NTV Telugu Site icon

త్వ‌ర‌లో ఆహా నుంచి మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్‌ ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’

ఇప్పుడు సినిమాలే కాదు… వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ అవుతున్నాయి. అందులో భాగంగా టి.వి.ఎఫ్. ఒరిజినల్ ‘ఫ్లేమ్స్’ తెలుగులో ‘తరగతి గది దాటి’ పేరుతో రీమేక్ అవుతోంది. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో ఈ వెబ్ సీరిస్ తెలుగులో రాబోతోంది. దీనిని ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మ‌ల్లిక్ రామ్ ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’ సిరీస్‌ కు దర్శకత్వం వహిస్తున్నారు. హ‌ర్షిత్ రెడ్డి, పాయ‌ల్ రాధాకృష్ణ‌, నిఖిల్ దేవాదుల ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది.

ఇక ‘తరగతి గది దాటి’ తెలుగు వర్షన్ విషయానికి వస్తే… ఇది రాజమండ్రిలో జరిగే కథ. గోదావ‌రి, దాని చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లోని జీవనాన్ని తెలియ‌జేస్తుంది. కృష్ణ అలియాస్ కిట్టు అనే యువ‌కుడు చుట్టూ తిరిగే క‌థ‌. కిట్టు త‌ల్లిదండ్రులైన శంక‌ర్‌, గౌరి ఓ కోచింగ్ సెంట‌ర్‌ను న‌డుపుతుంటారు. కృష్ణ‌కు లెక్క‌లంటే చాలా ఇష్టం. విద్యార్థిగా మంచి తెలివితేటలుంటాయి. కానీ చ‌దువుపై దృష్టి పెట్ట‌డు. వాళ్ల కోచింగ్ సెంట‌ర్‌లో జాస్మిన్ అనే అమ్మాయి జాయిన్ అయిన త‌ర్వాత అత‌ని ప్రపంచం ఎలాంటి మలుపులు తిరుగుతుంద‌నేదే క‌థ‌. ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్‌లో కృష్ణ‌, జాస్మిన్ మ‌ధ్య ప్రేమ‌, టీనేజ్ గంద‌ర‌గోళాలెలా ఉంటాయ‌నే వీక్ష‌కులు చూడొచ్చు. ఈ ఏడాది విడుద‌లైన ‘మెయిల్’ వెబ్ మూవీతో హ‌ర్షిత్ రెడ్డి త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. భిన్న‌, సింగ‌పెన్నె వంటి కన్న‌డ‌, త‌మిళ వెబ్ సిరీస్‌ల్లో న‌టించిన పాయ‌ల్ రాధాకృష్ణ‌న్ న‌టిగా త‌నెంటో ప్రూవ్ చేసుకుంది. ఉయ్యాల జంపాల‌, బాహుబ‌లి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన నిఖిల్ దేవాదుల ప‌రిణితి గ‌ల న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నాడు.

గతంలో టి.వి.ఎఫ్ ఒరిజిన‌ల్ ‘ప‌ర్మ‌నెంట్ రూమ్‌మేట్స్’ ను మ‌న నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి ‘క‌మిట్‌మెంట‌ల్‌’ తీశారు. అందులో ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్‌, పున‌ర్న‌వి భూపాలం ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. క‌మిట్ మెంటల్‌ త‌ర్వాత టి.వి.ఎఫ్ నుంచి ‘ఫ్లేమ్స్‌’ను త‌ర‌గ‌తి గ‌ది దాటిగా ఆహా రీమేక్ చేస్తుండటం విశేషం.