NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం.. ప్రాథమిక అంచనాలు దాటేస్తోంది..
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. ముఖ్యంగా విజయవాడను అతలాకుతలం చేశాయి.. అయితే, ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్‌ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్‌ లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులకు అంచనాలు ఉన్నాయట.. రాష్ట్రంలో జరిగిన వరద నష్టం విషయానికి వస్తే.. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు, 200 ఎకరాల్లో సెరీకల్చర్ కు నష్టం జరిగిందట.. ఏపీలో మొత్తంగా 5921 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.. 4203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బతింటే.. పంచాయతీల పరిధిలో 1160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్డులు డ్యామేజ్‌ అయ్యాయట.. ఇక, 540 పశువులు మృత్యువాత పడగా.. కిలో మీటర్ల మేర 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు దెబ్బతిన్నాయి.. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడిపోయాయి.. వరదలకు 1283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ దెబ్బతిన్నాయి.. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడి అపార నష్టాన్ని మిగిల్చాయి.. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు.. చెరువులకు గండ్లు పడినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇలా అంతా లెక్కిస్తూ పోతుంటే.. వరద నష్టం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ప్రాణం తీసిన పందెం.. రూ.2 వేల కోసం వెళ్తే..!
ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందిగామలో రెండు వేల రూపాయల కోసం వాగులో దూకాడు గోపీచంద్‌ అనే యువకుడు.. రోశయ్య అనే మరో యువకుడితో రూ.2 వేల పందెం కాసిన గోపీచంద్.. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకాడు.. కానీ.. తిరిగి రాలేదు.. రోశయ్య, గోపీచంద్ మధ్య పందెం కుదురించింది.. ఇద్దరూ వాగులోకి దూకి.. ఎవరు ముందు ఒడ్డుకు చేరితే వారికి 2 వేలు ఇచ్చేలా పందెం వేసుకున్నారు.. పందెంలో భాగంగా మున్నేరు వాగులోకి దూకారు ఇద్దరు యువకులు.. అయితే, దూకిన తర్వాత రోశయ్య ఒడ్డుకు చేరాడు.. కానీ. మాడుగుల గోపిచంద్ అనే యువకుడు గల్లంతయ్యాడు.. ఇక, సమాచారం తెలుసుకున్న పోలీసులు.. స్థానికులు గోపీచంద్‌ కోసం ఎంత గాలించినా.. ఉపయోగం లేకుండా పోయింది.. గోపీచంద్ ఆచూకీ లభించలేదు.. అయితే, మద్యం మత్తులో ఇలా చేశారని పోలీసులు గుర్తించారు.. కానీ, మద్యం మత్తులో చేసినా.. మామూలుగా చేసినా.. రూ.2 వేల పందెం.. ఓ నిండు ప్రాణాన్ని తీసింది..

వరద ముంపు ప్రాంతంలో విషాదం.. భోజనం తెచ్చేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
ఓవైపు కృష్ణా నది.. మరోవైపు బుడమేరు వరదతో విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కోలుకోలేదు.. అయితే.. వరద ముంపు ప్రాంతంలో ఈ రోజు ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.. వరద నీరు తగ్గటంతో ఇంటి నుంచి బయటకు భోజనాలు తెచ్చేందుకు వెళ్లిన నాగబాబు అనే యువకుడికి విద్యుత్ షాక్‌తో ప్రాణాలు విడిచాడు.. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వచ్చి సీపీఆర్ చేసినా నాగబాబు ప్రాణాలు కాపాడలేకపోయాడు.. రోడ్డుపై నీరు ఉండడంతో.. ఆ నీటి నుంచి ఎందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునే దాటేందుకు ప్రయత్నించాడు నాగబాబు.. అయితే.. విద్యుత్‌ స్తంభానికి అప్పడికే కరెంట్‌ పాస్‌ అయి ఉందని.. స్తంభం పట్టుకున్న వెంటనే నాగబాబుకు షాక్‌ తగిలిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. కానీ, విద్యుత్ స్తంభానికి కరెంట్ లేదని.. పక్కనే ఉన్న బడ్డీ కొట్టులో ఉన్న విద్యుత్ వల్ల షాక్ తగిలినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కానీ, కరెంట్‌ షాక్‌ ఎలా కొట్టినా.. నాగబాబు ప్రాణాలు మాత్రం పోయాయి.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి.

