Site icon NTV Telugu

YS Sharmila: కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు.. మోసగాడు

Sharmila On Cm Kcr

Sharmila On Cm Kcr

YS Sharmila Sensational Comments On CM KCR in Sadashivpet: సదాశివపేట ప్రసంగంలో భాగంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసలు ముఖ్యమంత్రేనా? అని ప్రశ్నించిన షర్మిల.. ఎనిమిదేళ్ల నుంచి సీఎం పదవిలో ఉన్న ఆయన, ఈ సదాశివపేటకు ఏమైనా చేశారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అని, ఆయన ఏ పథకం రూపొందించినా అది ప్రజల కోసమేనని అన్నారు. కానీ, కేసీఆర్ ఎనిమిదేళ్లుగా మోసం చేస్తూనే వస్తున్నాడని ఆరోపించారు. పోడు పట్టాలు, 57 ఏళ్లకే పెన్షన్, డబుల్ బెడ్‌రూం ఇల్లు అంటూ.. కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి కాదు, మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు.

ఉద్యోగాలు కావాలని నిరుద్యోగ యువత అడిగితే.. హమాలి పనులు చేసుకోండని సీఎం చెప్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఇది బంగారు తెలంగాణ కాదని, బ్రతుకే లేని తెలంగాణ అని చెప్పారు. ఇది బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ అంటూ పేర్కొన్నారు. ఇది పేదవాడిని పట్టించుకొనే ప్రభుత్వం కాదని.. పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడో చూసే ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట, పాడిందే పాట అని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డి ఒక దొంగ అని ఆరోపించారు. బీజేపీ ఒక మత పిచ్చి పార్టీ అని, మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ అని షర్మిల తెలిపారు.

అంతకుముందు మోమిన్‌పేట మండల కేంద్రంలో కూడా షర్మిల ఇలాగే కేసీఆర్ సహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పి.. నిండా ముంచేశారని భగ్గుమన్నారు. తెలంగాణలో వైఎస్సార్ పాలన తీసుకురావడం కోసమే తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానని.. తనకు అధికారం ఇస్తే, వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్ తెచ్చిన ప్రతీ పథకాన్ని.. రాజన్న బిడ్డ అయిన తాను తిరిగి అమలు చేస్తానని షర్మిల మాటిచ్చారు.

Exit mobile version