(జూన్ 25తో ‘కళ్యాణమంటపం’కు 50 ఏళ్ళు)
రీమేక్స్ రూపొందించడంలో కింగ్ అనిపించుకున్నారు దర్శకుడు వి.మధుసూదనరావు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ మంటపం’ చిత్రానికి కన్నడలో పుట్టన్న కణగల్ రూపొందించిన ‘గజ్జె పూజె’ ఆధారం. కన్నడలో కల్పన ధరించిన పాత్రను తెలుగులో కాంచన పోషించారు. ఇందులో శోభన్ బాబు కాంచన ప్రియుని పాత్రలో నటించారు. 1971 జూన్ 25న విడుదలైన ‘కళ్యాణ మంటపం’ ఆ రోజుల్లో మంచి ఆదరణ పొందింది.
దేవదాసీ వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథ ఈ చిత్రం.
ప్రస్తుతం అంతగా కనిపించక పోయినా, ఇప్పటికీ మారుమూల పల్లెల్లో ‘దేవదాసీ’ వ్యవస్థ కొనసాగుతోంది. దానిని రూపుమాపడానికి ఎందరో సంఘసంస్కర్తలు పాటుపడుతూనే ఉన్నారు. దేవదాసీలుగా గుర్తింపు పొందినవారు కేవలం దేవాలయాల్లో నాట్యం చేయడమే కాదు, కొందరికి భోగవస్తువుగానూ ఉండేవారు. అలాంటి ఓ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చంద్ర, తాను కూడా అందరు అమ్మాయిల్లాగే పెళ్లిచేసుకొని తాళిని చూడాలనుకుంటుంది. ఆమెను ఓ సంప్రదాయ బ్రాహ్మణ అబ్బాయి ప్రేమిస్తాడు. అయితే తండ్రి ఎవరో తెలియని దానిగా గుర్తింపు ఉన్న ఆ అమ్మాయిని కొందరు చులకన చేస్తారు. ఓ రోజున చంద్ర తన తండ్రి అనే వ్యక్తిని కలుసుకోవడం చూసిన ప్రియుడు అనుమానిస్తాడు. ఆమెను అవమానిస్తాడు. దాంతో దేవదాసీగా నాట్యం చేస్తానని చెప్పి, తండ్రి తనకు ఇచ్చిన ఉంగరాన్ని మింగి తనువు చాలిస్తుంది ఆ అమాయకురాలు. సంఘంలో మనుషులను కులం పేరుతో అణగదొక్కే వ్యవస్థను ప్రశ్నిస్తూ ఈ కథ రూపొందింది.
ఎమ్.కె. ఇందిర రాసిన కథకు బొల్లిముంత శివరామకృష్ణ మాటలు రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ పాటలు పలికించారు. ఆదినారాయణ రావు స్వరకల్పన చేశారు. ఇందులోని “చుక్కలు పాడే శుభమంత్రం…”, “సరిగమపదనిస… అని పలికేవారుంటే…”, “పిలిచే వారుంటే… పలికేను నేను…” వంటి పాటలు విశేషంగా అలరించాయి.
జెమిని సంస్థ సమర్పణలో మధు మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో వి.మధుసూదనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రంగుల చిత్రంగా రూపొందిన ‘కళ్యానమంటపం’లో జగ్గయ్య, నాగభూషణం, గుమ్మడి, పి.జె.శర్మ, రాజబాబు, అంజలీదేవి, రమాప్రభ, సంధ్యారాణి, పండరీబాయి, అన్నపూర్ణమ్మ, మంజుల, బేబీ శ్రీదేవి, బేబీ బ్రహ్మాజీ నటించారు.
ఇందులో చిన్నప్పటి కాంచనగా శ్రీదేవి నటించారు. తరువాతి రోజుల్లో మేటి దర్శకునిగా పేరొందిన ఎ.కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. యువచిత్ర నిర్మాత కె.మురారి కూడా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. తెలుగునాట రంగుల సినిమాలకు అప్పుడప్పుడే ఊపు వస్తోంది. ఆ రోజుల్లో ‘కళ్యాణమంటపం’ వంటి కథాచిత్రం కలర్ లో రూపొందడం వల్ల జనం విశేషంగా ఈ చిత్రాన్ని ఆదరించారు. కొన్ని కేంద్రాలలో ఈ సినిమా శతదినోత్సవం చూసింది.