YS Sharmila Fires on KCR Balka Suman: ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. చెన్నూరు నియోజక వర్గం భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ తన జన్మలో ఇచ్చిన ఒక్క మాటని కూడా నిలబెట్టుకోలేదన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి తుమ్మడిహట్టి ద్వారా సాగు నీరు అందేదని.. అయితే ప్రాజెక్ట్ డిజైన్ మార్చి, ఈ నియోజక వర్గానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. గొల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని తన తండ్రి వైఎస్సార్ అనుకున్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టిస్తే వైఎస్సార్‌కి పేరు వస్తుందన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కాలువలు తవ్వించడం లేదని ఆరోపించారు.
సింగరేణి నియోజక వర్గంలోని కోల్ బెల్ట్ ఏరియాలో 30 వేలమందికి పట్టాలివ్వాలని వైఎస్సార్ ఇవ్వాలనుకున్నారని, ఇప్పుడు కేసీఅర్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారని షర్మిల ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే ఉంటాయని చెప్పి.. కేసీఆర్ మోసం చేశారన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పి.. ఇంతవరకూ ఒక్కరినీ కూడా రెగ్యులర్ చేయలేదన్నారు. బస్ డిపో, రెవెన్యూ డివిజన్, మందమర్రి ఎన్నికలు అని చెప్పి.. కేసీఆర్ మోసం చేశారన్నారు. ఇక బాల్క సుమన్ రౌడీయిజం చేస్తున్నారని.. జర్నలిస్టుల మీద కూడా ఆయన కేసులు పెడతాడని షర్మిల ఆరోపణలు చేశారు. ఎక్కడా లేని భూకబ్జాలు ఇక్కడే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ జోలికొస్తే.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టనంటూ బాల్క సుమన్ వార్నింగ్‌లు ఇస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన బాల్క సుమన్ కాదు.. బానిస సుమన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఉద్యమ సమయంలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి.. ఎంతోమంది ఆత్మహత్యలకు బాల్క సుమన్ కారకుడయ్యాడని షర్మిల ఆరోపించారు. విద్యార్థి నాయకుడు అయి ఉండి.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. మహేష్ అనే నిరుద్యోగి లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడని, అతని ఇంటికి కూడా ఈ ఎమ్మెల్యే వెళ్లలేదని, ఒక్క రూపాయి సహాయం కూడా చేయలేదని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యే అయ్యుండి.. దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే నోరు విప్పావా? అంటూ ప్రశ్నించారు. దొరతో డైనింగ్ టేబుల్ మీద కూర్చునేసరికి.. బాల్క సుమన్ కూడా దొరలా ప్రవర్తించడం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేకి కర్రు కాల్చి వాత పెట్టమని షర్మిల పిలుపునిచ్చారు.