NTV Telugu Site icon

Telangana Election 2023: నవంబర్‌ 30 హాలీడే కాదు.. ఓటింగ్‌ డే..

Ceo Vikasraj

Ceo Vikasraj

Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగానే ఉందని, ఈసారి దానిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ నెల 30న జరిగే ఓటింగ్‌లో ఓటర్లు తమ ఓటుహక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఓటర్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, పోలీసులు సహా దాదాపు మూడు లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4,70,270 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ముద్రించామని తెలిపారు. టెండర్‌ ఓటు, ఛాలెంజ్‌ ఓటు కోసం అదనపు బ్యాలెట్‌ పత్రాలను ముద్రించినట్లు తెలిపారు. తపాలా శాఖ ద్వారా 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించిందని వికాసరాజ్ తెలిపారు. పరిశీలకుని అనుమతితో రిటర్నింగ్ అధికారి ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారని సమాచారం.

Read also: Tummala vs Puvvada: ఖమ్మం గుమ్మంలో పువ్వాడ, తుమ్మల.. సై అంటే సై అంటున్న కీలక నేతలు

ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఇంటింటి ఓటింగ్ విధానాన్ని అమలు చేశామని, ఇప్పటి వరకు 14 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇందులో 80 ఏళ్లు పైబడిన వారు 9,386 మంది, వికలాంగులు 5,022 మంది, అత్యవసర సేవల సిబ్బంది 253 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 2.81 కోట్ల (86%) ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు పంపిణీ చేయబడ్డాయి. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనంలో జీపీఎస్‌ను అమర్చనున్నట్లు సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. ప్రైవేట్ వాహనాల్లో ఈవీఎంలను తరలించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 10,106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అనుచరులపై 777 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.669 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. రూ.260 కోట్ల నగదు, రూ.108 కోట్ల మద్యం ఉన్నట్లు తెలిపారు. 183 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు, రూ. 81 కోట్ల పారితోషికం ఉందన్నారు. రైతుబంధుపై ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరిందని, ప్రభుత్వం నుంచి వివరణ కోరామని చెప్పారు. ఈ సమావేశానికి అదనపు సీఈవో లోకేష్‌కుమార్‌, జాయింట్‌ సీఈవో సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ సీఈవో సత్యవాణి హాజరయ్యారు.
Priyanka Gandhi: తెలంగాణలో నేడు, రేపు ప్రియాంక ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే