“ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియెల్లో…” అనే పాట వినగానే నటుడు,నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గుర్తుకు వస్తారు. ఇక ఆయన పేరు తలచుకోగానే ఎర్రజెండా సినిమాలే స్ఫురిస్తాయి. మాదాల రంగారావు తరువాత ‘రెడ్’ మూవీస్ కు అసలు సిసలు క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత నిస్సందేహంగా ఆర్.నారాయణ మూర్తిదే! చిన్నతనం నుంచీ మట్టివాసన గట్టిగా తెలిసిన వాడు కావడంతో మట్టిమనిషిలా జీవించాలని తపిస్తారు. ఏ హంగూ, ఆర్భాటమూ ఆయనకు ఇష్టం ఉండవు. అతి సామాన్యునిలా జీవిస్తారు. ఇప్పటికీ హైదరాబాద్ నగర వీధుల్లో నడచుకుంటూనే పోతుంటారు నారాయణమూర్తి. ఆయనను ఎవరైనా గుర్తుపట్టి పలకరిస్తే , ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఒకవేళ తనకు ఏదైనా అత్యవసర కార్యం ఉంటే పలకరించిన మనిషి పర్మిషన్ తీసుకొని మరీ వెళతారు. అదీ నారాయణ మూర్తి తీరు. ఆ తీరుతోనే నటులలో తాను వేరయా అంటూ సాగిపోతున్నారు.
రెడ్డి నారాయణమూర్తి 1953 డిసెంబర్ 31న తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో ఓ పేద రైతుకుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే యన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు చూసి, వారిపై అభిమానం పెంచుకొని, వారిలాగే నటిస్తూ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించేవారు. చదువుకొనే రోజుల్లోనే సినిమాల్లో తానూ వెలిగిపోవాలని కలలు కన్నారు నారాయణమూర్తి. కొందరు పెద్దలు ముందు చదువు పూర్తి చేసుకొని రా అవకాశాలు ఇస్తామన్నారు. దాంతో ఇంటర్మీడియట్ కాగానే సినిమాల వేటలో పడ్డారు. 1973లో నారాయణమూర్తి స్వస్థలం సమీపంలో గోదారి గట్టుమీద కె.విశ్వనాథ్ ‘శారద’ చిత్రం తెరకెక్కించారు. అప్పుడు విశ్వనాథ్ దగ్గరకెళ్ళి తనకేదైనా పాత్ర ఉంటే ఇవ్వండి అంటూ అడిగారు నారాయణమూర్తి. అలా విశ్వనాథ్ తన ‘నేరము-శిక్ష’లో ఓ బిట్ రోల్ వేయించారు. జేబులో పైసలుంటే కడుపునిండా తినేవాడు, లేదంటే కార్పోరేషన్ కొలాయి నీళ్ళతో కడుపునింపుకొనేవాడు నారాయణ మూర్తి. ఆ తరువాత దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడింది. ఆయన చిత్రాలలో బిట్ రోల్స్ వేసుకుంటూ జీవనం సాగించారు నారాయణమూర్తి.
అనేక చిత్రాలలో ఆర్.నారాయణ మూర్తి బిట్ రోల్స్ వేశారు. అయితే ఏవీ పేరు తీసుకు రాలేదు. ఆ సమయంలో దాసరి ‘నీడ’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు. కానీ, అవకాశాలు పలకరించ లేదు. ఏదైనా చేయాలని తపించారు. ఆ తపనలో తానే హీరో కావాలని నిర్ణయించారు. బాగానే ఉంది. మరి తనతో సినిమా తీసే నిర్మాత ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. ఎలా ఎలా అంటూ నారాయణమూర్తి సతమతమవుతున్న సమయంలో కొందరు మిత్రులు ఆర్థిక సాయం చేస్తామని దన్నుగా నిలిచారు. అందువల్లే తన బ్యానర్ కు ‘స్నేహచిత్ర’ అని నామకరణం చేసి తొలి ప్రయత్నంగా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ తీశారు. ఆ సినిమా మంచి పేరు సంపాదించిపెట్టడంతో ముందుకు సాగారు. వరుసగా “లాల్ సలామ్, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం” వంటి చిత్రాలు తీశారు. ఈ చిత్రాలద్వారా వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకునిగా మంచిపేరు సంపాదించారు. ఇక పలువురు ప్రజాకవులతో తన చిత్రాలలో పాటలు రాయించారు. తన గురుతుల్యులైన దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి నటించిన ‘ఒరేయ్ రిక్షా’ బంపర్ హిట్టయింది. ఆ సమయంలోనే ‘పీపుల్స్ స్టార్’ అని బిరుదునిచ్చారు దాసరి. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆర్ .నారాయణ మూర్తి ప్రజాసమస్యలపై తన చిత్రాల ద్వారా పోరు సాగిస్తూనే ఉన్నారు.
రైతుల కష్టాలపై ఆ మధ్య ‘అన్నదాతా సుఖీభవా’ చిత్రాన్ని నిర్మించిన ఆర్ .నారాయణ మూర్తికి ప్రశంసలు దక్కాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం చేసిన నవీన రైతు చట్టం నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘రైతన్న’ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఆర్. నారాయణ మూర్తి ఏ సినిమా తెరకెక్కించక పోయినా, మళ్ళీ ఏదో ఒక ప్రజాసమస్యపై ఆయన ఓ చిత్రాన్ని రూపొందిస్తారనే నమ్మకంతో ఉన్నారు జనం.