NTV Telugu Site icon

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ఇస్తాం..

Anit Shah

Anit Shah

Amit Shah: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి గురువారం ప్రకటించారు. భువనగురిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తరపున ప్రచారం చేశారు. కాంగ్రెస్ అబద్ధాలాడి మాట్లాడి ఎన్నికల్లో పోరాడాలనుకుంటోందని, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తారని కాంగ్రెస్ అసత్యాలను చెబుతోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ గత 10 ఏళ్లు ఈ దేశాన్ని ఏకగ్రీవంగా నడిపిస్తున్నారని, కానీ రిజర్వేషన్లను ముట్టుకోలేదని చెప్పారు.

Read Also: Jalebi Baba: 100 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన జిలేబీ బాబా జైలులో మృతి..

కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకుంటోందని ఆరోపించారు. 2019లో తెలంగాణ ప్రజలు మాకు నాలుగు సీట్లు ఇచ్చారని, ఈసారి తెలంగాణలో 10కి పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ రెండంకెల స్కోరు ప్రధాని మోదీని 400 సీట్లు దాటేలా చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ, రాహుల్ బాబా హామీలు సూర్యాస్తమయం వరకు కూడా ఉండవన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తానమని, రైతులకు రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. బాలికలకు స్కూటీల ఇస్తామని మరిచారని అన్నారు.

70 ఏళ్లుగా రామమందిరాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని, బీజేపీ మోడీ నేతృత్వంలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించారు. బీఆర్ఎస్, ఎంఐఎం బుజ్జగింపు రాజకీయాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ఈ వ్యక్తులు సీఏఏని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలకు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.