NTV Telugu Site icon

Vemula Prashanth Reddy : పీయూష్‌ గోయల్‌ సర్పంచ్‌గా కూడా పనికిరాడు

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈపరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని, కేంద్రం తమ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. సమస్య పరిష్కారానికి చివరి వరకు కొట్లాడాలని, తెలంగాణ మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి అవమానకరంగా మాట్లాడారన్నారు.

బండి సంజయ్ అన్న మాటలు, బీజేపీ ఎంపీలు వరి వేయమని చెప్పిన మాటలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, నూకల బియ్యాన్ని అలవాటు మీ ప్రజలకు అలవాటు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ గా కుడా పనికిరాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు విమర్శలు చేయడం లేదో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతాం… తెలంగాణ రైతులు పండించిన పంటలకు కొనుగోలు చేయిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు, ఈసారి కేంద్ర ప్రభుత్వంను వదిలిపెడితే ప్రతి యాసంగికి ఇదే పరిస్థితి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.