VRA Meeting With CS Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు వీఆర్ఏ జేఏసీ ప్రకటించింది. అంతేకాదు.. రేపట్నుంచి వీఆర్ఏలు విధుల్లోకి హాజరు కాబోతున్నట్టు కూడా తెలిపారు. ఈ సందర్భంగా ట్రెసా ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం వీఆర్ఏలు గత 80 రోజులుగా ఉదమ్యం చేశారన్నారు. తమ పే స్కేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్, కారుణ్య నియామకాల్ని తేల్చాలని కోరారని.. వాటిని సీఎం కేసీఆర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రేపటి నుండి వీఆర్ఏలు విధుల్లోకి చేరుతారని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల కోడ్ ఉన్నందున.. వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. సమ్మె కాలం జీతంతో పాటు సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు ఎన్నికల తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ చర్చలు సఫలం కావడానికి ముందే.. హైదరాబాద్ ట్రెసా కార్యాలయంలో అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డితో వీఆర్ఏలు సమావేశమయ్యారు. అయితే.. ఆ సమావేశాలు సఫలం కాలేదు. అందులో వీఆర్ఏలు వాగ్వాదానికి దిగారు. సమ్మె ఆపాలని రవీందర్ రెడ్డి సూచిస్తే.. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తేనే సమ్మె నిలిపివేస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. దీంతో వాళ్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్‌తో చర్చలకు సిద్ధమయ్యారు. డిమాండ్లను ముఖ్యమంత్రి తప్పకుండా తీరుస్తారని హామీ ఇవ్వడంతో.. ఈ చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ తమకు హామీ ఇచ్చారని, సమ్మె విరమించి రేపటి నుండి విధుల్లోకి చేరుతామని వీఆర్ఏ జేఏసీ ఛైర్మన్ రమేష్ బహదూర్ చెప్పారు.