NTV Telugu Site icon

Uttam Kumar Reddy: అక్కడ 50 వేల మోజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్‌బై..!

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ, కాపుగల్లు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ, రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.. కోదాడ ప్రాంతం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. గ్రామంలో అరాచక శక్తులు, దాదాగిరి చేసేవాళ్లు పెరిగిపోయారంటూ మండిపడ్డారు.. గతంలో కోదాడ ప్రాంతం ప్రశాంతంగా ఉంది… ఇప్పుడు ఇతర పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే, ఎమ్మెల్యే కు ఇదే చివరి అవకాశం… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. కోదాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ ఓట్లు కంటే ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు.

Read Also: Viral: ఆ మాజీ మంత్రి కాంగ్రెస్‌ గూటికి..? సోషల్‌ మీడియాలో వైరల్..

ఇక, దళితబంధు విషయంలో 100 యూనిట్లకు రెండు లక్షల రూపాయలు లంచం తీసుకోవడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. గుడిబండ గ్రామంలో దళిత బంధు పథకంలో అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల నుండి రెండు లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.. కోదాడ ప్రాంతంలో అభివృద్ధి శూన్యం… టీఆర్ఎస్‌ పార్టీ నాయకులే ఇప్పుడు ఉన్న నాయకున్ని త్వరలోనే వెళ్లగొట్టడం ఖాయం అంటున్నారని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే, పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ ఎంపీ.. గుడిబండ గ్రామంలో అత్యధిక మెజారిటీ వస్తుంది, గుడిబండ గ్రామంలో 80 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేస్తారన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50 వేల మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు. ఇప్పుడు ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.