YS Sharmila Sensational Comments On Jagga Reddy: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగ్గారెడ్డిపై విరుచుకుపడ్డారు. అసలు తనని ఛాలెంజ్ చేయడానికి ఈ జగ్గారెడ్డి ఎవడు? అని ఆమె తిరుగు ప్రశ్నించారు. ఇంకోసారి మాట్లాడితే బాగోదంటూ ఆయన తనని బెదిరించిన విషయం తెలిసిందని.. జగ్గారెడ్డి ఛాలెంజ్‌కి ఈ వైఎస్ఆర్ బిడ్డ ఏమాత్రం భయపడదని ఆమె తెగేసి చెప్పారు. వైఎస్సార్ చనిపోయిన రోజు పరామర్శకి వస్తే.. మేము బాధపడటం మానేసి, రాజకీయాలు మాట్లాడమని జగ్గారెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడన్నారు. ఆరోజు తమ కుటుంబంలో తాము పడిన బాధ తమకే తెలుసన్నారు. చెట్టంత మనిషి కోల్పోతే, మా మీద తలకాయ కోల్పోతే.. ఎలా ఉంటుందో అలా బాధపడ్డామని అన్నారు. అసలు తాము బత్రుకుతామా? చస్తామా? అన్నట్లుగా బాధపడ్డామని తెలిపారు. అసలు జగ్గారెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? అంటూ నిలదీశారు. పాలమూరు ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్‌కి ఫిర్యాదు చేసినా, ఒక మంత్రి తనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా తాను భయపడలేదని.. అలాంటిది జగ్గారెడ్డి ఛాలెంజ్‌కి భయపడతానా? అంటూ షర్మిల తెలిపారు.
ఇదే సమయంలో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిపై కూడా షర్మిల ధ్వజమెత్తారు. సిగ్గు లేకుండా ఆయన దళిత బందుపై మాట్లాడుతున్నాడని విరుచుకుపడింది. దళిత బందు ఏది అని అడిగితే.. నా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇస్తా అంటున్నాడని, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండని అంటున్నారని తెలిపింది. అధికార మదం ఇంద్రకిరణ్ రెడ్డి తలకి ఎక్కిందని ఆగ్రహించారు. ఎవడి సొమ్ము అనుకొని ఇలా మాట్లాడుతున్నారని, మీ అనుచరులకు ఇవ్వడానికి మీ తాత సంపాదనా? అని ప్రశ్నించారు. దళిత బందు అనేది ప్రజల సొమ్ము అని.. మధ్యలో నీ బోడి పెత్తనమేంటని షర్మిల అన్నారు. దళిత బందు పంపిణీ ఎమ్మెల్యేలకు ఇవ్వొద్దని.. కలెక్టర్లకు, ఆర్డీవోలకు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.