NTV Telugu Site icon

Medico Preethi: డాక్టర్ ప్రీతి కేసు.. అవును అలా చేసింది నేనే సైఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Saif Preethi

Saif Preethi

Medico Preethi: సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందిన డాక్టర్ ధరావత్ ప్రీతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్‌, ప్రీతిని ర్యాగింగ్ చేసిన మాట వాస్తవమేనని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 26న ప్రీతి మరణం తర్వాత సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీతి ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణమని పోలీసులు చెప్పగా, అతను దానిని ఖండించాడు. తాను ర్యాగింగ్ చేయలేదని, అయితే అది ర్యాగింగ్ కాదని వాదించాడు. అయితే, పోలీసులు అతని వాట్సాప్ చాట్‌లను తీసి, సైఫ్ ఉద్దేశపూర్వకంగా ర్యాగింగ్‌కు పాల్పడ్డాడని నిర్ధారించారు. ఆ తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు జరిగిన విచారణలో సైఫ్ ను ఆధారాలు చూపి ప్రశ్నించగా ర్యాగింగ్ నిజమేనని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో సైఫ్‌ను ఈ నెల 6న కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నేరాంగీకార నివేదికలో సైఫ్ ర్యాగింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు.

వరంగల్ పోలీసు కమీషనర్ సీపీ ఏవీ రంగనాథ్‌ ఎంట్రీ..

ప్రీతి మరణంపై నిజనిజాలు తేల్చేందుకు వరంగల్ పోలీసు కమీషనర్ సీపీ ఏవీ రంగనాథ్‌ స్వయంగా కేసు విచారణ చేపడుతున్నారు… సైఫ్‌ను అరెస్టు చేసిన రోజు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి పరిపాలనాధికారులతో ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న వరంగల్ సీపీ బుధవారం సాయంత్రం మరోమారు ఎంజీఎంని సందర్శించారు. అక్కడ క్షత్ర స్థాయిలో వివరాలు సేకరించారు.. ప్రీతి అపస్మారక స్థితికి వెళ్లకముందు విధులు నిర్వర్తించిన ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌, అపస్మారక స్థితిలోకి వెళ్లిన గదిని పరిశీలించారు. అంతేకాకుండా ప్రీతితో వైద్యవిద్యనభ్యసిస్తున్న సహచరులను, సీనియర్‌ పీజీ విద్యార్థులను విచారించారు. సుమారు రెండు గంటల పాటు ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.

మరో వైపు ప్రీతి ఘటన వరంగల్‌ పోలీస్‌లకు సవాల్‌గా మారింది. ఈ ఘటనపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా సద్దుమణగలేదు. ప్రీతి అనస్తీషియా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్న క్రమంలో టాక్సికాలజీ నివేదికలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదనే విషయం వెల్లడి కావడంతో ఈ ఘటనపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రీతిని హత్య చేశారని కుటుంబ సభ్యులు బలంగా ఆరోపిస్తున్న క్రమంలో ఈ కేసును చేధించేందుకు స్వయంగా కమిషనరే రంగంలో దిగి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతి కేసులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఒకటి, రెండు మార్లు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో ఆ రోజు ఏం జరిగిందోననే విషయాన్ని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీ రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఆస్పత్రిలో ఆ సమయంలో విధుల నిర్వర్తించిన వైద్యులను, వైద్యసిబ్బందిని సైతం పోలీసులు ఇప్పటికే విచారించారు. ప్రీతి, సైఫ్‌ మొబైల్‌ ఫోన్‌ల నుంచి లభిస్తున్న సాంకేతిక ఆధారాలను సరిపోలుస్తూ ప్రీతి మరణం వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీస్‌ కమిషనర్‌ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు