NTV Telugu Site icon

Secendeabad Crime: సామాన్యుడిపై ఖాకీల కర్కశత్వం.. కర్రలతో కాళ్లు విరగగొట్టి..

Surya

Surya

అత‌డు పాత నేర‌స్థుడు కాదు, అత‌నిపై కేసులు అస్స‌లు లేవు.. అక్క‌డేమి పెద్ద గొడ‌వ కూడా కాలేదు. అస్సలు అతని త‌ప్పేమీ లేదు. కేవ‌లం తోపులాట‌. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి న‌ట్లుగా పోలీసులు వ్య‌వ‌హ‌రించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయ‌ని వాడిపై క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్‌రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది.

సికింద్రాబాద్‌ లాలాగూడకు చెందిన సూర్య ఆరోక్యరాజ్‌ ఓ జిమ్‌లో సహాయకుడు. నెలకు రూ.8 వేల సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మెట్టుగూడలోని తల్లి శీల ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి అతడు ఉంటున్న బస్తీలో ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వెళ్తుండగా వారించాడు. దీంతో వారి మధ్య వాదన మొదలై.. తోపులాటకు దారితీసింది. బైక్‌పైనున్న వ్యక్తి చిలకలగూడ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు సూర్య ఇంటికి వచ్చారు.

సూర్య ఆరోక్య రాజ్‌ను స్టేషన్‌కు రమ్మని కోరారు. రాత్రి 11 గంటలవుతోంది. ఇప్పుడు రాలేను. ఉదయాన్నే వస్తా అని సమాధానమిచ్చాడు. దాంతో పోలీసులు సూర్య పై దాడి ప్రారంభించారు. దుడుక్డర్రను సూర్య రెండు కాళ్ల మధ్య ఉంచి బూటు కాళ్లతో తన్నారు. తల్లి శీల ప్రాధేయపడినా వినలేదు. ఆమె పైనా దాడికి యత్నించారు. బస్తీవాసులు సూర్య ఇంటికి చేరుకోవడంతో వెళ్లిపోయారు.

సూర్యను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దెబ్బలకు సూర్య ఎడమ కాలు విరిగినట్లు, కుడికాలుకూ తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. పిడిగుద్దులతో అతడి ముఖం వాచిపోయింది. మంగళవారం సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తన కొడుకును దారుణంగా హింసించిన వారిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని, కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయాలని సూర్యతల్లి శీల డిమాండ్ చేసింది.