V Hanumantha Rao Counter To Sajjala Ramakrishna Reddy Over AP Bifurcation: ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే తమ విధానమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. సజ్జల ఆలోచనలో మార్పు రావడం లేదని.. ఏపీ, తెలంగాణ కలిసే పని కాదని తేల్చి చెప్పారు. ఇన్నాళ్లూ అన్యాయం జరిగిందనే తెలంగాణ వచ్చిందన్నారు. పాలిటికల్ మైలేజ్ కోసమే సజ్జల మాటలని.. ఆయన మాటల్ని ఎవ్వరూ నమ్మరని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు ఏదైనా మాట్లాడుతారని, పొలిటికల్ మైలేజ్ కోసం లేనిపోని వాదనలు చేయొద్దని, ఆంధ్ర-తెలంగాణ కలిసేది అసంభవమని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు కదా.. ముందు దాని కోసం ప్రయత్నించండి’ అని హితవు పలికారు. ‘‘ప్రధాని మోడీకి జగన్ అత్యంత సన్నిహితుడు కదా.. ఆయన చొరవతో స్పెషల్ స్టేటస్ అడుగు, కొట్లాడు. అంతేకానీ కలిసిపోతాం, కలుస్తాం అనేది ఏంటి?’’ అని వీహెచ్ మండిపడ్డారు.
కాగా.. రాష్ట్ర విభజన గురించి వదిలేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేయగా, సజ్జల రామకృష్ణ వాటిని తోసిపుచ్చారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచి వైఎస్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. విభజన చట్టం అసంబద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని.. మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనే అని స్పష్టం చేశారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని.. విభజనకు వ్యతిరేకంగా తాము కోర్టుల్లో తమ వాదనల్ని బలంగా వినిపిస్తామని అన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని, లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరుతామన్నారు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉండాలన్నదే తమ విధామన్నారు. విభజన చట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని.. ఏపీ, తెలంగాణ కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి అని సజ్జల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ పైవిధంగా రియాక్ట్ అయ్యారు.