మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, గుల్ పనాగ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించినది ఫ్యామిలీమ్యాన్
వెబ్ సీరిస్ సీజన్ 1కు విశేష ఆదరణ లభించింది. దాంతో రెండో సీజన్ కోసం వీక్షకులకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ దర్శక నిర్మాతలు ఈ వెజ్ సీరిస్ సీజన్ 2న డిలే చేస్తూ వచ్చారు. అయితే… ఇక వీక్షకుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చేసింది. బుధవారం ది ఫ్యామిలీ మ్యాన్ 2
ట్రైలర్ విడుదల కాబోతోంది. అందులో ఖచ్చితంగా ఈ వెబ్ సీరిస్ ద్వితీయభాగం ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. జూన్ 4 లేదా 11వ తేదీలలో ఏదో ఒక దానిని మేకర్స్ ఎంపిక చేస్తారని అంటున్నారు. నిజానికి ది ఫ్యామిలీ మ్యాన్ 2
సీరిస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెబ్ సీరిస్ మీద సైతం కొన్ని ఆంక్షలు ప్రవేశ పెట్టింది. భారత దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేవి, అలానే భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని నీరు కార్చే సన్నివేశాలు లేకుండా వెబ్ సీరిస్ నిర్మించాలని హితవు పలికింది. దానికి అనుగణంగా ది ఫ్యామిలీ మ్యాన్ 2
ను ఒకటి రెండు సార్లు చూసి అలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు లేవనే నిర్థారణకు మేకర్స్ రావడానికి కాస్తంత సమయం పట్టిందట. అయితే చెదురు మదురుగా ఒకటి రెండు చోట్ల మాత్రం వాళ్ళే స్వీయ నియంత్రణలో భాగంగా కొన్ని కట్స్ చేసుకున్నారట. అంతకు మించి మేజర్ కట్స్ లేకుండానే ఈ వెబ్ సీరిస్ ను వీక్షకుల ముందుకు తీసుకెళ్ళిపోతున్నామని చిత్ర బృందం తెలిపింది. విశేషం ఏమంటే… ఈ రెండో సీజన్ లో సమంత ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించబోతోందనే ప్రచారం జరిగింది. దాంతో అందరి దృష్టీ ది ఫ్యామిలీ మ్యాన్ -2
మీదే ఉంది.