NTV Telugu Site icon

Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?

Women

Women

Women: ‘ఆమె’కు మరోసారి వందనం. ఎందుకంటే ‘ఆమె’ ఆకాశంలో సగమేనేమో గానీ అవయవదానంలో మాత్రం అంతకుమించి. తల్లిగా, సోదరిగా, ఇల్లాలిగా ప్రేమను పంచటంలో మాత్రమే కాదు. చివరికి తన శరీర భాగాలను పంచటంలో సైతం ‘ఆమె’ తనకుతానే సాటి అని నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అవయవదాతల్లో 80 శాతం మంది ఆడవాళ్లే ఉండటం విశేషం. లివర్‌, కిడ్నీ డొనేట్‌ చేసినవాళ్లలో అయితే ఏకంగా 87 శాతం మంది మహిళలే ఉన్నారు. అదే సమయంలో.. అవయవాలను గ్రహించేవాళ్లలో ఆడవాళ్లు కేవలం 20 శాతమే ఉంటున్నారు.

దీన్నిబట్టి దాతల సంఖ్యకి, గ్రహీతల సంఖ్యకి మధ్య తేడా భారీగా ఉన్నట్లు అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారం చెలాయించేందుకు అత్యుత్సాహంతో ముందుకు వచ్చే మగవాళ్లు అవయవదానం విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది చర్చనీయాంశంగా, ఆసక్తికరంగా మారింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్‌, బయలాజికల్‌ ఫ్యాక్టర్స్‌ కారణమని అంటున్నారు. సామాజిక కోణంలో చూస్తే కొన్ని సందర్భాల్లో అంటే దాదాపు 20 శాతం మంది ఆడవాళ్లు బలవంతంగా అవయవదానం చేయాల్సి వస్తోంది.

Basara: “బాసర” అంటే బాధ మాత్రమే కాదు. ఈ విజయగాథ కూడా..

భార్యాభర్తలనే పరిగణనలోకి తీసుకుంటే భర్తకు అవయవం అవసరమైతే భార్య ముందూ వెనకా ఆలోచించకుండా ఇస్తోంది గానీ భార్యకు అవసరమైప్పుడు భర్త ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆర్థికంగా కుటుంబ భారాన్ని మోయాల్సింది తానే అంటున్నాడు. వైద్యపరంగా ఫిట్‌గా లేకపోయినా కొంత మంది మహిళలు అవయవదానం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటప్పుడు తాము వాళ్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆర్గాన్‌ డొనేషన్‌కి స్వతంత్రంగానే ముందుకు రావాలని, ఒత్తిళ్లు ఏమైనా ఉంటే వద్దని సూచిస్తున్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు.

ఇక బయలాజికల్‌ ఫ్యాక్టర్స్‌ గురించి చెప్పుకుందాం. శారీరకంగా చూస్తే మహిళలు కాస్త సున్నితమని చెప్పొచ్చు. నెలసరి, ప్రెగ్నెన్సీ, డెలివరీ వంటి కారణాల వల్ల వాళ్లకు అవయవ మార్పిళ్లు అంతగా నప్పవు. అలాగే ఎమోషనల్‌ ఫ్యాక్టర్స్‌నీ పరిశీలించాలి. మగవాళ్ల కన్నా ఆడవాళ్లలో భావోద్వేగాలు ఎక్కువ. పురుషులతో పోటీ పెట్టుకోకుండా ఇంటి పనులన్నీ ఒంటి చేత్తో చక్కదిద్దే స్త్రీలు సహజంగానే త్యాగాలకు ముందుంటారు. అవయవదానానికీ ధైర్యంగా, సెంటిమెంట్‌పరంగా ఒప్పుకుంటారు. ఓ మహిళ తన మనవరాలికి ఆర్గాన్‌ డొనేట్‌ చేసేందుకు కూడా సంకోచించకపోవటం ఎమోషనల్‌ ఫ్యాక్టర్‌కి తిరుగులేని సాక్ష్యమని చెప్పొచ్చు.