NTV Telugu Site icon

Konda Visveshwar Reddy: చేవెళ్ల మేనిఫెస్టోను విడుదల చేసిన కొండా.. ‘సంకల్ప పత్రం’ పేరిట రిలీజ్

Konda

Konda

చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో అత్యుత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అత్యంత వైవిధ్యత కలిగిన చేవెళ్ల నియోజకవర్గంలో 29 లక్షల మంది విభిన్న కులాలు, మతాలు, భాషా బేధాలు కలిగిన వారు ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా తన సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

Vijay Deverakonda: ఏంటి కొండన్న రూటు మార్చేశావు.. వర్కౌట్ అవుతుందా?

ఎంపీగా ఈ ప్రాంతానికి విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. కేంద్ర నిధులతో విద్య, వైద్యం కల్పించడంతోపాటు ప్రైవేట్ స్కూలు, ఆసుపత్రిలో విషయంలో నియంత్రణ చర్యలు చేపడతానన్నారు. గోవా తరహాలో కమ్యూనిటీ స్కూల్స్ తీసుకొచ్చి అధిక ఫీజుల భారం లేకుండా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. చేవెళ్ల ప్రాంత యువతను వేధిస్తున్న అతి ప్రధాన సమస్య నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తానన్నారు. భారీ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణను ఇప్పించి ఆర్థికంగా బలోపేతం చేస్తానన్నారు. తమ గ్రామంలోనే ఉంటూ ఉపాధి పొందే అవకాశాన్ని ఇక్కడ యువకులకు అందిస్తానన్నారు. తాండూరు కందిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ తీసుకురావడంలో తానే ముఖ్య పాత్ర పోషించానని ఆయన చెప్పారు. స్థానికంగా పండే పంటలకు అధిక ధరలు దక్కేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన సంకల్ప పత్రంలో పేర్కొన్నారు. చేవెళ్లను నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిల్లెట్స్ హబ్ గా తీర్చి దిద్దుతానని ఆయన చెప్పారు.

POCSO Case: ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు.. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో..

కేంద్ర నిధులతో పాలమూరు – రంగారెడ్డి..
చేవెళ్ల ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ నిధులతో కృష్ణా జలాలను జూరాల నుండి నేరుగా తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు మళ్లించేందుకు కృషి చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల పథకం రద్దు చేయడం ద్వారా వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మన ప్రాంతానికి ఎలాంటి లాభం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

అంత్యోదయ స్ఫూర్తితో..
అంత్యోదయ స్ఫూర్తితో తాను ఎంపీగా ఎన్నికైన వెంటనే చేవెళ్ల ప్రాంతంలోని అర్హులందరికీ ఇండ్లు, జీవనోపాధి కోసం లోన్లు కల్పిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంకల్ప పత్రంలో పేర్కొన్నారు. అంత్యోదయ విధానంలో లాగా తక్కువ స్థాయి నుండి పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తానన్నారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను చెవిలో ప్రజలకు అందేలా చూస్తానని కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

రిజర్వేషన్లకు రక్షణ బీజేపీతోనే..
బీజేపీ మరోసారి అధికారంలోకొస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అన్న ప్రతిపక్షాల విమర్శలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిప్పి కొట్టారు. అంబేద్కర్ చెప్పిన మార్గంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం కేవలం మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే ఎత్తివేస్తుందని.. వాటి ద్వారా ఓబీసి, ఎస్సీ, ఎస్టి వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. సంకల్ప పత్రం విడుదల కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ అంజన్ కుమార్ గౌడ్, స్పోక్ పర్సన్స్ సునీత రెడ్డి, వీరేందర్ గౌడ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పంజర్ల ప్రకాష్, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, చేవెళ్ల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ రాజవర్ధన్ రెడ్డి, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు మధుసూదన్ పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show comments