NTV Telugu Site icon

షావుకారు జాన‌కి కీర్తి కిరీటంలో ప‌ద్మశ్రీ

తొమ్మిది ప‌దుల వ‌య‌సులో నేటికీ తొణ‌క్క బెణ‌క్క హుషారుగా సాగుతున్న మేటి న‌టి షావుకారు జాన‌కి కీర్తి కిరీటంలో తొలి ప‌ద్మ అవార్డు చోటు చేసుకుంది. 72 సంవ‌త్సరాల న‌ట‌నాజీవితం గ‌డిపిన షావుకారు జాన‌కి వంటి మేటి న‌టికి ఇన్నాళ్ళకు, ఇన్నేళ్లకు ప‌ద్మశ్రీ‌ పుర‌స్కారం ల‌భించ‌డం ఆమె అభిమానుల‌కు ఆనందం పంచుతోంది. అయితే, చాలా ఆల‌స్యంగా జాన‌కికి ఈ అవార్డు ల‌భించింద‌ని కొంద‌రు ఆవేద‌న చెందుతున్నారు. జాన‌కి మాత్రం ఎప్పుడు వ‌చ్చింది అన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం త‌న‌ను గుర్తించినందుకు ఎంతో ఆనందంగా ఉంద‌ని అంటున్నారు. డిసెంబ‌ర్ 12న 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాన‌కి ఇప్పటికీ ఎంతో హుషారుగా ఉన్నారు. ఆమె 90వ సంవత్సరాన్ని పురస్కరించుకొని త‌న‌యుడు ఓ కొత్త ఫ్లాట్ కూడా బ‌హుమానంగా ఇచ్చారు. అందులోనే ఉంటూ ఎంతో ఆనందంగా ఉన్నారామె. ఈ ప్యాండ‌మిక్ లో ఎవ‌రినీ క‌ల‌వ‌కున్నా, 90 ఏళ్ళ వ‌య‌సులోనూ జాన‌కి హుషారుగా ఉండ‌డం విశేషం. ఆమెకు ప‌ద్మ పుర‌స్కారం మ‌రింత ఉత్సాహం క‌లిగించింద‌ని చెప్పవచ్చు

షావుకారు జాన‌కిగా జ‌నం మ‌దిలో నిల‌చిన ఆమె 1931 డిసెంబ‌ర్ 12న రాజ‌మండ్రిలో జ‌న్మించారు. ఆమె తండ్రి టి.వెంకోటీరావు ఉద్యోగ రీత్యా ఉత్తర భార‌తంలో ప‌నిచేశారు. అలా అస్సామ్ లోని గౌహ‌తీలో విద్యాభ్యాసం సాగించారు. మ‌ద్రాసు చేరుకున్న త‌రువాత 14 ఏళ్ళ వ‌య‌సుకే ఆమెకు వివాహం చేశారు. అప్ప‌టి నుంచే ఆమె రేడియో నాట‌కాల్లోనూ, రంగ‌స్థలం మీద ప‌లు ప్రదర్శనలు ఇచ్చారు. విజ‌యా సంస్థను నెల‌కొల్పి నాగిరెడ్డి, చక్రపాణి త‌మ తొలి ప్రయత్నంగా ఎల్.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో షావుకారు చిత్రాన్ని నిర్మించారు. అందులో జాన‌కిని నాయిక‌గా ఎంచుకున్నారు. య‌న్టీఆర్ హీరోగా విడుద‌లైన తొలి చిత్రం షావుకారు. అందువ‌ల్ల య‌న్టీఆర్ తొలి నాయిక‌గా షావుకారు జాన‌కి నిల‌చిపోయారు. షావుకారు సినిమాతో ఎన‌లేనిపేరు ల‌భించింది. దాంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారింది.

మాతృభాష తెలుగులో న‌టిస్తూనే త‌మిళ‌,క‌న్నడ చిత్రాల‌లోనూ త‌న‌దైన బాణీ ప‌లికించారు షావుకారు జాన‌కి. య‌న్టీఆర్ స‌ర‌స‌న ఆమె న‌టించిన వ‌ద్దంటే డ‌బ్బు, క‌న్యా శుల్కం, రేచుక్క-ప‌గ‌టిచుక్క, చెర‌పకురాచెడేవు, సొంత‌వూరు, జ‌యం మ‌న‌దే, పెంపుడు కూతురు చిత్రాలు అల‌రించాయి. ఇక ఏయ‌న్నార్ తో జోడీ క‌ట్టిన రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, అక్కాచెల్లెళ్ళు, మంచి కుటుంబం వంటి సినిమాలూ ఆక‌ట్టుకున్నాయి. త‌రువాతి త‌రం హీరోల‌కు త‌ల్లిగా, వ‌దిన‌గా, అక్కగా న‌టిస్తూ జ‌నాన్ని మురిపించారు జాన‌కి. ఆమె సొంత చెల్లెలు ప్రముఖ న‌టి కృష్ణకుమారి. ఆమె తెలుగునాట నాయిక‌గా రాణిస్తున్న రోజుల్లోనే త‌మిళంలో నాటి మేటి హీరోల‌యిన శివాజీ గ‌ణేశ‌న్, ఎమ్జీఆర్, జెమినీ గ‌ణేశ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా ఆక‌ట్టుకున్నారు జాన‌కి. కన్నడ సినిమాల్లోనూ త‌నదైన బాణీ ప‌లికించారామె. త‌రువాతి రోజుల్లో తాయర‌మ్మ-బంగార‌య్య, సంసారం ఒక చ‌ద‌రంగం, పులిబిడ్డ, క‌ట‌క‌టాల రుద్రయ్య, తోడికోడ‌ళ్ళు వంటి చిత్రాల్లోనూ వ‌య‌సుకు త‌గ్గ పాత్రలలో న‌టించారు. న‌వ‌త‌రం హీరోలు న‌టించిన ఎవ‌డే సుబ్రమణ్యం, కంచె, బాబు బంగారం, సౌఖ్యం వంటి చిత్రాల‌లో క‌నిపించి మురిపించారు జాన‌కి. గ‌త యేడాది రూపొందిన అన్ని మంచి శ‌కున‌ములే చిత్రంలోనూ జాన‌కి న‌టించారు. ఇప్పటికీ త‌న ద‌రికి చేరుతున్న పాత్రలతో అల‌రిస్తున్న జాన‌కికి ఇన్నేళ్లకైనా ప‌ద్మశ్రీ‌ ల‌భించినందుకు ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు. జానకిని గుర్తు చేసుకొని ఆమెను ప‌ద్మశ్రీ‌ పు
ర‌స్కారానికి సిఫార‌సు చేసిన త‌మిళ‌నాడు ప్రభుత్వాన్ని కూడా సర్వత్రా అభినందిస్తున్నారు. జాన‌కి మ‌రిన్ని వ‌సంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాల‌ని, ఈ పుర‌స్కారంతో ఆమె మ‌రింత ఆనందంగా జీవిస్తార‌ని ఆశిద్దాం.