Off The Record: ఎక్కడైనా స్నేహితుడేగానీ…. పదవి దగ్గర మాత్రం కాదన్నట్టుగా ఉందట అక్కడ రాజకీయం. నిన్నటిదాకా పాలు, నీళ్ళలా కలిసి ఉన్న ఆ ఇద్దరి మధ్య ఒక పోస్ట్ చిచ్చు రగిలి ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారట. చిటపటలాడుతున్న ఆ ఇద్దరు స్నేహితులు ఎవరు? ఏ పదవి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టింది?
Read Also: Off The Record: ఢిల్లీ, గల్లీ ఎవ్వరైనా సరే.. డోంట్ కేర్.. అస్సలు తగ్గేదేలే..
మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మెదక్, రెండోది నర్సాపూర్. నర్సాపూర్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత హస్తం పార్టీ హవా నడిచిన సెగ్మెంట్. కానీ… గత మూడు విడతల నుంచి బీఆర్‌ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ సమీకరణలు మారిపోయాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. రాకపోవడంతో BRS కండువా కప్పుకున్నారు. దీంతో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన ఆంజనేయులు గౌడ్ ని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది పార్టీ. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. ఆవుల రాజిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సునీతా లక్ష్మారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఓడిపోయినా…. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తర్వాత కొన్ని రోజులకు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మహిళా నేత సుహాసిని రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ పదవి దక్కింది. దీంతో ఈ ముగ్గురు నేతలు జిల్లా కేంద్రమైన మెదక్‌లో కాకుండా నర్సాపూర్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు.
Read Also: Sobhita : ఎవరేం అనుకున్నా పట్టించుకోను.. సీక్రెట్ చెప్పిన శోభిత
అయితే, ఈ ముగ్గురిలో ప్రస్తుతం సుహాసిని రెడ్డికి మాత్రమే ప్రోటోకాల్ ఉంది. మిగతా ఇద్దరు నేతలు ఆంజనేయులు గౌడ్, రాజిరెడ్డి పార్టీ పదవుల్లోనే కొనసాగుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎవరి పనులు వారు చేసుకుంటూ… కలిసి మెలిసి ఉండే ఈ నేతల మధ్య మెల్లగా విబేధాలు మొదలయ్యాయట. త్వరలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులను ప్రకటించనుంది. దీంతో అన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇదే పదవి ఇప్పుడు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజి రెడ్డి మధ్య అగ్గి రాజేసిందట. మరోసారి జిల్లా అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని ఆంజనేయులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తుంటే…ఈ సారి తాను కూడా రేసులో ఉన్నానని రాజిరెడ్డి అంటున్నట్టు సమాచారం. తన పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ఆయన. ఈ క్రమంలో నర్సాపూర్ నియోజకవర్గంలో రాజిరెడ్డి, ఆంజనేయులు వర్గాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.
Read Also: Vijay Devarakonda : నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..
ఇక, గతంలో.. నర్సాపూర్ లో పార్టీ, ప్రయివేటు ఏ కార్యక్రమం అయినా ఈ ఇద్దరు నేతలు కలిసి వెళ్లేవారు. కానీ ఎప్పుడైతే డీసీసీ అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి ఎవరిదారి వాదిదే అన్నట్టుగా ఉంటున్నారట. మొన్నటి వరకు రాజిరెడ్డి తనతోనే ఉండి ఇప్పుడు తన పదవికే గురి పెట్టడాన్ని ఆంజనేయులు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసింది. తాను ఏళ్ళ తరబడి పార్టీ కోసం కష్టపడి ఈ స్థాయికి వస్తే ఓర్వలేకపోతున్నారని అనుచరులతో చెబుతున్నట్టు సమాచారం. అటు రాజిరెడ్డి వెర్షన్ మరోలా ఉందట. తాను ఓడిపోయినా నర్సాపూర్ లో పార్టీని ముందుండి నడిపిస్తున్నానని ఇప్పటికే పార్టీకి బలం పెరిగిందని అంటున్నారట. డీసీసీ పదవి ఇస్తే జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నది రాజిరెడ్డి వాదన. మొత్తంగా నిన్న మొన్నటివరకు దోస్త్ మేరా దోస్త్ అన్న నేతలు ఇప్పుడు డీసీసీ పోస్ట్ కోసం కుస్తీపడుతున్నారట. మరి అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తోందో చూడాలి.
