బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు చేస్తున్నాయి.
ఎందుకు సిబిఐ, ఎన్‌సిబి, ఈడి విచారణ ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం మధ్య రాజకీయ తుఫాను సృష్టించింది. ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంది. దీంతో అతని మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తు చేపట్టాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివంగత నటుడి తండ్రి కెకె సింగ్… సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అందులో సుశాంత్ ను ఆత్మహత్య చేసుకునేలా రియా ప్రేరేపించిందని, సుశాంత్ ఖాతా నుండి రూ.15 కోట్లు మాయమయ్యాయని ఆరోపించారు. రియాపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత, మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రియాపై ఈడి కూడా కేసు నమోదు చేసింది. నటుడికి డ్రగ్స్ ఇచ్చినట్లు వాట్సాప్ చాట్స్ వెల్లడించడంతో ఎన్‌సిబి కూడా ఈ కేసులోకి అడుగు పెట్టింది.
సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకూ వచ్చింది ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తులో అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పేర్కొంది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తన దర్యాప్తులో రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్, తల్లి, సోదరుడు షోయిక్, సుశాంత్ ఇంటి సిబ్బంది, అతని స్నేహితుడు సిద్ధార్థ్ పిథానితో సహా సుశాంత్ మాజీ వర్కర్స్, ముంబై పోలీస్, ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన అధికారులు, గతంలో నటుడికి చికిత్స చేసిన వైద్యులు అందరినీ విచారించారు. ఆ తరువాత ఎయిమ్స్ నుండి ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో సిబిఐ క్రైమ్ ను రికన్స్ట్రక్షన్ చేశారు. ఆ తరువాత లభ్యమైన అన్ని ఆధారాలను పరీక్ష కోసం పంపించింది. సుశాంత్ విసెరా శాంపిల్స్, శవపరీక్ష నివేదికలను పరిశీలించిన ఎయిమ్స్ వైద్యుల బృందం ఇది హత్య కాదని, ఆత్మహత్య అని వెల్లడించింది.
ఈ కేసులో సరికొత్త శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దర్యాప్తును సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ పేర్కొంది. డిజిటల్ పరికరాల్లోని డేటాను వెలికితీసేందుకు, విశ్లేషించడానికి, కేసుకు సంబంధించిన సంబంధిత సెల్ టవర్ స్థానాల డంప్ డేటాను విశ్లేషించడానికి తాజా సాఫ్ట్‌వేర్‌తో సహా అధునాతన మొబైల్ ఫోరెన్సిక్ పరికరాలను కూడా సిబిఐ ఉపయోగించింది. అంతేకాదు సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాన్ని కనుగొనడానికి ఏజెన్సీ ఆయన మానసిక విశ్లేషణను కూడా చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఫెడరల్ ఏజెన్సీ అలీగర్, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, మనేసర్, పాట్నాలకు వెళ్లి సాక్ష్యాలను సేకరించి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. నటుడిపై శవపరీక్ష నిర్వహించిన కూపర్ హాస్పిటల్ వైద్యులను కూడా సిబిఐ ప్రశ్నించింది. వైద్యుల అభిప్రాయాలు, వాంగ్మూలాల ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించారని చెప్పారు.
ఇక రియా చక్రవర్తి తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, చనిపోయే ఆరు రోజుల ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారని చెప్పారు. 2020 జూన్ 9న సుశాంత్ తన అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్లిన ఒక రోజు తర్వాత రియా అతనిని బ్లాక్ చేసింది. మరోవైపు సుశాంత్ కుటుంబం ఆరోపించినట్లుగా సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణం అనే ఆరోపణలకు సిబిఐ ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేకపోయింది.
ఈడీ ఇన్వెస్టిగేషన్… రూ. 5 కోట్లు ఏమయ్యాయి ?
సుశాంత్ అకౌంట్లోని రూ.15 కోట్లు రియా, ఆమె సోదరుడు షోయిక్ తీసుకున్నారని… సుశాంత్ కుటుంబం ఆరోపించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో రియా, ఆమె కుటుంబంలోని ఇతరుల స్టేట్మెంట్ ను ఈడీ నమోదు చేసింది. సుశాంత్‌తో అసోసియేట్ అయిన మూడు సంస్థలు రియా, ఆమె సోదరుడి భాగస్వామ్యంలో ఉన్నాయని, నటుడి ఖాతా నుండి అనేక లావాదేవీలు జరిగాయని ఈడీ కనుగొంది. కానీ సుశాంత్ ఖాతా నుండి రూ.15 కోట్లు రియా కొల్లగొట్టింది అనడానికి ఆధారాలను మాత్రం కనుక్కోలేకపోయింది.
ఎన్సిబి దర్యాప్తులో ఏం తేలింది ?
రియా వాట్సాప్ చాట్స్ లో డ్రగ్స్ గురించి బయటపడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియా, ఆమె సోదరుడు, ఇంకా అనేక మంది డ్రగ్ పెడ్లర్లను ఎన్‌సిబి అరెస్టు చేసింది. సుశాంత్ ఇంటిలోనే రియా, ఇంకా ఇతరులు అతనికి డ్రగ్స్ ఇచ్చారని ఆరోపించారు. కానీ రియా మాత్రం సుశాంత్ కు ముందే డ్రగ్స్ అలవాటు ఉందని, తనకు అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లానని, డాక్టర్ ఇచ్చిన మందులు మాత్రమే ఇచ్చానని తెలిపింది. అయితే సుశాంత్ మృతికి రియా ఇచ్చిన మందులు కారణమా ? లేదా ? అనే విషయాన్నీ తేల్చడంలో ఎన్‌సిబి విఫలమైంది. ఈరోజు సుశాంత్ వర్ధంతి కావడంతో ఆయన మృతికి న్యాయం జరగాలంటూ అభిమానులు కోరుతున్నారు. మరి ఎప్పటికి ఈ మిస్టరీ వీడుతుందో చూడాలి.