NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా.. ఈ పరిస్థితి ఊహించలేదు..!
ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను.. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అన్నారు టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద భార్య వాణి , కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది.. దువ్వాడ ఇంటివద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయగా.. ఆరుబయటే దువ్వాడ వాణి , హైందవి నిద్రించారు.. అయితే, శుక్రవారం అర్ధరాత్రి దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా సాగింది.. భార్య వాణి, కూతురు హైందవిపై దాడికి యత్నించారు దువ్వాడ. అయితే, ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన దువ్వాడ వాణి.. ఈ గొడవలతో పిల్లులు, ఫ్యామిలీ మొత్తం సపర్‌ అవుతున్నాం అన్నారు.. చిన్న పాపకు మ్యారేజ్ అవ్వాల్సి ఉంది. కొన్ని మనస్పర్దలు వచ్చే పరిస్థితి వచ్చింది. మా పరువు ప్రతిష్ట మంటగలుపుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త దువ్వాడ శ్రీనివాస్‌ వేరే మహిళ‌ చేతిలో ట్రాప్‌ కు గురయ్యారన్నారు దువ్వాడ వాణి.. మేం ఇంటికి వస్తే కొట్టడానికి ప్రయత్నించారు. నా మనసు చాలా గాయపడింది. నా లైఫ్‌ ఇలా టర్న్ అవుతుందని ఊహించలేదు అన్నారు. ఒక్కరూపాయి‌ నా కోసం బేర్ చేయలేని దువ్వాడను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను.. నా లైఫ్‌ పిల్లలకు రాకూడదని భర్తతో సర్దుకు పోయాను అన్నారు.. ఇక, దివ్వల మాధురిని ఎంకరేజ్ చేయడంలో దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను అవగాహనలేని మహిళను కాదు.. పార్టీ క్యాడర్ దివ్వల మాధురి ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. తన భర్తపై అధిష్టానానికి తెలిపాను. రోజు రోజుకూ కంపు‌చేసుకున్నది మాత్రం దువ్వాడ శ్రీనునే అన్నారు.. ఇక, నా పోరాటం కొనసాగుతుంది అన్నారు దువ్వాడ వాణి.

డ్రగ్స్, గంజాయి కట్టడికి చర్యలు.. APNTF ఏర్పాటుకు కసరత్తు..
ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (APNTF) విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది.. డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఆంధ్ప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో APNTF ఏర్పాటు చేయనున్నారు.. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్.. 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోస్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది కూటమి సర్కార్‌.. అవసరమైన సమాచారాన్ని వివిధ విభాగాల నుంచి తీసుకునే అధికారాన్ని APNTFకు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.. కేసుల నమోదు చేసి దర్యాప్తు చేసే కీలక అధికారాలను APNTFకు ఇవ్వనుంది ప్రభుత్వం. APNTF విభాగానికి మొత్తం 724 ప్రభుత్వ, 110 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కావాలని ప్రతిపాదనలు ఉన్నాయి.. దీని అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్‌.. గత ప్రభుత్వ హయాంలో విచ్చిలవిడిగా గంజాయి సాగు.. సరఫరా జరిగిందని.. డ్రగ్స్‌ వాడకం పెరిగిపోవడానికి వారి విధానాలే కారణమని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు.. డ్రగ్స్‌, గంజాయి కట్టడితో పాటు నివారణ చర్యలకు పూనుకుంటుంది.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ వాక్ థాన్ జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత.. సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుకి అభినందనలు తెలిపారు.. ఇక, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి .. ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అన్నారు అనిత.. విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. నాలుగు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1700 వెయ్యి కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు.. ఇన్ స్టంట్ లోన్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.. నాకు కూడా ఈ మధ్య 50 లక్షలు లోన్ ఇస్తామని మెసేజ్ పెట్టారని పేర్కొన్నారు. సైబర్ పోలీస్ స్టేషన్ లు జిల్లాకు ఒకటి ఉన్నాయి.. ప్రతీ జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి.. ఎవరూ మనల్ని చెడగొట్టనవసరం లేదు.. మన మొబైల్, మొబైల్ లో యాప్ చాలు మనం చెడిపోవడానికి అని హెచ్చరించారు. సైబర్ నేరాల పై ఫిర్యాదులు చేసేందుకు అందరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఇక, పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.

