డైరెక్టర్ శంకర్ తో ‘ఇండియన్ 2’ నిర్మాతల గొడవ కోర్టుదాకా వెళ్లింది. తాజాగా రిటైర్డ్ జడ్జిని రంగంలోకి దింపింది మద్రాస్ హైకోర్ట్. విశ్రాంత న్యాయమూర్తి ఆర్. పానుమతి ఇకపై లైకా ప్రొడక్షన్స్ కి, శంకర్ కి మధ్య మీడియేటర్ గా వ్యవహరిస్తారు. ఆయన సయోధ్య ప్రయత్నాల తరువాత మద్రాస్ కోర్ట్ తీర్పు వెలువరించనుంది. రిటైర్డ్ జడ్జ్ ఇవ్వబోయే నివేదికే ఇప్పుడు కీలకం కానుంది. న్యాయమూర్తి చూపే పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకుంటే ‘ఇండియన్ 2’ త్వరలోనే పునః ప్రారంభం అవుతుంది.
Read Also: నెట్ ఫ్లిక్స్ నెట్టేస్తోంది! ఇక ‘ఆ సినిమాలు, సిరీస్ లు’ అందుబాటులో ఉండవు!
‘ఇండియన్ 2’ మొదట్నుంచీ అడ్డంకులు ఎదుర్కొంటూనే ఉంది. ప్రారంభంలో బడ్జెట్ కారణాల చేత ఆలస్యమైంది. తరువాత సెట్ మీద ప్రమాదం జరిగి కొన్నాళ్లు ఆగిపోయింది. ఆపైన లాక్ డౌన్స్ వల్ల ‘ఇండియన్ 2’కి బ్రేకులు పడ్డాయి. ఇవన్నీ అయ్యాక దర్శకుడితో నిర్మాతలకి భేదాభిప్రాయాలు రావటంతో అసలుకే మోసం వచ్చింది. శంకర్ ‘ఇండియన్ 2’ని మొత్తానికి మొత్తంగా పక్కకు పెట్టేసి ఇతర ప్రాజెక్ట్స్ దృష్టి పెట్టాడు. టాలీవుడ్ లో రామ్ చరణ్ తో, బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో సినిమాలు ప్రకటించాడు. దాంతో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించింది. ‘ఇండియన్ 2’ పూర్తి చేసేదాకా శంకర్ మరో సినిమా చేయకుండా ఆపాలని కోరింది.
తమిళనాడు అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుందోనని అటు పరిశ్రమ, ఇటు జనంలోనూ ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ లాంటి నటీనటులు ఉండటంతో ‘ఇండియన్ 2’ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, వివిధ కారణాలతో అంతకంతకూ ఆలస్యం అవుతోంది. చూడాలి మరి, ‘భారతీయుడు’ బాక్సాఫీస్ వద్దకి ఎంత కాలానికి తిరిగి వస్తాడో…