Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వల్లభనేని వంశీకి షాక్‌.. మరో కేసు నమోదు
వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం, 2024 జులై నెలలో తనపై వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో గతంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఫిబ్రవరి 16వ తేదీన అరెస్ట్‌ చేయగా.. ఆ తర్వాత పలు కేసులు వరుసగా నమోదు అయ్యాయి.. ఇలా వంశీపై 11 కేసులు నమోదవడంతో.. 140 రోజులు జైలులో గడిపిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు మరో కేసు నమోదు కావడం చర్చగా మారింది..

5 జిల్లాలకు ఇంఛార్జ్‌లుగా సీనియర్‌ ఐఏఎస్‌లు.. ఉత్తర్వులు జారీ
ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్‌లుగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ లక్ష్యాల అమలుపై దృష్టి పెట్టిన సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. * తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జ్‌గా జి. వీరపాండియన్.. * కాకినాడ జిల్లా ఇంఛార్జ్‌గా ప్రసన్న వెంకటేష్‌.. * బాపట్ల జిల్లా ఇంఛార్జ్‌గా మల్లికార్జున్.. * శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా గంధం చంద్రుడు.. * నంద్యాల జిల్లా ఇంఛార్జ్‌గా సీహెచ్ శ్రీధర్ నియామకం..

మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పోలవరంతో పాటు కొత్త ప్రాజెక్టులపై ఫోకస్‌..
మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు ఆయన ఢిల్లీకి వెళ్లనుండగా, ఈ పర్యటనలో కీలక అంశాలపై కేంద్రంతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు నల్లమల్ల సాగర్ వంటి కొత్త నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రాన్ని కోరనున్నారని తెలిసింది. అలాగే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అనుమతులపై చర్చలు జరపనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి వీఆర్ పాటిల్‌ను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఈ భేటీ కీలకంగా మారనుంది. అదే సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్న సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై వ్యూహం రచించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా పోలవరం ప్రాజెక్టుకు వేగం రావడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఆరు జిల్లాల కలెక్టర్ల బెస్ట్ ప్రాక్టీసెస్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సీఎం ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పాలనను మరింత ప్రజోపయోగంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు తొలిసారిగా కొత్త విధానాన్ని అవలంభించారు. సాధారణ సమీక్షలకు భిన్నంగా, ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కలెక్టర్లే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చేశారు. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను వివరించారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించిన ‘ప్రాజెక్ట్ నిర్మాణ్’ గురించి వివరించారు. పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విద్యార్థులు పరిశుభ్రత, హైజినిక్ అలవాట్లు అలవర్చుకునేలా రూపొందించిన ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా, వారిని మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో రూపొందించిన ‘ప్రాజెక్ట్ మార్పు’ కార్యక్రమాన్ని వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రైతుల సాధికారత, ఆర్థిక లబ్ది, వ్యవసాయంలో ఉత్తమ విధానాల పాటన లక్ష్యంగా చేపట్టిన ‘ఛాంపియన్ ఫార్మర్స్’ కార్యక్రమాన్ని వివరించారు.

ఉద్రిక్తత! నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు..
నగరంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు పరిసరాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెదిరింపు కాల్ లేదా మెసేజ్ వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టు కార్యకలాపాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మూడో విడతలోనూ హస్తం హవా.. ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
రాష్ట్రంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. మూడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ బలపర్చిన 2,060 మందికి పైగా సర్పంచ్‌లు విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు భారీగా లభించిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 1,060 మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే బీఆర్ఎస్‌, బీజేపీ రెండు పార్టీల గెలుపులను కలిపినా మొత్తం సర్పంచ్‌ స్థానాల్లో 30 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్‌ల విషయంలోనూ కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో దాదాపు 90 శాతం మంది తమవాళ్లేనని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. అధికారికంగా పార్టీ గుర్తు లేకపోయినా, తమ మద్దతుతోనే చాలా మంది స్వతంత్రులు విజయం సాధించారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల అభ్యర్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్‌ సమయంలోనూ, ఓట్ల లెక్కింపు వేళనూ వాగ్వాదాలు, తోపులాటలు జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ సర్పంచ్‌ ఎన్నికలు రాష్ట్ర గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఆధిక్యతను అందించాయి. ప్రతి ఓటు కీలకమని, గ్రామస్థాయిలో రాజకీయ పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఎన్నికలు మరోసారి స్పష్టంగా చూపించాయి.

