వనపర్తిలోని అమరచింత రెవెన్యూ అధికారుల మాయాజాలం బట్టబయలైంది. చనిపోయిన రైతు పొలంను అధికారులు ఇతరులకు పట్టా చేశారు. 43 ఏళ్ల క్రితం చనిపోయిన దేవుల బుచ్చన్న పేరుతో స్లాట్ బుక్ చేసి, ఆరు ఎకరాల భూమిని పట్టా చేసినట్టు తేలింది. ఇలా పట్టా మార్పిడి చేసినందుకు గాను అమరచింత తహశీల్దార్ భారీ మొత్తమో అందినట్టు బాధితుడు దేవుల వెంకటన్న ఆరోపణలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తహశీల్దార్ పట్టా మార్పిడి చేశారని.. అదేంటని ప్రశ్నిస్తే 43 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి స్లాట్ బుక్ చేసినట్టుగా చెబుతున్నారని వాపోయాడు. విరాసత్ చేయకుండా నకిలీ పత్రాలతో ఎమ్మార్వో సింధూజ మరొకరికి పట్టా మార్పిడి చేశారని వెంకటన్న పేర్కొన్నాడు.
అయితే.. ఎమ్మార్వో సింధూజ వాదన మాత్రం మరోలా ఉంది. వెంకటన్న చేస్తోన్న ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఇందులో తమ పొరపాటేమీ లేదని చేతులెత్తేసింది. 2017కు ముందే బుచ్చన్న పేరు నుంచి పట్టా మార్పిడి జరిగిందని.. స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ వెంకట్ పేరుతోనే జరిగిందని ఆమె వెల్లడించారు. పామిరెడ్డి పల్లిలో వారి దాయాదుల మధ్య పంచాయతీ నడుస్తోందన్న ఎమ్మార్వో సింధూజ.. ఈ విషయంపై పై అధికారులకు నివేదిక ఇస్తానని తెలిపారు.