NTV Telugu Site icon

Kishan Reddy: కేసీఆర్‌ సారూ ఎన్నోసార్లు లేఖలు రాశా.. ఇప్పటికైనా వాటిపై..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: సీఎం కేసీఆర్‌ కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మరోసారి లేఖరాశారు. కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948 న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుండి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటినుండి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అదే 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుందని తెలిపారు.

Read also: Revanth Reddy: కేటీఆర్‌ కు రేవంత్‌ సవాల్‌.. ఆవిషయంలో ఎక్కడికైనా చర్చకు నేను రెడీ

ఇవే కాకుండా, రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అందులో ₹32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. ఈ 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ భూమి సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు అనేకసార్లు లేఖలు వ్రాయడం జరిగిందని కిషన్‌ రెడ్డి లేఖలో పేర్కొ్న్నారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు 284 హెక్టార్ల భూమిని మాత్రమే జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయడం జరిగిందన్నారు. ఇంకా 4,048 హెక్టార్ల భూమిని జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయవలసి ఉందని వెల్లడించారు. ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టుల వివరాలను ఈ లేఖకు అనుబంధంగా మీకు పంపిస్తున్నానని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, వేలాది కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన జాతీయ రహదారులు ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయన్నారు.

Read also: Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్‌.. నేను రాలేనంటూ కవిత లేఖ

అంతేకాకుండా అనేక ప్రాంతాలలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయాయని తెలిపారు. అనేకమంది ప్రయాణికుల ప్రమాదాలు కూడా తగ్గాయన్నారు. అదే విధంగా ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సేకరించి ఇచ్చినయెడల ఆయా రహదారి ప్రాజెక్టులు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుగా ఉంటుందన్నారు. తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుందని లేఖలో తెలిపారు. కావున, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సకాలంలో అందించి, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి వీలుగా చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నానని కిషన్‌ రెడ్డి, సీఎం కేసీఆర్‌కు లేఖలో తెలిపారు. మరి దీనిపై సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
TS MLC Elections: బండిల్స్ పంపిణీలో గందరగోళం.. మొదటి రౌండ్ ఫలితాలు ఇక అప్పుడే..

Show comments