NTV Telugu Site icon

Off The Record: ఆ ఎంపీ మౌనమే ఆయనను చర్చల్లోకి తీసుకొస్తుందా.?

Venkatesh Netha

Venkatesh Netha

Off The Record: ఆయన టీఆర్ఎస్‌ ఎంపీ. పెద్దగా చర్చల్లో ఉండరు. కానీ.. ఎంపీ మౌనమే ఆయన్ని చర్చల్లోకి తీసుకొస్తోంది. గతంతో పోల్చితే దూకుడు తగ్గించారని కేడర్‌ వాదన. దీనిపై పార్టీలోనే భిన్నవాదనలు ఉన్నా.. ఎంపీగారి సైలెన్సే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోందట.

ఎంపీ మౌనంగా ఉండటంతో చర్చ
ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వెంకటేష్ నేతకాని .. వీఆర్ఎస్ తీసుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు వెంకటేష్. గులాబీ కండువా కప్పుకోవడంతోనే వెంకటేష్‌కు పెద్దపల్లి లోకసభ నుంచి పోటీచేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికలో పెద్దపల్లి ఎంపీగా గెలిచి లోకసభలో అడుగుపెట్టారు. అప్పట్లో రాజకీయ చర్చల్లో నలిగిన ఆయన తర్వాత పెద్దగా మెయిన్‌స్ట్రీమ్‌లోకి వచ్చింది లేదు. ఇప్పుడు మౌనవ్రతంతో టాక్‌ ఆఫ్‌ ది పార్టీ అయ్యారట.

ఎంపీ ఎందుకు స్లో అయ్యారు?
ఎంపీగా గెలిచాక యక్టివ్‌గా ఉంటూ వచ్చారు వెంకటేష్. పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొని కేంద్ర సర్కార్‌పై విమర్శలు చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్నీ ఆయన వదలలేదు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దపల్లి ఎంపి యాక్టివ్‌గా లేరనే గుసగుసలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఎందుకు ఎంపి స్లో అయ్యారు అని ఆరా తీస్తున్నారట. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను.. నాయకుల తీరును జనం గమనిస్తున్నారు. ఆ క్రమంలోనే ఎంపీపైనా ఫోకస్‌ పడిందట.

పార్టీ అప్పగించిన పనిలో ఉన్నారా?
ఎంపీ వెంకటేష్‌ మౌనంగా ఉండటానికీ కారణాలు ఉన్నాయన్నది గులాబీ నేతలు చెప్పేమాట. పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడంతో వాటితో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారుతుండటంతో.. వెంకటేష్‌కు కొన్ని బాధ్యతలు అప్పగించారట. ఆ టాస్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారట ఎంపీ. అందుకే మునుపటిలా చర్చల్లోకి రావడం లేదని.. గతంలో ప్రభుత్వ ఉద్యోగి కావడంతో.. ఆ లైన్‌లో పనిచేసుకుంటున్నారని కొందరి వాదన. ఎంపీ మౌనానికి అదే ప్రధాన కారణమని అనుచరుల మాట కూడా.

ఎంపీ మౌనంతో సందేహాలకు బీజం
షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ.. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇప్పటికే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. నేతల కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకే పెద్దపల్లి పరిధిలో ఎంపీ చర్చల్లోకి వచ్చారని… ఒక్కసారిగా మౌనం దాల్చడంతో అనుమానాలకు బీజం వేసిందని గులాబీ శ్రేణుల అభిప్రాయం. మరి.. పార్టీ అప్పగించిన టాస్క్‌ పూర్తయిన తర్వాత ఎప్పటిలా ఎంపీ వెంకటేష్‌ పొలిటికల్ లైన్‌లో కనిపిస్తారో.. లేక మౌనంగానే పనిచేసుకుని వెళ్లిపోతారో చూడాలి.