దర్శకుడు అల్ఫోన్సే పుత్రెన్ 2013 బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ‘నేరం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2015లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘ప్రేమమ్’ చిత్రంతో అల్ఫోన్సే కు దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది. ప్రేమమ్ తరువాత అల్ఫోన్సే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఇందులో ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించాడు. అయితే తాజాగా జరిగిన సోషల్ మీడియా సంభాషణలో సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తన దగ్గర ఓ స్టోరీ ఉందని, ఆయనతో సినిమా చేయడం కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నానని అల్ఫోన్సే తెలిపారు. ఫేస్ బుక్ లో దర్శకుడు అల్ఫోన్సే ఓ నెటిజన్ కు సమాధానమిస్తూ ‘ప్రేమమ్’ తరువాత రజినీకాంత్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని తెలిపారు. ఆయన సూపర్ స్టార్ ను కలవడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, తాను ఖచ్చితంగా ఏదో ఒకరోజు రజినీకాంత్ తో కలిసి పని చేస్తానని చెప్పారు. మనవంతు ప్రయత్నం మనం చేస్తే మిగిలింది దేవుడే చేస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా తగ్గిన తరువాత సూపర్ స్టార్ ను కలుస్తానని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.