నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రైవన్ బాయిలర్ ఫీడ్ పంప్ (BFB) ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో పాటు అక్కడే ఆయిల్ లీకేజీ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్లాంట్ అధికారులు, సాంకేతిక సిబ్బంది , అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రతిపాదికన స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అగ్నిప్రమాదం కారణంగా ప్లాంట్‌లోని కంట్రోల్ కేబుల్స్‌తో పాటు వాల్వ్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది మే నెలలో కూడా ఇక్కడి యూనిట్-1లో ఇలాగే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరీ ముఖ్యంగా, ఈ యూనిట్-3లో కొద్ది రోజుల క్రితమే అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారులు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగలు క్లియర్ అయిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించి ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించనున్నారు.
