Uttam Kumar Reddy : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ నేతలు అనుసరించిన విధానాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని, అటువంటి ఘోర తప్పిదాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రూ. 1.80 లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్ఎస్ ఘనతేనని, ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాగ్ కూడా పేర్కొందని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంది కేవలం 70 నుండి 80 టీఎంసీల నీరు మాత్రమేనని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు.
కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మంత్రి విమర్శించారు. 2020లో కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు 33 శాతం నీరు సరిపోతుందని బీఆర్ఎస్ నేతలు రాసివ్వడం వల్లే ఇవాళ ట్రిబ్యునల్ ముందు ఏపీ బలమైన వాదన వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణకు 71 శాతం వాటా కావాలని కేంద్రానికి, ట్రిబ్యునల్‌కు స్పష్టంగా తెలియజేశామని ఆయన వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఏపీతో కుమ్మక్కై, అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించుకుని తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని హరీశ్ రావును మంత్రి నిలదీశారు. కనీసం కాలువల తవ్వకం కూడా చేపట్టకుండా, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. “కాల్వలు తవ్వకుండా బకెట్లతో నీరు ఇవ్వాలనుకున్నారా?” అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన రూ. 5000 కోట్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చెల్లించామని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కక్షతోనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఎస్సెల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో డిండి ప్రాజెక్టుకు రూ. 1800 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, బీఆర్ఎస్ నేతలు చేసిన అప్పులకు నెలకు రూ. 16 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అక్రమంగా సంపాదించిన సొమ్మును జేబుల్లో నింపుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Sharath Kumar : విజయ్ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!
