(జూన్ 2న గుణశేఖర్ పుట్టినరోజు)
చిత్రసీమలో దాదాపు మూడు దశాబ్దాల నుంచీ దర్శకునిగా ఉన్నా, గుణశేఖర్ తీసింది పట్టుమని పన్నెండు సినిమాలే! అయినా వాటిలో అన్నిటా వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నమే చేశారు గుణశేఖర్. తొలి చిత్రం ‘లాఠీ’తోనే దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారు. రెండో సినిమా ‘సొగసు చూడతరమా’తోనూ ఆకట్టుకోగలిగారు. మూడో చిత్రం ‘రామాయణం’లో ఓ ప్రయోగం చేశారు. అందరూ బాలలతో ‘రామాయణం’ తెరకెక్కించారు. అందుకు నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి సాహసం కూడా తోడయింది. ఆ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.
మూడు చిత్రాలతోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్న గుణశేఖర్ కు చిరంజీవి ‘చూడాలనివుంది’ అసలు సిసలు ఘనవిజయాన్ని చూపించింది. తరువాత కూడా వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ‘మనోహరం’ మనసులను అంతగా హరించలేకపోయింది. ‘మృగరాజు’ సరిగా గర్జించలేకపోయాడు. అప్పుడు మహేశ్ తో ‘ఒక్కడు’ తీసి మురిపించారు గుణశేఖర్. మహేశ్ కెరీర్ లో ‘ఒక్కడు’ తొలి గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఆ నమ్మకంతోనే గుణశేఖర్ తో ‘అర్జున్’గానూ, ‘సైనికుడు’గానూ సాగారు మహేశ్. అయితే అవి ‘ఒక్కడు’లా మురిపించలేకపోయాయి. ‘వరుడు’ వివాహమహోత్సం చూపించాడే కానీ, విజయోత్సవం కలిగించలేకపోయాడు. తరువాత ‘నిప్పు’ అని తెలిసీ పట్టుకుంటే కాలింది. ‘రుద్రమదేవి’కి అసలు సిసలు బంగారు ఆభరణాలు అలంకరించారు గుణశేఖర్. ఈ చారిత్రకం ఆయనకు ఏ మాత్రం లాభించలేదు. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తరువాత ఇప్పుడు ‘శాకుంతలం’ అనే పౌరాణికంపై దృష్టి సారించారు గుణశేఖర్. సమంత శకుంతలగా నటిస్తోన్న ‘శాకుంతలం’పై గుణశేఖర్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఆ తరువాత రానాతో ‘హిరణ్య కశ్యప’ కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రం ‘రామాయణం’తో నేషనల్ అవార్డు సంపాదించిన గుణశేఖర్ మళ్ళీ ఇన్నాళ్ళకు పౌరాణికాలపైనే దృష్టి సారిస్తున్నారంటే ఆయన ఏదో చెయ్యబోతున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారయినా గుణశేఖర్ కోరుకుంటున్న విజయం ఆయన దరి చేరాలని ఆశిద్దాం.