ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ములుగు-హైదరాబాద్ ప్రధాన రహదారి పందికుంట స్టేజి వద్ద అడ్వకేట్ మల్లారెడ్డి పై సినీ పక్కిలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు అడ్వకేట్ మల్లారెడ్డి తన సొంత వాహనంలో వెళ్తుండగా, జాతీయ రహదారి పందికుంట స్టేజీ వద్ద మాటువేశారు దుండగులు. అయితే.. స్విఫ్ట్ కారులో వచ్చిన ఐదుగురు మల్లారెడ్డి వెళ్తున్న ఇన్నోవా కారును అటకాయించి, ఆ తర్వాత డ్రైవర్‌ను చితకబాది, ఆ తర్వాత కత్తులు, గొడ్డళ్లతో మల్లారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడికి నుంచి పారిపోయారని డ్రైవర్ వెల్లడించారు.
ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మల్లారెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. ఆయన మైనింగ్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు. అలాగే ములుగు మండలం మల్లంపల్ల గ్రామంలో పెట్రోల్ పంపు సైతం ఉన్నది. అయితే, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
