వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పసుపు రంగు మిర్చి (Yellow Chilli) సరికొత్త రికార్డును సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా, పసుపు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా ₹44,000 పలికిందని అధికారులు వెల్లడించారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరగడం గమనార్హం. నిన్నటి వరకు క్వింటాల్ ధర ₹42,500 ఉండగా, నేడు అది మరో ₹1,500 పెరిగి ₹44,000 కు చేరుకుంది. ఈ అసాధారణ ధర పెరుగుదల వెనుక ప్రధానంగా వాతావరణ మార్పులు , దిగుబడి తగ్గుదల వంటి కారణాలు ఉన్నాయి.
ఈ ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, దీనివల్ల పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతేడాది పసుపు మిర్చి ధర క్వింటాల్‌కు కేవలం ₹16,000 నుండి ₹17,000 మధ్య మాత్రమే పలకగా, ఈసారి అది రెండు రెట్లకు పైగా పెరగడం విశేషం. వరంగల్ జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం, కృష్ణా , నల్గొండ వంటి ఇతర జిల్లాల నుండి కూడా రైతులు తమ పంటను ఈ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.
పంట సాగు కోసం ఎకరాకు ₹1,00,000 నుండి ₹1,50,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు, దిగుబడి తగ్గినా ఈ స్థాయి ధర లభించడం కొంత ఊరటనిస్తోంది. గత మూడేళ్లుగా పసుపు మిర్చిని పండిస్తున్న రైతులు, ఈసారి లభించిన రికార్డు స్థాయి ధర పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి నాణ్యమైన పంటకు భవిష్యత్తులో కూడా మంచి ధరలు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సేఫ్టీ, టెక్నాలజీ, పవర్.. క్రాష్ టెస్ట్‌ల్లో అదరగొట్టిన VinFast VF 6 & VF 7..