స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన.. విశాఖలో టెన్షన్ టెన్షన్‌..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక చర్యలకు సన్నద్ధమవుతోంది. ఇవాళ, రేపు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక సమావేశ ఏర్పాటు చేసింది. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు.. మేనేజ్మెంట్ మీటింగ్ కంటే ముందు అనూహ్యమైన నిర్ణయం వెలువడింది. స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్‌ను సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో కొత్త సీఎండీ నియామకం జరిగే వరకు డైరెక్టర్ ఆపరేషన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం దగ్గర వందల మంది కార్మికులు రహదారుల దిగ్బంధనం చేయనున్నారు. రెండు గంటలకు పైగా ప్రధాని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయాలని పోరాట కమిటీ పిలిపిచ్చింది. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని., ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని, సొంత గనులు కేటాయించాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. గడచిన మూడున్నర సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతోంది. అయితే, విశాఖపట్నంలో కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.. రోడ్లను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఆందోళనకు దిగిరు.. అయితే.. నిరసనకారులకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. కార్మిక నేతలను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు.. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది..

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి అనుమతిలేదు.. ట్యాంక్‌బండ్‌పై ఫ్లెక్సీలు..
గణేష్‌ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. కానీ.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ… బ్యానర్లు కట్టారు.

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి.. వాటాను 50% పెంచండి..
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలనిప్రజాభవన్ లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివి.. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని తెలిపారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రయత పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కీలక దశలో ఉన్నది. ఆదికంగా వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు.

సింగిల్ ఛార్జింగ్‌పై 949 కిమీ.. గిన్నిస్ రికార్డుల్లో ‘మెర్సిడెస్‌ బెంజ్‌’!
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్‌ బెంజ్‌’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌’ బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (బీఈవీ) గిన్నిస్‌ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్‌ చార్జ్‌తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్‌ బుక్‌ వర్గాలు తేల్చాయి. మార్గ మధ్యంలో వాహన రద్దీ, రహదారి పనులు, దారి మళ్లింపులు, భారీ వర్షాలు ఉన్నా.. మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ 580 4మేటిక్‌ ఈ రికార్డు సాధించడం విశేషం. బెంగళూరు నుంచి దావణగెరె, హుబ్లీ, బెళగావి, కొల్హాపుర్, సతారా, పుణె మీదుగా ప్రయాణించి నవీ ముంబైకి చేరింది. ప్రతి 100 కిమీ దూరానికి 11.36 కిలోవాట్‌ అవర్‌ విద్యుత్‌ పవర్‌ను ఈ కారు వినియోగించుకుంది. ‘ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ’ కారు నెలకొల్పిన రికార్డును మెర్సిడెస్‌ బెంజ్‌ బద్దలు కొట్టింది. యూకేలో ఆ కారు సింగిల్ ఛార్జింగ్‌పై 916.74 కిమీ ప్రయాణించింది.

తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 2024 కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. కొన్ని రోజులకు పరుగులు పెట్టాయి. రికార్డు ధరలు మళ్లీ నమోదవుతాయా? అనుకున్న సమయంలో ధరలు పడిపోయాయి. రోజురోజుకు పుత్తడి ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సహా 24 క్యారెట్లపై కూడా రూ.30 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (సెప్టెంబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,770గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,840గా ఉంది. మరోవైపు వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం కిలో వెండి ధర రూ.85,000గా నమోదైంది. వెండి ధర నిన్న రూ.500 పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవలి రోజుల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం.

