్పాడు. దాంతో వార్ 2 పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏమాటకామాట ఎన్టీఆర్ ఒక సినిమా గురించి చెప్పాడంటే మాక్సిమమ్ ఉంటుంది. టెంపర్ నుండి మొన్న వచ్చిన దేవర వరకు ఎన్టీఆర్ చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు వార్ 2 విషయంలో కూడా జరిగితీరుతుంది మరో డౌట్ అక్కర్లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ‘వార్ 2’కి బజ్ లేదనేది వాస్తవం కానీ ఒకే ఒక స్పీచ్ తో ఒకే ఒక్క మాటతో సినిమాకు కావల్సినంత బజ్ తీసుకువచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఎన్టీఆర్ తప్పించుకున్నాడు, నితిన్ బుక్కైపోయాడు..!
జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం పాన్-ఇండియా లెవెల్ స్టార్. ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ, వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. త్వరలోనే ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్‌లాంటి స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. కానీ, ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక దశలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడ్డ కాలం ఉంది. ‘శక్తి’ నుంచి ‘రభస’ వరకు ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. వరుసగా ప్రాజెక్టులు సైన్ చేయడం వల్లే ఆ ఫలితాలు వచ్చాయని అప్పట్లో ఇండస్ట్రీ టాక్. ఈ అనుభవం తర్వాత ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ అంగీకరించే విధానాన్ని అనుసరించాడు. ఈ క్రమంలో కొన్ని మంచి కథలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. వాటిలో ఒకటి ‘శ్రీనివాస కళ్యాణం’.. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఈ కథను సిద్ధం చేశాడు. కథ విన్న ఎన్టీఆర్‌కి కూడా నచ్చింది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అని అందరూ అనుకున్నారు. అయితే, ఎన్టీఆర్ కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇదే సమయంలో నిర్మాత దిల్ రాజు, ఆ కథను మిడ్-రేంజ్ హీరోతో చేయాలని నిర్ణయించి, నితిన్‌తో చిత్రాన్ని పూర్తి చేశారు. కథలో మంచి పాయింట్ ఉన్నా, స్క్రీన్‌ప్లే లోపం కారణంగా ‘శ్రీనివాస కళ్యాణం’ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇలా ఒక మంచి కథలో ఎన్టీఆర్ తప్పించుకో గా, నితిన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బుక్కైపోయాడు.

Exit mobile version