Site icon NTV Telugu

Uttam Kumar Reddy : బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖకు ‘చీకటి రోజులు’..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంపై గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఎండగడుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలనే కనీస చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తమ వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో పాలమూరు-నల్గొండ జిల్లాల ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ గట్టిగా డిమాండ్ చేయలేదని మండిపడ్డారు. పదేళ్ల సుదీర్ఘ పాలనలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని, కానీ కాళేశ్వరం పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తే చివరికి మూడు బ్యారేజీలు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.

గత పాలకుల నిర్వాకం వల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయారని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు ఎంతో మంచి పేరు ఉండేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులను మార్చారని ఆరోపించారు. ఒక ట్రంక్ లైన్ వేసి, అందులో భారీగా లాభపడి, దానికే ఆహా ఓహో అంటూ సంబరాలు జరుపుకోవడం వారి స్థాయికి నిదర్శనమని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టినప్పుడు, వాటిని ఆపాలని కోరుతూ కేంద్రం అపెక్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమావేశానికి హాజరుకాకపోవడం ఇరిగేషన్ శాఖ చరిత్రలోనే ఒక ‘చీకటి రోజు’ అని ఆయన అభివర్ణించారు.

Waste-to-Energy: వేస్ట్‌ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ

బీఆర్ఎస్ వైఫల్యాలను గణాంకాలతో వివరిస్తూ, 2004 నుండి 2014 వరకు 715 టీఎంసీల కృష్ణా జలాలు బేసిన్ దాటి వెళ్తే, బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏకంగా 1442 టీఎంసీల నీళ్లు బేసిన్ దాటి బయటకు వెళ్లిపోయాయని మంత్రి వెల్లడించారు. ఎస్ఎల్బీసి (SLBC) పనులను పదేళ్లలో పూర్తి చేయలేకపోయిన బీఆర్ఎస్, కోవిడ్ నెపం చెప్పడం హాస్యాస్పదమని, కోవిడ్ ఉన్నప్పుడు కాళేశ్వరం పనులు ఎలా పూర్తి చేశారని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయని, వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్బీసి పనులను పూర్తి చేస్తామని సభకు హామీ ఇచ్చారు.

మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేస్తూ, బడ్జెట్ రిలీజ్ చేయగానే కమిషన్లు తీసుకునే అలవాటు తమకు లేదని, హరీష్ రావుకు ఉన్న పద్మాలయ స్టూడియో అలవాట్లు తమకు ఉండవని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకు లెక్క చెబుతామని, చరిత్రలో నిలిచిపోయేలా ఇరిగేషన్ శాఖను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తమ పదవీ కాలం ముగిసేలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ నిబంధనల విషయంలో అప్పుడు బీఆర్ఎస్ పెట్టిన నిబంధనలే ఇప్పుడు తమకు వర్తిస్తాయని, నీళ్లు, పనులు ఆంధ్రకు ఇచ్చామని బీఆర్ఎస్ సభలు పెట్టి అబద్ధపు ప్రచారాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

CP VC Sajjanar : తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే.. వారం రోజులు ‘స్పెషల్ డ్రైవ్’

Exit mobile version