27 ఏళ్లుగా టీ-సిరీస్ లాంటి అగ్ర సంస్థతో కలసి పని చేసిన వినోద్ భానుశాలీ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. దేశంలోనే నంబర్ వన్ మ్యూజిక్ కంపెనీగా టీ-సిరీస్ ఎదగటంలో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉంది. స్వర్గీయ గుల్షన్ కుమార్ కాలంలో కేవలం ఒక ఉద్యోగిగా చేరిన వినోద్ అంచెలంచెలుగా ఎదిగాడు. తనతో పాటూ టీ-సిరీస్ ని కూడా పెంచుతూ వచ్చాడు. 1994లో ఆయన అనుకోకుండా కంపెనీలోకి వచ్చాడు. ఆ తరువాత గుల్షన్ కుమార్ తో కలసి పని చేశాడు. సోనూ నిగమ్ , అద్నాన్ సమీ లాంటి అనాటి యువ గాయకుల పాటలతో దేశాన్ని ఉర్రూతలూగించాడు. క్యాసెట్స్ , సీడీస్ వ్యాపారంలో టీ-సిరీస్ కు తిరుగులేకుండా చేశాడు.
క్యాసెట్స్, సీడీస్ తరువాత డిజిటల్ ఎరా వచ్చాక కూడా వినోద్ భానుశాలీ టీ-సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు. గుల్షన్ కుమార్ తనయుడు భూషణ్ కుమార్ తో కూడా చురుగ్గా పని చేశాడు. ఉద్యోగిగానే కాక టీ-సిరీస్ నిర్మించే ఎన్నో సినిమాలకు ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ మధ్య కాలంలో ఆయన కో ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమాలు ‘కబీర్ సింగ్, బాట్లా హౌజ్, సాహో, తప్పడ్, తానాజీ’ వంటివి! ప్రస్తుతం బాలీవుడ్ మ్యూజిక్ శాసిస్తోన్న గురు రందావా, జుబిన్ నౌత్యాల్, ధ్వనీ భానుశాలీ వంటి సింగర్స్ ని సైతం వినోద్ భానుశాలీ ఎంతగానో ఎంకరేజ్ చేశాడు.
దాదాపు మూడు దశాబ్దాల ప్రయాణం తరువాత టీ-సిరీస్ ను విడిచిపెడుతోన్న వినోద్ త్వరలో కొత్త వ్యాపారం మొదలు పెడతాడట. అదేంటో స్పష్టంగా చెప్పలేదుగానీ తాను ఎదగటానికి కారణమైన గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ కు భానుశాలీ ధన్యవాదాలు తెలిపాడు…