ఇటీవల మహ్మద్ ప్రవక్త మీద నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాల్లో ఆగ్రహావేశాలు రగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆలోచన.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలు రోజుకొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడు. కర్నాటకలో ఈశ్వరప్ప జాతీయ జెండాను మారుస్తామంటారు.. వీళ్ల జాగీరా అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.
ఇతర మతాల వారిని కించ పరచడమేనా.. బీజేపీ ఏజెండా అంటూ ఆయన ధ్వజమెత్తారు. గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి పరిస్థితి ఏంటని ఆయన మండిపడ్డారు. గల్ఫ్ నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఇవ్వం అంటే ఏంటి పరిస్థితి అని ఆయన ప్రశ్నించారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన వారిని జైల్లో పెట్టాలని, హిందూ- ముస్లిం మధ్య చిచ్చు పెట్టి ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నారన్నారు. బీజేపీకి మూడోసారి అవకాశం ఇస్తే.. దేశం ముక్కలు అవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ జోడో భారత్ యాత్ర చేపడుతోందని ఆయన వెల్లడించారు. రేప్ చేసే వారిని మరణశిక్ష విధిస్తే.. ఇలాంటి కేసు తగ్గిపోతాయన్న వీహెచ్.. న్యాయస్థానం త్వరతగతిన నిర్ణయాలు తీసుకుంటే .. నేరాలు తగ్గుతాయన్నారు.