నా ‌ఇంటిలో‌ ఒక విచిత్రం.. నా కుటుంబమే నాపై దాడి..!
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి గొడవలు రచ్చకెక్కాయి.. గత రెండు రోజులుగా ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇంటి దగ్గరే బైఠాయించారు వైసీపీ జెడ్పీటీసీ, శ్రీనివాస్‌ భార్య దువ్వాడ వాణి, కూతురు హైందవి.. అయితే, రాత్రి ఉద్రక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఓ దశలో దాడికి కూడా ప్రయత్నం జరిగింది.. అయితే, నా ఇంటిలో ఒక విచిత్ర పరిస్థితి.. నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి.. కానీ, వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ.. మైన్‌ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేది.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసిది అన్నారు.. నేటికి రెండేళ్లుగా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత మరో రకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ.. సామాన్య స్థాయి నుంచి ఎదిగాను. 25 ఏళ్లలో ఒక్కరోజు వ్యక్తిగత పనులకు సమయం కేటాయించలేదు. అధికారం ఉన్నా లేకున్నా నేను ప్రజా సేవలో ఉన్నాను అన్నారు. నా రాజకీయ జీవితంలో‌ కుటుంబాన్ని మిస్ అయ్యాను. కానీ, భర్త నిర్ణయాన్ని భార్యలు వింటారు.. నా ‌ఇంటిలో‌ ఒక విచిత్రం అన్నారు.. నేనేమీ స్థితి మంతుడుని‌ కాను. అయినా.. 30 ఏళ్లలో నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడాను. విచ్చల విడిగా డబ్బు సంపాదించిన రోజులు, డీజిల్ కి ‌డబ్బులు లేని రోజులు చూశాను అన్నారు.

నేతలపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అయితేనే రాజకీయాల్లోకి రండి
రాజకీయ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. బాపట్ల జిల్లా కారంచేడులో జాగర్లముడి కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరుయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, తెన్నేటి కృష్ణ ప్రసాద్.. తదితరులు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు.. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.. అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరు అన్నారు.. మరోవైపు.. ప్రతి ఒక ఎమ్మెల్యే, ఎంపీ చట్టసభల్లో హుందాగా నడుచుకోవాల్సింది పోయి గుండీలు చింపుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. బయటకు రా.. నీ సంగతి తేలుస్తా.. అంటూ వాళ్ల వ్యక్తిత్వం చూపుతున్నారు.. కానీ, ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వారు హుందాగా ఉండాలి.. మాటలు సక్రమంగా రావాలి.. కష్టపడి ఇష్టంగా పనిచేసే వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారు.. అలాంటి వారిని ప్రజలు ప్రతిపక్షాల్లో కూర్చోబెడుతున్నారు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.

వారానికి ఒకసారి నివేదిక పంపండి.. చీఫ్ ఇంజనీర్లకు భట్టి విక్రమార్క ఆదేశం..
అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని.. చీఫ్ ఇంజనీర్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈ లతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్ లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మనమంతా నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలి నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు లేదని తెలిపారు. విద్యుత్ శాఖలో పని చేయడం అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేయడం. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని అని స్థాయిలోని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలన్నారు. సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పనిచేస్తున్నామని పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని తెలిపారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..
తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనం. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా శనివారం స్పందించారు. రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తారు, ఇందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి భద్రాచలంలోని పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కి.మీ పొడవున కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తి చేసి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని స్పష్టం చేశారు.

తొందరలోనే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారు..
లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై దాదాపు 17 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఎట్టకేలకు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఆయన తన కుటుంబంతో కలిసి కన్నాట్‌ ప్లేస్‌ లోని హనుమాన్‌ మందిర్‌ కు వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బజరంగ్‌ బలి ఆశీస్సులు తనపై ఉన్నాయన్నారు. ఆయన ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చాను.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా హనుమాన్‌ ఆశీస్సులు ఉన్నాయని, తనలానే సీఎం కూడా తొందరలోనే జైలు నుంచి రిలీజ్ అవుతారని సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం తీహార్‌ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కాగా, అంతకుముందు.. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ తీసుకొని ఆయనను విడుదల చేయాలని కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు”.. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
హిజాబ్, బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉన్న ముంబైలోని ఓ ప్రైవేట్ కాలేజీ సూచనలను సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీని నిర్వహిస్తున్న ‘చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ’కి నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. క్యాంపస్‌లో హిజాబ్, బురఖాలకు వ్యతిరేకంగా ముంబయిలోని ఎన్‌జీ ఆచార్య అండ్‌ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల సర్క్యులర్‌ను జారీచేసిన సంగతి తెలిసిందే. కాలేజీ ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కళాశాలకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాలేజీ ఆదేశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. యాజమాన్యం తరఫు న్యాయవాది మాధవి దివాన్‌ తన వాదనలు వినిపించారు. విద్యార్థుల మతం బహిర్గతం చేయకూడదనే లక్ష్యంతో ఈ నిబంధన పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా న్యాయమూర్తులు మండిపడ్డారు. విద్యార్థుల పేర్లలో మతం ప్రతిబింబించలేదా? పిల్లలను వారి రోల్ నంబర్లను బట్టి పిలుస్తారా?, మతాన్ని బహిర్గతం చేయొద్దనేది మీ ఉద్దేశమైతే విద్యార్థులు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకోవడాన్ని ఎందుకు నిషేధించలేదు? ఇలాంటి నిబంధనలను అమలు చేయడం అంటే మతాన్ని బయటపెట్టడం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.

