V Hanumantha Rao Fires On Ambedkar Statue Issue: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ధరణిపై తాను గ్రామగ్రామాన యుద్ధం చేస్తానని హెచ్చరించారు. పంజాగుట్టలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్నే తొలగించినప్పుడు.. రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉండవచ్చా? అని నిలదీశారు. అమలాపురం నుండి తాను అంబేద్కర్ విగ్రహాన్ని తెప్పించానని.. అయితే ఆ విగ్రహాన్ని జైల్లో పెట్టి, తనపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాగుట్టలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిందన్న ఆయన.. వైఎస్సార్ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంటే, ఆమెకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. షర్మిల గురించి వాళ్ళ అన్నతో ప్రధాని మోడీ మాట్లాడారని, షర్మిలతో మోడీ మాట్లాడటాన్ని బట్టి చూస్తుంటే.. ఆ బాణం వదిలింది జగనేనని స్పష్టమవుతోందని అన్నారు.
బీజేపీ నేతలు అంబెడ్కర్ విగ్రహంపై ఎందుకు మాట్లాడటం లేదని వీ హనుమంతరావు ప్రశ్నించారు. షర్మిలపై టీఆర్ఎస్ దౌర్జన్యం నరేంద్ర మోడీకి గుర్తొంచిందని.. మరి అంబేద్కర్ విగ్రహంపై మోడీకి ఎందుకు గుర్తు రావడం లేదని నిలదీశారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో తమ ముగ్గురు ఎంపీల్లో ఎంతమంది మాట్లాడుతారో చూస్తానని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ధరణి రద్దు చేస్తామని బీజేపీ అంటోందని, మరి అప్పటివరకు కట్టిన బిల్డింగ్‌లను కూలగొట్టగలరా? అని అడిగారు. ఇప్పటి నుండే పెద్ద ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. షర్మిల, బీఎస్పీలకు చిత్తశుద్ధి ఉంటే.. అంబేద్కర్ ఇష్యూపై మాట్లాడాలన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోన్న బండి సంజయ్‌కి కూడా అంబేద్కర్ గుర్తుకు రావడం లేదా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై తప్పకుండా మాట్లాడాల్సిందేనని తాను భట్టి విక్రమార్కతో మాట్లాడానని వీ హనుమంతరావు చెప్పారు.