Traffic diversion: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న సందర్భంగా అంబేద్కర్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్నారు. ఈనేపథ్యంలో.. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను శుక్రవారం మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్క్, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను శుక్రవారం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కావున ప్రజలు సహకరించాలని కోరింది.
భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. గులాబీలు, తెల్లటి పువ్వులు మరియు తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందిస్తున్నారు. 125 అడుగుల విగ్రహానికి ఉన్న భారీ కర్టెన్‌ను తొలగించి నిలువుగా అలంకరించేందుకు భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ సన్యాసులను మాత్రమే ఆహ్వానించారు. ఈ కార్యక్రమం వారి సాంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది విగ్రహావిష్కరణ సభకు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక్కడకు తరలివచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్లు ,లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎండ వేడిమి నుంచి ప్రజలను రక్షించేందుకు షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. సభ జరిగే రోజు సామాన్య ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసు యంత్రాంగం సూచించనుంది. ఆటపాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
Ambedkar statue: రేపు సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. సాంప్రదాయ పద్దతిలో కార్యక్రమం
