జీ 5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరుతోంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత, ‘మధుర ఆడియోస్’ అధినేత శ్రీధర్ రెడ్డి… దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. దాంతో క్రేజీ మూవీ ‘వివాహ భోజనంబు’తో సోనీ లైవ్ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టేలా ఆయన పథక రచన చేశారు. హీరో సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ మూవీతో కమెడియన్ సత్య హీరోగా పరిచయం అవుతున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ‘నెల్లూరు ప్రభ’ అనే పాత్రలో సందీప్ కిషన్ కూడా కనిపిస్తాడు. అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని లాక్ డౌన్ లో జరిగిన కొన్ని యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
కరోనా కారణంగా కొద్దిమంది సమక్షంలోనే సింపుల్ గా పెళ్ళి చేసుకుందామని భావించిన పిసినారి మహేశ్, లాక్ డౌన్ పెట్టడంతో తన ఇంటికి వచ్చిన చుట్టాలను పోషించడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే అంశాన్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించామని సందీప్ కిషన్ తెలిపారు. సోనీ లైవ్ ద్వారా ప్రసారం కాబోతున్న తొలి తెలుగు చిత్రం తమదే కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది.
వెంకటాద్రి టాకీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె. ఎస్. శినీష్, సందీప్ కిషన్ సంయుక్తంగా నిర్మించిన ‘వివాహ భోజనంబు’లో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, టి.ఎన్.ఆర్, ‘వైవా’ హర్ష, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భాను భోగవరపు స్టోరీ అందించగా, నందు ఆర్. కె డైలాగ్స్ రాశారు. అనివీ సంగీతం సమకూర్చారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.