ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. వరంగల్ జిల్లాల వర్ధన్నపేటలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ ప్రాణాల మీదికి తెచ్చింది. డెలివరీ చేసిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ కోసం పెట్టిన కాటన్ మరిచిపోవడంతో ఇన్ఫెక్షన్ కి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అయితే తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిందను పేషెంట్ మీదికే నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలింత ప్రాణాలతో ప్రభుత్వ వైద్యులు చెలగాటమాడిన సంఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు భవానికుంట తండాకు చెందిన నునావత్ సౌజన్య దేవేందర్ దంపతులు. సౌజన్య గర్భవతి కావడంతో జూన్ 16తేదీన పురిటి నొప్పుల రావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో నార్మల్ డెలివరీ అయింది. కొడుకు పుట్టాడు. అనంతరం వైద్య చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం రావడంతో సౌజన్యను అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స అందించారు. అప్పుడే ప్రసవం కావడంతో సౌజన్యకు రక్తస్రావం ఎక్కువ పోవడం గమనించిన వైద్యులు చిన్న ఆపరేషన్ చేయాలని చెప్పారు. చిన్న ఆపరేషన్ చేసేటప్పుడు యోనిలో దూది అమర్చి అలాగే కుట్లు వేశారని, డిశ్చార్జ్ చేసే సమయంలో కూడా దూదిని తీయడం మరిచిపోయారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత బాలింత తీవ్ర కడుపునొప్పి, రక్త స్రావంతో బాధపడుతుండడంతో వరంగల్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా వైద్యులు యోనిలో దూది మరిచిపోయిన్నట్లు తెలిపారు. ఓవైపు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రభుత్వాసుపత్రికి రావాలంటే భయం అవుతుందని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ప్రాణాలతో చెలగాట మాడిన వైద్యులు తీరు పట్ల భర్త తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. విధుల్లో అలసత్వం నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్య తీసుకోవాలని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నరసింహస్వామి ని బాధితుడు కోరారు .
సంఘటనకు సంబంధించి డాక్టర్ సూపరింటెండెంట్ నరసింహస్వామిని వివరణ కోరగా రాత్రి సమయంలో 108లో ప్రసవం అయిన వచ్చిన సౌజన్య అధిక రక్తస్రావం జరగడంతో చిన్న ఆపరేషన్ చేసి, కాటన్ పెట్టి 2రోజులు ఆస్పత్రిలో చికిత్స చేసి మరో రెండు రోజుల్లో ఆస్పత్రికి రావాలని బంధువులకు తెలిపామని, కానీ వారు ఆలస్యంగా రావడంతో ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. బాధితురాలికి ప్రత్యేక చికిత్స చేసినట్లు, ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నట్టు, తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు.
World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?