స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అర్షద్ యొక్క ఈ విజయం కూడా చరిత్రాత్మకమైనది.. ఎందుకంటే అతను ఒలింపిక్ క్రీడల చరిత్రలో బంగారు పతకం సాధించిన మొదటి పాకిస్థానీ అథ్లెట్. ఇప్పుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు అర్షద్ నదీమ్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రైజ్ మనీ రూ. 10 కోట్లు పాకిస్థాన్ కరెన్సీలో ఉంది. దీనిని భారత కరెన్సీగా మార్చినట్లయితే ఈ మొత్తం దాదాపు 3 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. దీంతో పాటు అర్షద్ నదీమ్ గ్రామమైన ఖనేవాల్‌లో ఆయన పేరు మీద ‘స్పోర్ట్స్ సిటీ’ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు లేకపోయినా ఒలింపిక్ పతకం సాధించడంలో అర్షద్ నదీమ్ చరిత్రాత్మక ఫీట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లో అథ్లెట్లు కావాలనుకునే వారికి సౌకర్యాలు, మంచి వనరులను అందించడానికి స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలనుకుంటున్నట్లు అర్షద్ నదీమ్ కొంతకాలం క్రితం చెప్పాడు. వాస్తవానికి, నదీమ్ జావెలిన్ త్రోను కొనసాగించడానికి అతడి అన్నయ్య నుంచి మొదట ప్రేరణ పొందాడు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిభతో నిండి ఉందని, కానీ వనరుల కొరత కారణంగా, ఆ ప్రతిభ అణచివేయబడిందని అతని అన్నయ్య చెప్పాడు.

వావ్.. గేమ్ ఛేంజర్ లో మూడు పాత్రల్లో కనిపించనున్న రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే విషయం బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్ మెుత్తం పూర్తి కావొచ్చింది. ఇక ఈ సినిమాకు డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో మెగా ఫ్యాన్స్ డిసెంబర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే .. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ రెండు కాదు.. మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట.

కేరళ సీఎంను కలిసిన సీనియర్ హీరోయిన్స్.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిన పడిన ప్రమాదం యావత్ దేశాన్నే కలిచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 390 మందికి పైగా మృతి చెందగా మరో 200 మందికి గాయాలయ్యాయి. ఇంకో 150 మంది ఆచూకీ గల్లంతయింది. ఈ ఘటనలో అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. ఈ ప్రమాద బాధితుల కోసం తామున్నామంటూ పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అనేకమంది సినిమా సెలబ్రిటీలు కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందచేశారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా తన వంతు సాయాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మాత్రమే కాకుండా మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, రష్మిక 10 లక్షలు, నిర్మాత నాగవంశీ 5 లక్షలు.. ఇలా పలువురు సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది ప్రముఖులు విరాళాలు అందచేశారు. అయితే తాజాగా అలనాటి దక్షిణాది హీరోయిన్లు అంతా కలిసి డబ్బులు పోగేసి కోటి రూపాయలను కేరళ సీఎం పినరయి విజయన్ కు అందచేశారు. మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది డైరెక్ట్ గా వెళ్లి కేరళ సీఎంకు కోటి రూపాయల చెక్కు అందచేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ సీనియర్ నటి మీనా తన సోషల్ మీడియాలో.. ‘‘చెన్నై నుంచి మేము కొంతమంది మా ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తరపున వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల డబ్బులు పోగేసాం. కేరళ సీఎం పినరయి విజయన్ గారిని కలిసి కోటి రూపాయల చెక్కుని అందించాము. ఇందుకు సహకరించిన సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన.. వీరి ఫ్యామిలీలకు అభినందనలు. వయనాడ్ కోసం మేము ప్రార్ధిస్తున్నాము’’ అని పోస్ట్ చేసింది. దీంతో సీనియర్ నటీనటులు చేసిన ఈ పనికి వారికి అంతా అభినందనలు తెలుపుతున్నారు.

ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ అప్పట్నుంచే..టైటిల్ అదే!
కల్కి ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి సర్ ప్రైజ్ చేస్తున్నాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్-2 , కల్కి-2 , స్పిరిట్ , రాజాసాబ్ ఇలా అన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనితో ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విధితమే. ఇప్పటికే ఈ కాంబో కి సంబంధించి అడపా దడపా ఏదో ఒక అప్ డేట్స్ ప్రేక్షకుల సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. అదేంటో చూద్దాం.. వైజయంతి మూవీస్ బ్యానర్ లో పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ తో.. హను రాఘవపూడి, ప్రభాస్ సినిమా రాబోతుంది. హనురాఘవపూడి గత సినిమాల్లోని కథ , మేకింగ్ నటి నటులను చూపించే తీరు ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే.. ప్రేక్షకులకు ఈసారి అంతకుమించిన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కథ కూడా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆగ‌స్టు 17న హైద‌రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన‌ పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధురైలో జ‌ర‌గ‌నుంది. మూడు వారాల పాటు జ‌ర‌గ‌నున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రభాస్ 10 రోజులు పాల్గొనున‌న్నాడ‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 22 నుంచి ఆయ‌న షూటింగ్ జాయిన్ కానున్నాడ‌ట‌.