హిందీ మాట్లాడే ఓటర్లే లక్ష్యం?.. ముస్లిం ప్రాంతాల్లో తక్కువ.. బెంగాల్ SIR డ్రాఫ్ట్‌పై రాజకీయ దుమారం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియ తొలి దశను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రాజకీయ చర్చకు దారి తీసింది. డ్రాఫ్ట్ ప్రకారం, గతంలో 7.66 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 7.08 కోట్లకు తగ్గిపోయింది. అంటే మొత్తం 58 లక్షల 20 వేల 898 మంది పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడ్డాయి. ఇక, ఓటర్ల పేర్లు తొలగించడానికి ప్రధాన కారణాలను ఎన్నికల సంఘం తెలియజేసింది. ముఖ్యంగా చనిపోయిన ఓటర్లు, శాశ్వత వలసలు, ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉండటం వంటిని పరిగణలోకి తీసుకుని సర్వే చేసినట్లు పేర్కొనింది. అయితే, ఇది తుది జాబితా కాదని, పిటిషన్లు–అభ్యంతరాల ప్రక్రియ పూర్తయ్యాక మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. తొలగించబడిన పేర్లలో ఎక్కువగా హిందీ మాట్లాడే ఓటర్లు ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. హిందీ భాష మాట్లాడే జనాభా అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల పేర్లు ఎక్కువగా తొలగించబడ్డాయి.. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో తొలగింపుల శాతం చాలా తక్కువగా ఉందని పేర్కొనింది. ఇక, కోల్‌కాతా నగరంతో పాటు దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కోల్‌కాతా ఉత్తర జిల్లాలో 25.92 శాతం, కోల్‌కాతా దక్షిణ జిల్లాలో 23.82 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. జోరాసాంకోలో 36.66 శాతం, చౌరంగీ 35.45 శాతం, హౌరా నార్త్ లో 26.89 శాతం, కోల్‌కాతా పోర్ట్‌లో 26.09 శాతం, మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌లో 21.55 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఈ నియోజకవర్గాల్లో హిందీ మాట్లాడే ఓటర్లు ఎక్కువగా ఉండటం, అలాగే బీజేపీకి ఇక్కడ బలమైన రాజకీయ పట్టు ఉండటం గమనార్హం.

ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. ఆర్ఎస్ఎస్ నేత హాట్ కామెంట్స్
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ మతం “సర్వోన్నతమైనది”.. భారతదేశంలోని ముస్లింలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం నదులు, సూర్యుడిని ఆరాధించాలని సూచించారు. అలాగే, ముస్లిం సోదరులు సూర్య నమస్కారం చేస్తే వారికి ఎలాంటి నష్టం జరగదని, అలా చేసినంత మాత్రాన మసీదుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోరని ఆయన అన్నారు. సూర్య నమస్కారం ఆరోగ్యానికి మేలు చేసే యోగ సాధనంగా అభివర్ణించారు. ప్రార్థనలు చేసే వారు ప్రాణాయామం చేయడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, నమాజ్‌ను వదిలేయమని చెప్పడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మతాలకంటే ముందు “మానవ ధర్మం” ముఖ్యమని హోసబలే వ్యాఖ్యానించారు. కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ విభజన అంశాన్ని ప్రస్తావించిన హోసబలే.. పార్టిషన్ సమయంలో హిందువులకు ఏమి జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. అలాగే, హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతి, జీవజాలంపై అహింసను బోధిస్తుంది, దేవతల పేర్లను పిల్లలకు పేర్లు పెట్టుకునే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. అయితే, “హిందూ మతం సర్వోన్నతమైనది” అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇవి ఒక మతాన్ని మరొక మతంపై ఆధిపత్యంగా చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, “మసీదుకు వెళ్లడాన్ని ఆపం” అనే వ్యాఖ్యల్లో ముస్లింలను హిందూ మెజారిటీ సంస్కృతిలో కలిపివేయాలనే భావన ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. హిందూ ఆచారాలను కేవలం మతపరమైనవిగా కాకుండా, ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ పేరుతో సామాన్యమైన పౌర సంస్కృతిగా చూపించాలని ఆర్ఆర్ ప్రయత్నిస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు.

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకు షాక్.. 20 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు..?
టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. కాగా, 2026 నాటి పెంపుతో ఒక కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెంచేలా కంపెనీలు టార్గెట్ గా పెట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులపై రాబడి (ROI) కోసం ధరల పెంపు ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం కనీసం 300 రూపాయలు దాటాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 – రూ.210 మధ్య ఉంది. కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర లోన్స్ ను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరమైంది. నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకి ఈ మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు మరింత భారంగా మారనుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉండే అవకాశం ఉంది. 20 శాతం పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీ మొత్తంలో పెరగనుంది. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపించనుంది. డేటా ఖరీదుగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం కూడా ఉందనే చర్చ కొనసాగుతుంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులకు రీఛార్జ్ చేయడం ఆపేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగే ప్రమాదం ఉంది.

