Uttam Kumar Reddy : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టులను సందర్శించిన అనంతరం గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్‌ఎస్ గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2023లో తాను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి శాఖపై లోతుగా సమీక్షలు జరిపానని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అద్భుతాల ప్రచారమంతా పచ్చి అబద్ధమని తేలిపోయిందన్నారు. గత పాలకుల హయాంలో జలవనరుల శాఖలో అడ్డూఅదుపూ లేకుండా జరిగిన వందల కోట్ల అక్రమాలు, అవినీతి విచారణలో బయటపడ్డాయని ఆయన వెల్లడించారు.
రీ-డిజైనింగ్ దోపిడీ.. లక్ష కోట్లు పెట్టినా సున్నా
గత ప్రభుత్వం సగం పూర్తయిన ప్రాజెక్టులను సైతం కేవలం రీ-డిజైనింగ్ పేరుతో మార్చేసి అంచనా వ్యయాలను ఇష్టారాజ్యంగా పెంచిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పదేళ్ల సుదీర్ఘ కాలంలో కనీసం దేవాదుల ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేయలేకపోయారని, సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 8,000 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం రాలేదని మండిపడ్డారు. “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని డబ్బా కొట్టుకుంటూ దాదాపు లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు నిట్టనిలువునా కూలిపోయింది. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. అన్నారం బ్యారేజీని ఒకచోట డిజైన్ చేసి, దానికి పూర్తి భిన్నంగా మరొక చోట నిర్మించారు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం అసలు వినియోగానికే పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తేల్చి చెప్పింది” అని మంత్రి స్పష్టం చేశారు.
రిపేర్లు పూర్తి చేస్తాం.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నుండి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోకుండానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా వరి పంట పండేలా చేసి చూపించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన కరువును చూపిస్తూ బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తాము పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందడుగు వేస్తున్నామని వివరించారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను పునరావాసం (రిహబిలిటేషన్) పరిధిలోకి తెచ్చి, త్వరితగతిన రిపేర్లు పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పులన్నింటినీ సరిదిద్ది, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.