ప్రచంచ రికార్డ్ సృష్టించిన ఇంగ్లాండ్.. 275 పరుగుల తేడాతో విజయం..
బెల్‌ఫాస్ట్‌లో సోమవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐర్లాండ్‌ను 275 పరుగుల తేడాతో ఓడించింది. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ తన 31 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమాంట్ 139 బంతుల్లో 150 పరుగులు నాటౌట్‌గా నిలిచింది. అలాగే ఫ్రెయా కెంప్ 47 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టామీ బ్యూమాంట్ వన్డేల్లో 10వ సెంచరీని నమోదు చేసింది. నాట్ స్కివర్ బ్రంట్‌ ను అధిగమించి మహిళల ODIలో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఐర్లాండ్‌కు ఆరంభం చాలా ఘోరంగా ఉంది. ఐర్లాండ్ తొలి ఓవర్‌ లోనే రెండు వికెట్లు కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ కేట్ క్రాస్ తొలి ఓవర్‌లోనే గాబీ లూయిస్ (0), అమీ హంటర్ (2)లకు పెవిలియన్ దారి పట్టించారు. ఈ తొలి షాక్ నుంచి తేరుకోలేకపోయిన ఐర్లాండ్ జట్టు కేవలం 16.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ జట్టులో ఉనా రేమండ్ హోయ్ అత్యధికంగా 22 పరుగులు చేసింది. ఉనా ఒక్కటే రెండంకెల స్కోరుకు చేరుకోగా, నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతాలు కూడా తెరవలేదు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కేట్‌ క్రాస్‌ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. అదే సమయంలో లారెన్ ఫైలర్ 6 ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకుంది. ఫ్రెయా కెంప్, జార్జియా డేవిస్ చెరో రెండు వికెట్లు తీశారు.

చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన హిట్ సినిమాల దర్శకుడు
టాలీవుడ్ కు మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వీఎన్ ఆదిత్య.  లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మరో  కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ లో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు కేథరీన్ ట్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కేథరీన్ ట్రెసా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంతోమంది దేశ, విదేశాల కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్నారు. అమెరికన్స్‌, స్పానిష్‌ పీపుల్‌, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, తమిళ్‌, కన్నడ, తెలుగు ఆర్టిస్టులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను యూఎస్ లోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ థ్రిల్లర్ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ఈ సినిమాతో వీఎన్ ఆదిత్య సూపర్ హిట్ ఇస్తాడని, బౌన్స్ బ్యాక్ అవుతాడని టాలీవుడ్ వర్గాలు ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

తెలుగు ప్రజలకు తమిళ నటుడి సాయం.. రూపాయి విదల్చని టాలీవుడ్ రాజా – రాణి..
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు సంభవించి ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రజకు అండగా ఉంటాం అని ముందడుగు వేసింది చిత్రపరిశ్రమ. వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ తమ వంతుగా ఆర్థిక సాయం చేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.ఇదిలా ఉండగా తెలుగు ప్రజల ఇబ్బందులు చూసి ఆదుకునేందుకు భాద్యతగా ముందుకు వచ్చాడు తమిళ నటుడు సిలంబరసన్ శింబు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 6 లక్షలు అందించారు. వరద బాధిత తెలుగు రాష్ట్రాలకు సహాయాన్ని అందించిన మొదటి తమిళ నటుడు శింబు. ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేయని శింబు తెలుగు ప్రజలకు చేసిన సాయానికి ‘ఎంత చేసారు అన్నది కాదు.. ఇవ్వాలి అన్న సంకల్పం ముఖ్యం’ అని శింబు పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఒక్కో సినిమాకు రూ. 25 కోట్లు తీసుకునే రాజాలు, నేను మీ పక్కింటి అబ్బాయ్ ని అని చెప్పే సహజ నటులు, ఫ్యామిలీ ఫెమస్ స్టార్ లు, రారా సామి అనే పాడే క్రష్ లు,స్పెషల్ సాంగ్ కు కోట్లు తీసుకునే మావలు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం పట్ల నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓవర్సీస్ లో దేవర దండయాత్ర.. ఆచార్య ఫుల్ రన్ అవుట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన ఇండియాస్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసిగా ఈ గట్టి కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల నోర్లు మూపించాలని శపధం పూని దేవరను పకడ్బందీగా తెరకెక్కించాడు. ఇప్పటికె విడుదల అయిన గ్లిమ్స్ ఆకట్టుకోగా ఈ చిత్రంలోని మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబటట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ బ్రేకుల్లేని బులెట్ ట్రైన్ లా వెళుతోంది. . నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో దేవర $1.1 మిలియన్ రాబట్టి దూసుకెళుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా దేవర రికార్డు క్రియేట్ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొరటాల శివ గత దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ ఆచార్య  నార్త్ అమెరికా ఫుల్ రన్ ($985K) ను దేవర రిలీజ్ కు 17 రోజులు ఉండగానే దాటేసింది. రిలీజ్ నాటికి దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు ముంబై లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రీమియర్స్  వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.