సౌత్ ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్న విద్యాబాలన్
బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి సినిమాల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమె కనిపించిన తొలి కీలక పాత్ర NTR కథానాయకుడు NTR మహానాయకుడు సినిమాల్లోనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత తమిళంలో బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్‌గా తెరకెక్కిన నెరకొండ పారవైలో అజిత్ కి భార్య పాత్రలో విద్యా బాలన్ కనిపించింది. స్క్రీన్ టైమ్ తక్కువైనా పాత్ర వెయిట్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ మాత్రం చాలా స్ట్రాంగ్. హీరోకి సమానంగా కథను ముందుకు నడిపించే క్యారెక్టర్‌తో ఆమె మరోసారి తన క్లాస్ యాక్టింగ్ చూపించింది. ఇప్పటివరకు సౌత్‌లో తక్కువ సినిమాలే చేసినా… ప్రతి సినిమాలో పాత్ర బలంగా ఉండేలా చూసుకోవడమే విద్యా బాలన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మరో సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ కు సీక్వెల్‌గా జైలర్ 2 రెడీ అవుతోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ జైలర్ 2లో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్క్రిప్ట్ నచ్చడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కథలో మేజర్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే స్ట్రాంగ్, లేయర్డ్ క్యారెక్టర్‌లో విద్యాబాలన్ కనిపించనుందట. ఆమె ప్రజెన్స్ మరింత ఇంటెన్సిటీని యాడ్ చేస్తుంది. 2026 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటంతో జైలర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే గతంలో జైలర్ కూడా ఆగస్టులోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, రజినీకాంత్ మళ్లీ తన ఐకానిక్ పాత్ర టైగర్ ముత్తువేల్ పాండియన్గా నటించనున్నాడు. పాన్-ఇండియా అప్పీల్ కోసం మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్లు క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారు.

శంభాజీ మహరాజ్ పాత్ర కోసం విక్కీ ఇంత త్యాగం చేశాడా.. !
బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నారు. ‘ఆ టార్చర్ సీన్ షూటింగ్ మొదలైన మూడో రోజే నేను తీవ్రంగా గాయపడ్డాను. దానివల్ల నెలన్నర పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అంత కష్టపడి వేసిన సెట్‌ను కూడా తీసేశారు. మళ్ళీ రెండు నెలల తర్వాత 12 రోజుల పాటు శ్రమించి అదే సెట్‌ను మళ్ళీ వేశారు. శంభాజీ మహరాజ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే పట్టుదలతో మేమంతా ఆ సీన్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాం’ అని విక్కీ ఎమోషనల్ అయ్యారు. ఆ కష్టానికి తగ్గట్టుగానే థియేటర్లలో ఆ సీన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కన్నెపిట్టరో.. కన్నుకొట్టరో ‘డెకాయిట్’ శేష్.. టీజర్ అదిరిందిగా
విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమాను ప్రకటించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడ. శేష్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో గాయపడడంతో ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావల్సిన డెకాయిట్ వాయిదా పడింది. గాయం నుండి కోలుకుని ఇటీవల ఈ  సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసాడు శేష్. తాజాగా డెకాయిట్ టీజర్ ను హైదరాబాద్ లోని ఈవెంట్ లో కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు. శేష్ సినిమాల మాదిరిగానే ఈ డెకాయిట్ టీజర్  ఆకట్టుకుంది. ఈ సినిమాలో శేష్, మృణాల్ దొంగలుగా నటిస్తున్నారు. దొంగతనాలు చేసే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వారిని వెంబడించే పోలీసులు లాంటి సెటప్ తో టీజర్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ టీజర్ లో అక్కినేని నాగార్జున ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో సాంగ్ ను రీమిక్స్ చేసి వాడిన విధానం చాలా బాగుంది. టీజర్ లో ఇదే హైలెట్ అని కూడా చెప్పొచ్చు. భీమ్స్ మంచి బీజీఎమ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది పండుగ కానుకగా మార్చి 19న తెలుగు, హిందీలో రిలీజ్ చేయబోతున్నారు.

ఫ్యాన్స్ ముసుగులో మృగాలు! నిధి అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్
అభిమానం అనేది ఉండవచ్చు కానీ, అది అదుపు తప్పితే అవతలి వారికి నరకం చూపిస్తుంది. తాజాగా ‘రాజాసాబ్’ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుధవారం సాయంత్రం జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కేవలం ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, ఆమెను తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నిధి అగర్వాల్ ఎలాగోలా కారులోకి ఎక్కిన తర్వాత ‘ఓ మై గాడ్’ అంటూ షాక్‌లో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే..ఈ దారుణ ఘటనపై సింగర్ చిన్మయి ఎప్పటిలాగే తన గళం విప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘వీళ్లు మగాళ్లు కాదు, జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మృగాలు. ఇలాంటి వారిని ఈ గ్రహం మీద ఉంచకూడదు.. వేరే గ్రహానికి పంపేయాలి’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఇలా హీరోయిన్లను వేధించడం పట్ల ఆమె ఫైర్ అయ్యారు. సెలబ్రిటీల కంటూ ఒక ప్రైవసీ ఉంటుందని, వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. అంతే కాదు.. ఈ ఘటనను చూసి సాధారణ నెటిజన్లు కూడా ‘ఇది అభిమానం కాదు, పక్కా వేధింపులు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వంటి పెద్ద హీరో సినిమా ప్రమోషన్లలో ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యాలు ఉండటం ఏంటని మేకర్స్‌ను కూడా ప్రశ్నిస్తున్నారు. సినిమాల పరంగా ‘రాజా సాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో రాబోతోంది. కానీ, ఇలాంటి సంఘటనలు సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయని, ఫ్యాన్స్ తమ ప్రవర్తన మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Exit mobile version