ది ఫ్యామిలీ మ్యాన్
సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి రాజ్ అండ్ డీకే టీమ్ కృషి కూడా ఎంతో ఉంది. అయితే… ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయమై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలలోకి వెళితే… రెండు సీరిస్ లలో శ్రీకాంత్ తివారిగా నటించిన మనోజ్ బాజ్ పాయ్ కు 10 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. అలానే అతని భార్య సుచిగా నటించిన ప్రముఖ నటి ప్రియమణికి ఒక్కో సీరిస్ కు 80 లక్షలు పే చేశారట. ఇక సీజన్ 2తో తమిళ తీవ్రవాది రాజీ పాత్రకు ప్రాణం పోసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న సమంతకు మూడు నుండి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మనోజ్ బాజ్ పాయ్ కుమర్తె గా ఆశ్లేషా ఠాకూర్ నటించింది. తొలి సీరిస్ లో ఆమె పాత్రకు పెద్దంత ప్రాముఖ్యం లేకపోయినా… రెండో సీజన్ లో ఆమెది కీలకమైన పాత్ర. ఆమెకు యాభై లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇక ఇతర ప్రధాన పాత్రధారులలో షరీఫ్ హష్మీకి 65 లక్షలు, దర్శన్ కుమార్ కు కోటి రూపాయలు, శరత్ ఖేల్కర్ కు 1.6 కోట్లు, సన్నీ హిందూజాకు 60 లక్షలు ఇచ్చారన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ లో ఎవరెవరి రెమ్యూనరేషన్ ఎంతెంత?
